పతన రాజకీయం | political values decreasing | Sakshi
Sakshi News home page

పతన రాజకీయం

Published Fri, Dec 18 2015 1:52 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

పతన రాజకీయం - Sakshi

పతన రాజకీయం

 ‘సెక్స్ రాకెట్’పై చర్చకు టీడీపీ అడ్డుచక్రం.. అందుకు మహనీయుని పేరు వాడుకున్న ఘోరం
 
సందర్భం: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. ఐదు రోజులు మాత్రమే. అదీ మధ్యాహ్నం రెండు గంటల వరకే చర్చలు..
 
నేపథ్యం: అప్పు పేరుతో బడుగు, బలహీన ప్రజలను ముగ్గులోకి దించి అలవికాని వడ్డీల భారం మోపి నిస్సహాయులను చేసి సెక్స్ రాకెట్‌లోకి దించుతున్న బెజవాడ మాఫియా ముఠా ఆగడాలు బయటపడి దేశం నివ్వెరపోయిన సమయం. ఈ పాపిష్టి సొమ్ములో పాలక పార్టీ పెద్దలకూ వాటాలున్నాయనే భయంకర సత్యం వెలుగులోకి వస్తున్న క్షణాలు..
 
ఏం జరిగింది?: యావత్‌జాతిని నిర్ఘాంతపరిచిన ఈ నైచ్యంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్టే ప్రతిపక్షం వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. కానీ, పాలక పక్షం తన పార్టీ వారిని కాపాడుకునే లక్ష్యంతో దిగ్భ్రాంతికరమైన ఈ అంశంపై చర్చను అడ్డుకుంది. అంతేకాదు. ఐదు రోజుల విలువైన కాలంలో ఒక రోజును కరిగించేసింది.
 
మరీ ఘోరం..: అడ్డుకున్న తీరు మరీ ఘోరం! భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో పుట్టి పెరిగే ప్రతి మనిషికీ ప్రాతఃస్మరణీయుడు, బడుగు-బలహీన వర్గాల దేవుడు డాక్టర్ అంబేడ్కర్ పేరును అందుకు వాడుకున్నారు. ఎటువంటి ముందస్తు ప్రస్తావనా లేకుండా అంబేడ్కర్ పేరును వాడుకుని సెక్స్ రాకెట్‌పై చర్చను అడ్డుకున్న తీరు విలువల పతనానికి నిలువెత్తు సంకేతం.
 
 వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్షం
  ‘కాల్‌మనీ’పై చర్చను తిరస్కరించిన స్పీకర్ కోడెల
    వైఎస్ జగన్ మైక్ రెండుసార్లు అర్ధంతరంగా కట్
  విపక్ష నేతపై వ్యక్తిగత విమర్శలు చేసిన మంత్రులు


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వారం రోజులుగా అట్టుడికిన కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌తో ఇరుకునపడ్డ అధికార తెలుగుదేశంపార్టీ ఈ అంశంపై శాసనసభ శీతాకాల సమావేశాల తొలి రోజు.. గురువారం చర్చకు రాకుం డా అడ్డుకుంది. అధిక వడ్డీలతో ప్రజల ఆస్తులు గుంజుకోవడమే కాకుండా మహిళలను వ్యభిచార కూపంలోకి లాగుతున్న నీచ కార్యక్రమంలో భాగస్వాములైన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న టీడీపీ తొలిరోజు శాసనసభలో కూడా అదే తీరులో వ్యవహరించింది. అత్యంత హేయమైన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం పక్కనపెట్టి, రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయడం ద్వారా సమస్యను పక్కదారి పట్టించాలన్న వ్యూహానికి కొనసాగింపుగా అసెంబ్లీలో అంబేడ్కర్ పేరును తెరపైకి తెచ్చింది.

