
మూడు ప్రయోగాలకు సిద్ధం: షార్ డెరైక్టర్
సూళ్లూరుపేట: ఈ ఏడాదిలో 3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని షార్ డెరైక్టర్ పి.కున్హికృష్ణన్ చెప్పారు. షార్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈనెలలో జీఎస్‌ఎల్‌వీ డీ6 ద్వారా జీశాట్-6 ఉపగ్రహాన్ని పంపుతామని తెలిపారు. ఈనెల 27న సాయంత్రం 4.52కు ప్రయోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. పది ట్రాన్స్‌పాండర్లున్న ఈ ఉపగ్రహంతో మల్టీమీడియా, శాటిలైట్ ఫోన్లకు టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
సెప్టెంబర్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ30 ద్వారా ఆస్ట్రోశాట్‌తో పాటు ఇండోనేషియాకు చెందిన లపాన్-ఏఈ, కెనడాకు చెందిన ఎన్‌ఎల్‌ఎస్-14, యూఎస్‌ఏకు చెందిన లీమోర్ నానో ఉపగ్రహాలను ప్రయోగిస్తామని వివరించారు. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ఆస్ట్రోశాట్‌లో ఆరు ఆస్ట్రానమీ పేలోడ్స్ పంపిస్తున్నామని తెలిపారు. డిసెంబర్‌లో పూర్తి వాణిజ్యపరమైన పీఎస్‌ఎల్‌వీ సీ29 ప్రయోగం చేపడుతున్నట్లు వెల్లడించారు.
2016 మార్చిలోపు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారానే రెండు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలకు అవసరమైన ఎక్స్‌ఎల్ స్ట్రాపాన్ బూస్టర్లను షార్‌లో కూడా తయారుచేసేందుకు సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో గ్రూప్ డెరైక్టర్ పి.విజయసారథి, పీఆర్‌వో విశ్వనాథశర్మ పాల్గొన్నారు.