ట్రంప్ అన్నంతపని చేస్తున్నారు..
- ‘మెక్సికో సరిహద్దు గోడ’ ఫైలుపై నేడు సంతకం
- శరణార్థులు, వలసలపైనా అధ్యక్షుడుడి కీలక నిర్ణయాలు!
వాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. వివాదాస్పద ‘యూఎస్- మెక్సికో సరిహద్దు గోడ’ను ఖచ్చితంగా నిర్మిస్తామని పునరుద్ధాటించారు. దీనికి సంబంధించిన ఫైలుపై నేడే(బుధవారమే) సంతకం చేయనున్నట్లు తెలిపారు. శరణార్థుల ప్రవేశంపై నిషేధం, వలసల నిరోధంపైనా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ‘జాతీయ భద్రతకు సంబంధించి అతిపెద్ద నిర్ణయానికి రంగం సిద్ధమైంది. అవును. యూఎస్- మెక్సికోల మధ్య గోడను కట్టబోతున్నాం’ అని అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెపారు.
మెక్సికో నుంచి అమెరికాకు విచ్చలవిడిగా వచ్చిపడుతోన్న డ్రగ్స్, వలసలను అరికట్టేందుకు సరిహద్దులో గోడ నిర్మిస్తానని ట్రంప్ ఎన్నికల సమయంలో వాగ్ధానం చేసిన సంగతి తెలిసిందే. నాటి ట్రంప్ హామీపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు, విమర్శలు చెలరేగడం, ‘గోడలు కాదు ట్రంప్.. వంతెనలు కట్టండి’అనే సందేశాలు వెల్లువెత్తడం విదితమే. కాగా, ‘గోడ నిర్మాణం’ఫైలుతోపాటు శరణార్థులు, వలసలపైనా ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.
వాస్తవానికి 2006లోనే అమెరికన్ కాంగ్రెస్‌లో ‘మెక్సికో సరిహద్దు గోడ’ బిల్లు పాస్ అయింది. కొంతమేరకు నిర్మాణ పనులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నేడు సంతకం చేయనున్న తాజా ఫైలుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదాన్ని కోరతారా?లేదా? అనేది తెలియాల్సిఉంది. కాలిఫోర్నియాలోని ఫసిఫిక్ తీరం నుంచి టెక్సాస్ రాష్ట్రంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరందాకా.. యూఎస్- మెక్సికోల మధ్య మొత్తం 3,201కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో 1,050 కిలోమీటర్ల మేర ఇప్పటికే ఇనుప కంచెను నిర్మించారు. ఇక ట్రంప్ సంతకంతో మిగిలిన భాగంలోనూ పని పూర్తిచేస్తారు. అధునాతన వ్యవస్థల సహాయంతో యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ విభాగం ఈ సరిహద్దుకు కాపలాకాస్తుంది.
Big day planned on NATIONAL SECURITY tomorrow. Among many other things, we will build the wall!
— Donald J. Trump (@realDonaldTrump) January 25, 2017