ప్రజల ధన మాన ప్రాణాలతో వ్యాపారం చేసిన స్వంతపార్టీ నేతలను కాపాడుకునేందుకు రాజ్యాంగ నిర్మాత పేరును నిస్సిగ్గుగా వాడుకుంది. వారం రోజుల నుంచి ప్రకంపనలు సృష్టిస్తున్న సెక్స్ రాకెట్ మీద చర్చకోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. విజయవాడ కేంద్రంగా అధికార పార్టీ అండదండలతో సాగిన భారీ వడ్డీ-లైంగిక దోపిడీ వ్యవహారంపై అధికారపార్టీని ఎండగట్టేందుకు అస్త్రశస్త్రాలతో సభకు వచ్చిన విపక్షానికి.. అధికార పక్షం అవకాశం ఇవ్వలేదు. సెక్స్ రాకెట్ మీద చర్చ జరగకుండా అడ్డుకొనే వ్యూహంలో భాగంగా... అసెంబ్లీ ఎజెండాలో లేని ‘అంబేడ్కర్-రాజ్యాంగం’పై చర్చ అంశాన్ని తెర మీదకు తెచ్చింది. కాల్ మనీ వ్యవహారం మీద చర్చించిన తర్వాత అంబేడ్కర్ మీద చర్చిద్దామని విపక్షం చేసిన సూచనను సైతం పట్టించుకోలేదు. చర్చకు అవకాశం ఇవ్వకుండా వాయిదా తీర్మానం తిరస్కరించినందుకు నిరసిస్తూ..‘కాల్ మనీ చంద్రబాబు డౌన్‌డౌన్.. సెక్స్ రాకెట్ చంద్రబాబు డౌన్‌డౌన్.. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం’ అని విపక్ష సభ్యులు చేసిన నినాదాలతో సభ హోరెత్తింది.

కాల్‌మనీ అంశం మీద వాయిదా తీర్మానం తిరస్కరణతో మొదలైన సభ.. విపక్ష సభ్యుల నిరసనల మధ్య మూడుసార్లు వాయిదా పడింది. గందరగోళ పరిస్థితుల మధ్యే అధికార పక్ష సభ్యులు పలువురు మాట్లాడటానికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. విపక్ష నేత జగన్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి మైక్ కట్ చేశారు. కెమెరాలకు అడ్డంగా నిలబడి శాసనసభ ప్రసారాలను అడ్డుకుంటారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యు లు శివప్రసాదరెడ్డి, డి.రాజాను స్పీకర్ సస్పెం డ్ చేశారు. విపక్ష సభ్యుల నిరసనలు, హోరెత్తిన నినాదాల మధ్య.. మూడోసారి సమావేశమైన తర్వాత శుక్రవారానికి వాయిదా పడింది.

వాయిదా తీర్మానం తిరస్కరణ
 విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ-సెక్స్ రాకెట్, మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు గురువారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. అత్యంత ముఖ్యమైన అంశం మీద చర్చకు అనుమతించకుండా తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి తమ నిరసన తెలిపారు. ఈ సమయంలో వైఎస్సార్‌సీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. విజయవాడ కేంద్రంగా అత్యంత హేయంగా సాగిన కాల్‌మనీ వ్యవహారంలో ప్రజల ధన మాన ప్రాణాలను దోచుకున్నారని, ముఖ్యమైన అంశం మీద చర్చకు అనుమతించకపోవడం అన్యాయమని, చర్చకు అనుమతించాలని పెద్దిరెడ్డి కోరారు.

శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకొని.. కాల్‌మనీ అంశం మీద శుక్రవారం ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చ చేపడదామని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు విపక్ష సభ్యులు అంగీకరించకుండా.. స్పీకర్ పోడియం వద్దే నిలబడి నినాదాల హోరును కొనసాగించారు. ఈ దశలో విపక్ష నేత జగన్‌కు మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ అనడంతో ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, దోషులతో ఉన్న ఫోటోల గురించి జగన్ ప్రస్తావించిన వెంటనే స్పీకర్ మైక్ కట్ చేశారు.

