రాజకీయ విరాళాలకు బ్రేక్
వరుసపెట్టి ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. వివిద రాజకీయ పార్టీలు ఇంతకుముందు ఎడా పెడా విరాళాలు తీసుకునేవి. అయితే ఇక మీదట నగదు రూపంలో కేవలం 2వేలకు మించి ఎవరి వద్దా విరాళాలు తీసుకోడానికి వీల్లేదని జైట్లీ స్పష్టం చేశారు. 2వేల రూపాయలకు మించి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే అందుకు బాండ్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. వాటిని కూడా చెక్కులు లేదా డెబిట్/క్రెడిట్ కార్డులతో కొనాల్సి ఉంటుంది.
ఆయా బాండ్లను కేవలం రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు మాత్రమే నగదుగా మార్చుకోడానికి వీలుంటుంది. దీన్నిబట్టి.. రాజకీయ విరాళాలు ఇచ్చేవారు ఎవరన్న విషయం కూడా స్పష్టంగా తేలిపోతుంది. తద్వారా పార్టీల నిధుల విషయంలో కొంతవరకు పారదర్శకత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రకటన చేయడానికి ముందు.. ఇది మనందరికీ సంబంధించిన విషయం కాబట్టి కాస్తంత జాగ్రత్తగా వినాలంటూ జైట్లీ ఒకింత చెప్పి మరీ ప్రకటన చేశారు.