పేరుకే దేశ రాజధాని గానీ.. అక్కడ రాత్రిపూట దిక్కులేని వాళ్లకు తలదాచుకోడానికి కూడా ఏమీ ఉండదు.
పేరుకే దేశ రాజధాని గానీ.. అక్కడ రాత్రిపూట దిక్కులేని వాళ్లకు తలదాచుకోడానికి కూడా ఏమీ ఉండదు. గత సంవత్సరం సుప్రీంకోర్టు ఈ విషయంలో గట్టిగా తలంటినా సర్కారులో చలనం రాలేదు. తూతూమంత్రంగా టెంట్లు మాత్రం ఏర్పాటుచేసి వదిలేసింది. ఇప్పుడు నాలుగు రోజుల్లోగా ఇలాంటి టెంట్ల స్థానంలో పోర్టబుల్ కేబిన్లను (ఎక్కడికి కావాలంటే అక్కడకు తరలించగలిగే ఇళ్లలాంటివి) ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఉత్తర భారతం మొత్తం విపరీతమైన చలిగాలులు వీస్తుండటంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. టెంట్లు ఏర్పాటుచేసినా, వాటివల్ల చలి నుంచి ఏమాత్రం రక్షణ ఉండబోదని, అందుకే వాటి బదులు పోర్టాకేబిన్లను ఏర్పాటుచేస్తామని ఆయన చెప్పారు.
ఇళ్లులేని వారు ఆక్రమించుకున్న స్థలాల్లో కూడా ఈ పోర్టాకేబిన్లను ఏర్పాటుచేస్తామని, దానివల్ల ఆక్రమణల బెడద తగ్గడంతో పాటు వారికి గూడు కూడా దొరుకుతుందని కేజ్రీవాల్ తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో జనం నిద్రపోయే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆర్డీవోలు (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లు) నైట్ షెల్టర్లను సందర్శించి, ఎక్కడెక్కడ ఈ పోర్టా కేబిన్లు అవసరమో చూడాలని ఆదేశించారు. ఈనెల నాలుగో తేదీకల్లా వివరాలు ఇవ్వాలని తెలిపారు. సమాజంలో అట్టడుగున ఉన్నవారిని రక్షించడమే ప్రభుత్వం మొదటి విధి అని చెప్పారు.