మన్మోహన సింగ్
న్యూఢిల్లీ: ఈ రోజు పార్లమెంటులో జరిగిన సంఘటనలపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయసభల్లో సీమాంధ్ర ఎంపీలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. సభలను సక్రమంగా నిర్వహించకుండా అడ్డుపడ్డారు. రాష్ట్ర విభజన అంశంతో లోక్సభ రగిలిపోయింది. సీమాంధ్ర ఎంపీల ఆందోళనలతో దద్దరిల్లింది. నలుగురు సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడా పోడియం వద్దకు వెళ్లారు. తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
లోక్సభలో సమైక్యాంధ్ర ఆందోళనల మధ్యే రైల్వేమంత్రి ఖర్గే ఓటాన్ అకౌంట్ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ను చదివి వినిపించే సమయంలో సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. దాంతో ఆయన తన ప్రసంగాన్ని అర్ధంతరంగానే ముగించారు. అరుపులు, కేకలు మధ్యలో బడ్జెట్ను తాను చదివినట్లుగానే భావించమని మంత్రి కోరారు.
పార్లమెంటులో ఈరోజు చోటు చేసుకున్న సంఘటనలు తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని ప్రధాని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిదికాదని ఆయన పేర్కొన్నారు.