'నూతన ఒరవడితోనే అభివృద్ధి సాధ్యం'
న్యూఢిల్లీ: దేశ పరిపాలనలో నూతన ఒరవడి అవలంభించినప్పుడే అది వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి.. పరిపాలనలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాలని హితవు పలికారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరిస్థితి కోలుకుంటున్నా.. ఆహార ధరలు మాత్రం ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. కొన్ని రోజుల క్రితం గ్లాస్కోలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో విజేతలకు ప్రణబ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ఫలాలు కిందస్థాయి పేదవారికి అందేలా చూడాలన్నారు.ఆరు దశాబ్దాలుగా పేదరికం తగ్గినా ఇంకా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశ వ్యాప్తంగా పేదరికాన్ని రూపుమాపాల్సిన అవశ్యం ఎంతైనా ఉందని ప్రణబ్ తెలిపారు.
సమీకృత వృద్ధి, పారదర్శకతపైనే అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుందన్నారు. దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం పట్ల ప్రణబ్ హర్షం వ్యక్తం చేశారు. అది మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యిందనడానికి నిదర్శనమన్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసేలోగా 80 శాతం అక్షరాస్యత సాధించాలని ప్రణబ్ సూచించారు.