న్యూఢిల్లీ: సమయం మధ్యాహ్నం 2.30 గంటలు. పార్లమెంట్‌లో వాడీవేడి చర్చలతో అలసి మధ్యాహ్నం భోజనానికి సిద్ధమవుతున్న పలువురు విపక్ష ఎంపీలకు హఠాత్తుగా పిలుపు వచి్చంది. ప్రధాని మోదీ కలవాలనుకుంటున్నారని దాని సారాంశం. అంతా లిఫ్ట్ ఎక్కారు. సరిగ్గా పార్లమెంట్ క్యాంటిన్ వద్ద దిగి విజిటర్స్ లాంజ్‌లో వేచి చూస్తున్నారు. ‘‘పదండి. మీకో శిక్ష విధిస్తాను’ అని చమత్కరిస్తూ వారందరితో కలిసి భోజనానికి కూర్చున్నారు. 45 నిమిషాలపాటు కబుర్లు చెప్పుకున్నారు. వారిలో బీజేపీ ఎంపీలతో పాటు విపక్ష సభ్యులు కె.రామ్మోహన్ నాయుడు (టీడీపీ), సస్మిత్ పాత్రా (బీజేడీ), ఎన్‌కే ప్రేమచంద్రన్ (ఆర్‌ఎస్పీ), రితేశ్ పాండే (బీఎస్పీ) ఉన్నారు.
నిద్ర ఎప్పుడు లేస్తారు?
ఆహార అలవాట్లు మొదలుకుని అంతర్జాతీయ వ్యవహారాలదాకా అన్ని అంశాలు అక్కడ చర్చకొచ్చాయి. రోజూ ఎన్నింటికి నిద్ర లేస్తారు బిజీ షెడ్యూల్‌ను ఎలా అలసిపోకుండా నిర్వహిస్తారు వంటి ఎంపీల ప్రశ్నలకు మోదీ సరదాగా సమాధానాలిచ్చారు. ‘‘నేనెప్పుడూ ప్రధానిని అన్న మూడ్‌లో ఉండను. మంచి ఆహారం తినాలనే మూడ్‌లోనూ ఉంటాను’’ అని చమత్కరించారు. కిచిడీ తన ఫేవరెట్ ఫుడ్ అని చెప్పారు.
ఒకే రోజులో వేర్వేరు రాష్ట్రాల పర్యటనలు, విదేశీ ప్రయాణాలు, గుజరాత్ గురించి పట్టింపుల వంటివెన్నో విషయాలు చర్చకొచ్చాయని ఒక ఎంపీ వెల్లడించారు. ప్రాణహాని ఉందంటూ ఎస్పీజీ హెచ్చరించినా 2015లో పాకిస్థాన్‌కు వెళ్లి నాటి పీఎం నవాజ్ షరీఫ్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందో మోదీ వివరించారు. అందరూ అన్నం, పప్పు, కిచిడీ తిన్నాక రాగి లడ్డూ రుచిచూశారు. తామంతా కూర్చున్నది మోదీతోనేనా అనే అనుమానం ఒక్కసారిగా కల్గిందని ఒక ఎంపీ చెప్పారు. ‘‘ ప్రధానితో కలిసి భోజనం చేయడం అరుదైన అనుభవం. మేం చకచక ప్రశ్నలు అడుగుతుంటే ఆయన టకటక సమాధానాలిస్తున్నారు’’ అని మరో ఎంపీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment