వైరల్‌గా మారిన పోలీసు ఆఫీసర్‌ ఫొటో! | police officer took off her bulletproof vest to comfort a baby | Sakshi
Sakshi News home page

వైరల్‌గా మారిన పోలీసు ఆఫీసర్‌ ఫొటో!

Published Sun, Sep 4 2016 1:19 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

వైరల్‌గా మారిన పోలీసు ఆఫీసర్‌ ఫొటో!

వైరల్‌గా మారిన పోలీసు ఆఫీసర్‌ ఫొటో!

మహిళా పోలీసు ఆఫీసర్‌ అయిన మిషెల్లీ బర్టన్‌ తన బృందంతోపాటు ఆ ఇంటికి చేరుకునేలోపే అక్కడ బీభత్సం జరిగిపోయింది. డ్రగ్స్ అధికంగా తీసుకున్న ఓ 30 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు విడిచాడు. అతని భార్య కూడా డ్రగ్స్‌ మత్తులో స్పృహ కోల్పోయి.. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

ఆ జంట పిల్లలు దీనంగా రోదిస్తూ దిక్కులు  చూస్తున్నారు. 'అమ్మా, నాన్నా ఎందుకు మేల్కొనడం లేదు' అంటూ దీనంగా రోదిస్తూ అడిగింది ఏడేళ్ల కూతురు. తనకు మూడేళ్లు, రెండేళ్ల వయస్సున్న ఇద్దరు తమ్ముళ్లు, ఒక నెల వయస్సు కలిగిన చెల్లెలు ఉంది.

అమెరికా అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో మంగళవారం ఓ అపార్ట్‌మెంట్‌ నుంచి అత్యవసర నంబర్‌కు కాల్‌ రావడంతో మిషెల్లీ బృందం అక్కడికి వెళ్లింది. కానీ, వారు వచ్చేలోపే ఆ పిల్లల తండ్రి చనిపోగా, తల్లి స్పృహలో లేకుండా విషమంగా ఉంది. ఆమెను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వెంటనే ఆ నలుగురి పిల్లల్ని ఏం చేయాలో తెలియక.. తమ వెంట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ముగ్గురు అంతో-ఇంతో పెద్ద పిల్లలు కావడంతో వారికి బొమ్మలు, స్టేషన్‌లో ఉన్న టార్చ్‌లైట్లు ఇచ్చి బుజ్జగించి ఏడ్పు మాన్పించారు.

కానీ, నెల వయస్సున్న చిన్నారిని ఎలా ఓదార్చాలో వారికి అర్థం కాలేదు. ఆ చిన్నారి బాధ్యతను మిషెల్లీ తన భుజాలపై వేసుకుంది. తనను బుజ్జగించేందుకు తాను పోలీసు అనే విషయాన్ని మరిచిపోయింది. తుపాకీ తీసి పక్కనపెట్టింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ విప్పేసింది. ఓ తల్లిలా ఆ పాపాయిని గుండెలకు హత్తుకొని లాలించింది. ఆ రోజు పోలీసు స్టేషన్‌ నుంచి ఇంటికి కూడా వెళ్లలేదు. మిషెల్లీ భర్త ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫోన్‌ చేయడంతో అతనికి ఈ విషయం తెలిసింది. చిన్నారిని గుండెలకు హత్తుకొని లాలిస్తున్న తన భార్య మిషెల్లీ ఫొటోను చూసి మురిసిపోయిన ఆమె భర్త బ్రియన్‌ బర్టన్‌.. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు. స్వయంగా ఇద్దరు పిల్లల తల్లైన మిషెల్లీ తాను పోలీస అధికారిని అనే అహాన్ని పక్కనబెట్టి మరీ ఆ చిన్నారిని లాలించిందని, అలా లాలిస్తున్న ఫొటోలో ఆమె ఎప్పుడూ లేనంత అందంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఆ మర్నాడు ఉదయం నలుగురు పిల్లల్ని పోలీసులు బాలల సంక్షరణ కేంద్రానికి అప్పగించారు. కానీ, ఓ మాతృమూర్తిలా ఆ చిన్నారికి మిషెల్లీ పంచిన ప్రేమ నెటిజన్లను కదిలిస్తోంది. ఆమె ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement