న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సెషన్‌లో ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. ఈ సెషన్‌లో ఇప్పటివరకు లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి విపక్షానికి చెందిన 141 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఒక్క లోక్‌సభ నుంచే 95 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌తో సభను అడ్డుకున్నందుకు స్పీకర్ ఎంపీలపై వేటు వేశారు.
అయితే సస్పెండ్ అయిన ఎంపీలకు సంబంధించి మంగళవారం లోక్‌సభ సెక్రటేరియట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం సస్పెండెడ్ ఎంపీలు కేవలం సభలోకి రాకుండా ఉండడమే కాక ఎంపీలుగా తమకు సంక్రమించిన మరెన్నో హక్కులను తాత్కాలికంగా కోల్పోతారు. ఆ ఎంపీలకు సభతో పాటు పార్లమెంట్ చాంబర్, లాబీ, గ్యాలరీలకు కూడా ప్రవేశం ఉండదు. సాధారణంగా ఎంపీలు వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సిట్టింగ్‌లలో కూర్చునే హక్కునూ సస్పెండెడ్ ఎంపీలు కోల్పోతారు.
సస్పెండైన ఎంపీలు ఇచ్చే ఎలాంటి నోటీసులనూ సభలో అనుమతించరు. వారి పేరు మీద ఏ రకమైన బిజినెస్‌ను లిస్ట్ చేయరు. వీటితో పాటు ఆర్థిక పరమైన ప్రభావం కూడా సస్పెండెండ్ ఎంపీల మీద ఉంటుంది. సాధారణంగా ఎంపీలకు చెల్లించే రోజు వారి భత్యాలు కూడా సెషన్ మొత్తం సస్పెండ్ అయిన ఎంపీలకు చెల్లించరని సర్క్యులర్‌లో లోక్‌సభ సెక్రటేరియట్ పేర్కొంది.
ఇదీచదవండి..కొరియా లేడీ యూట్యూబర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment