అరాచకం..! | TDP leaders over action | Sakshi
Sakshi News home page

అరాచకం..!

Published Mon, Feb 27 2017 10:55 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

అరాచకం..! - Sakshi

అరాచకం..!

హెచ్చుమీరుతున్న అసాంఘిక సంస్కృతి
గ్యాంగ్‌ల ఆగడాలతో ప్రజల బెంబేలు
టీడీపీ ప్రజాప్రతినిధుల కుమారుల ఇష్టారాజ్యం
వారికి పెద్దల దన్ను... ఆపై పోలీసుల వత్తాసు
విజయవాడలో ఇదీ చిత్రం


సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ యువతి లేవలేని స్థితిలో పడి ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విచారణ చేపట్టారు. ఆమెను బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకుంటున్న కుటుంబాలకు చెందిన యువతిగా గుర్తించారు. ఉపాధి చూపిస్తామని చెప్పి కొందరు యువకులు ఆమెను విజయవాడకు తీసుకొచ్చి కొన్ని రోజులపాటు లైంగికదాడులకు పాల్పడి ఇలా రోడ్డుపక్కన పడేసి వెళ్లారని గుర్తించారు. ఆ యువకులపై ఆరా తీసిన పోలీసులు అంతలోనే మిన్నుకుండిపోయారు. గుట్టుచప్పుడు కాకుండా ఆమెను పశ్చిమ బెంగాల్‌ పంపించి వేశారు. ఎందుకంటే ఆ యువతిపై లైంగిక దాడులకు పాల్పడిన బృందానికి నాయకుడు ఓ టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడు మరి. విజయవాడలో విలయతాండవం చేస్తున్న విశృంఖలత్వానికి ఇది ఓ మచ్చుతునక మాత్రమే.

గ్యాంగ్‌లదే ఇష్టారాజ్యం
ఆకతాయితనం... ఆగడాలు...దాడులు... విశృంఖతత్వం... ఇదీ  విజయవాడలోని గ్యాంగ్‌లకు నిత్యకృత్యం. టీడీపీ ప్రజాప్రతినిధుల కుమారులు, పెద్దల కుమారులే ఈ గ్యాంగ్‌లకు నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. నగరంలో వివాదాస్పదుడైన ఓ ప్రజాప్రతినిధి కుమారుడి గ్యాంగ్‌ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తూ విచ్చలవిడిగా జల్సాలకు పాల్పడుతున్నారు. అవసరమైతే దాడులకు కూడా తెగబడుతున్నారు. మరో కీలక నేత కుమారుడి అనుచరగణం కూడా మరో ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది.

విశృంఖలత్వానికి పరాకాష్ట
ప్రజాప్రతినిధుల సుపుత్రులు, వారి గ్యాంగ్‌లు తమ ధన బలం, రాజకీయ బలంతో అసాంఘిక కార్యకలాపాలకు నగరాన్ని అడ్డాగా మార్చేస్తున్నాయి. ఏజెంట్లను నియమించుకుని మరీ ఇతర రాష్ట్రాల నుంచి యువతులను నగరానికి తెప్పిస్తున్నారు. కొందరు యువతులను ఉపాధి అవకాశాల పేరుతో రప్పించి మోసం చేస్తుండగా... మరికొందరిని ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి వ్యభిచార వృత్తి కోసమే తెప్పిస్తున్నారు. నగర శివారు ప్రాంతాలు, కొన్ని హోటళ్లు కేంద్రంగా చేసుకుని విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్మాదంతో చెలరేగిపోతున్నారు. ఆ గ్యాంగ్‌ల విపరీతపోకడలకు కొన్ని నిదర్శనాలు ఇవీ...

► బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతా వచ్చిన అక్రమచొరబాటుదారుల కుటుంబాల్లోని యువతులను కొంతకాలంగా నగరానికి రప్పిస్తున్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మించి యువతులను రప్పిస్తున్నారు. వారిని నిర్బంధించి ఆ గ్యాంగ్‌ సభ్యులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కేవలం తిండి మాత్రమే పెట్టి కొన్ని రోజులపాటు వేధింపులకు గురిచేస్తున్నారు. తమను విడిచిపెట్టాలని ఆ యువతులు ప్రాధేయపడుతున్నా కనికరించడంలేదని తెలుస్తోంది. వారం రోజుల అనంతరం కొందరి చేతులో కొంత డబ్బు పెట్టి పంపిస్తున్నారు. నడవలేక నిస్సహాయస్థితిలో ఉన్నవారిని నిర్ధాక్షిణ్యంగా రైల్వే స్టేషన్‌ సమీపంలో పడేసి పోతున్నారు.
► తాజాగా ఓ హోటల్‌లో వ్యభిచారం చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. కొందరు యువతులు, యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే వారిలో టీడీపీ నేతల కుమారులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా కీలక నేత కుమారుడు, ఆయన గ్యాంగ్‌ సభ్యులను పోలీసులు బయటకు పంపించేశారు. ఒక్క యువతిపై మాత్రమే కేసు పెట్టి మిగిలినవారిని కూడా విడిచిపెట్టేశారు. తనపై మాత్రమే కేసు పెట్టడాన్ని ఆమె ప్రశ్నించింది. దీంతో ప్రజాప్రతినిధి కుమారుడు ఆమెకు రూ.లక్ష ఇస్తామని, కేసును వెంటనే పరిష్కరించి ఆమెను స్వస్థలానికి పంపిస్తానని నమ్మించారు. ఆ తరువాత ఆయన పత్తాలేకుండాపోయాడు. దీనిపై ఆమె పోలీసులను గట్టిగా నిలదీసినట్లు సమాచారం. దీంతో ఆ కేసును త్వరగా క్లోజ్‌ చేసి పంపిచేయాలని పోలీసులు భావిస్తున్నారు.  

పెద్దల దన్ను... పోలీసుల వత్తాసు
ప్రజాప్రతినిధులు కూడా తమ కుమారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఏమాత్రం భావించకపోవడం విడ్డూరంగా మారింది. పుత్రరత్నాల గ్యాంగ్‌ల ఆగడాలు తమ రాజకీయ ఆధిపత్యానికి చిహ్నంగా భావిస్తున్నారు. మరోవైపు మరికొందరు పోలీసు అధికారులు ఆ గ్యాంగ్‌లతో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చినా సరే తీసుకోవడం లేదు. దీంతో ఆ గ్యాంగ్‌లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement