
దేశంలోనే పొడవైన సొరంగమార్గం
భారత దేశంలోనే అతిపొడవైన సొరంగమార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
జమ్ము: భారత దేశంలోనే అతిపొడవైన సొరంగమార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. జమ్ము–శ్రీనగర్ జాతీయ రహదారిపై నిర్మించిన ‘చెనానీ–నాశ్రీ’ సొరంగ మార్గాన్ని ఏప్రిల్ 2న ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఈ రహదారి ద్వారా జమ్ము–శ్రీనగర్‌ల మధ్య దాదాపు 30 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ సొరంగమార్గాన్ని నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా నిర్మించింది. దీని నిర్మాణం 2011 మే 23 ప్రారంభమైంది.
286 కిలోమీటర్లమేర నాలుగు లేన్లుగా నిర్మించిన ఈ రహదారిపై 9.2 కిలోమీటర్ల సొరంగమార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.3,720 కోట్లు ఖర్చు చేశారు. సముద్రమట్టానికి 1200 మీటర్ల ఎత్తులో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించడం మరో విశేషం. ఇక ఈ మార్గంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమీకృత నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సొరంగమార్గంలో ఏదైనా ప్రమాదం జరిగి, వాహనానికి మంటలు అంటుకుంటే వాటికవే స్పందించి వెంటనే ఆర్పివేసే యంత్రాలను సిద్ధంగా ఉంచారు.