
వైద్య విద్యార్థి సాయి ప్రసాద్ మృతి
కోలార్‌లో దుండగులు పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ మంగళవారం మృతి చెందాడు.
బెంగళూరు : కోలార్‌లో దుండగులు పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ మంగళవారం మృతి చెందాడు. ఈ నెల 12న సాయి ప్రసాద్పై దుండగులు పెట్రోలు పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 70 శాతం గాయపడిన అతను బెంగళూరులోని సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతున్నాడు. అయితే గాయాలు తీవ్రంగా ఉండటంతో పాటు, మూత్రపిండాలు పనిచేయకపోవడంతో వైద్యులు డయాలసిస్ నిర్వహించారు. కృత్రిమ శ్వాసను కొనసాగించినా... పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కామేశ్వర సాయిప్రసాద్ (22) మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈనెల 12వతేదీ రాత్రి 10.30 సమయంలో దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు అతడి మెడలో గొలుసును లాగడానికి ప్రయత్నించారు. కామేశ్వర్ ప్రతిఘటించడంతో దుండగులు అతనిపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యారు. స్థానికులు వెంటనే మంటలు ఆర్పి, దగ్గరలోని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కామేశ్వర్‌ను బెంగుళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు.
మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన బాధితుడి తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణశర్మ న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. లక్ష్మణ శర్మ కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగా, జ్యోతి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతూ హైదరాబాద్ లోని మారేడ్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. కామేశ్వర సాయి ప్రసాద్ మృతి మారేడ్‌పల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.