‘‘వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఆ అంశం మీద చర్చలోకి వెళ్లకూడదు. ప్రభుత్వం శుక్రవారం ప్రకటన చేసిన తర్వాత చర్చలోకి వెళదామని చెప్పింది. ఇదే అంశం మీద 344 నిబంధన కింద కూడా ప్రతిపక్షం నోటీసు ఇచ్చింది. ప్రకటన చేయడానికి ప్రభుత్వానికి సమయం ఇవ్వండి. సభ సజావుగా జరగనివ్వండి’’ అని స్పీకర్ చేసిన విజ్ఞప్తికి విపక్ష సభ్యులు సానుకూలంగా స్పందించలేదు. స్పీకర్ పోడియం వద్ద నిలబడి.. ‘కాల్ మనీ చంద్రబాబు డౌన్‌డౌన్.. సెక్స్ రాకెట్ చంద్రబాబు డౌన్‌డౌన్.. కాల్‌మనీ మీద చర్చకు అనుమతించండి.. అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్యే మంత్రులు యనమల, రావెల కిషోర్‌బాబు, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడారు. సెక్స్ రాకెట్ అంశాన్ని పక్కనబెట్టి విపక్ష నేత మీద వ్యక్తిగత విమర్శలకు దిగారు. సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో 9.55 గంటలు సభ వాయిదా పడింది.

తెరపైకి అంబేడ్కర్ మీద చర్చ
 సభ తిరిగి 10.35 గంటలకు ప్రారంభమైప్పుడు అధికారపార్టీ సభ్యులు వ్యూహాత్మకంగా అంబేడ్కర్ మీద చర్చను తెర మీదకు తెచ్చారు. అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో పార్లమెంట్‌లో ‘అంబేడ్కర్-రాజ్యాంగం’ అనే అంశం మీద చర్చ జరిగిందని, అదే అంశం మీద శాసనసభలోనూ చర్చించాలని బీఏసీ సమావేశంలో విపక్షం అంగీకరించిందని, కానీ సభలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందంటూ మంత్రి యనమల, చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, మిగతా ఎమ్మెల్యేలు కొత్త పల్లవి అందుకున్నారు. దీనికి విపక్ష జగన్ దీటుగా సమాధానం ఇచ్చారు. సమస్యను పక్కదోవ పట్టించడానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను సైతం వాడుకుంటున్నారని, ఆయన ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హేయమైన సెక్స్ రాకెట్ మీద చర్చ జరిగిన తర్వాత అంబేడ్కర్ మీద చర్చిద్దామని సూచించారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో.. వాయిదా తీర్మానం మీద చర్చ కోసం పట్టుబట్టిన విపక్షం నినాదాలతో సభను హోరెత్తిస్తూ తన నిరసనను కొనసాగించింది. వైఎస్సార్‌సీపీ సభ్యుడు డి.రాజా కెమెరాలకు అడ్డంగా నిలబడి ప్రసారాలకు అడ్డుతగులుతున్నారంటూ స్పీకర్ హెచ్చరించారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్య 10.55 గంటలకు సభ రెండోసారి వాయిదా పడింది.
 
 విపక్ష నేతకు ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వరా?
 మూడోసారి సభ ప్రారంభమైనప్పుడూ విపక్ష సభ్యుల నిరసన, నినాదాలు కొనసాగాయి. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విపక్ష నేత జగన్‌కు సరిగా చెప్పినట్లు లేరని, కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు అన్నారు. జగన్‌కు అండర్‌స్టాండింగ్ సమస్య ఉందంటూ మంత్రి యనమల వ్యక్తిగత దూషణ చేశారు. తమ నాయకుడికి కాసేపు మాట్లాడే అవకాశం ఇస్తే పోయేదేమీ లేదంటూ వైఎస్సార్‌సీపీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి సూచించగా... నిబంధనలు అంగీకరించవని స్పీకర్ సమాధానం చెప్పారు. నిబంధనలు పాటించని సభ్యుల మీదా చర్యలు తీసుకోవాలంటూ, ఇద్దరు విపక్ష సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని మంత్రి యనమల ప్రవేశపెట్టారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు బి.శివప్రసాదరెడ్డి, దాడిశెట్టి రాజాను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభ్యుల సస్పెన్షన్ తర్వాత విపక్ష సభ్యుల నినాదాల హోరు మరింత పెరిగింది. ‘ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం..’ అంటూ హోరెత్తిన నినాదాల మధ్య సభ శుక్రవారానికి వాయిదా పడింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement