పార్లమెంట్ను కుదిపేసిన ఫైళ్ల గల్లంతు వ్యవహారం
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణంలో ఫైళ్ల గల్లంతు వ్యవహారం గురువారం పార్లమెంట్‌ను కుదిపేసింది. దాదాపు 257 ఫైళ్లు మాయం అయ్యాయనే అనుమానాలపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ స్పందించాలంటూ బీజేపీ సభ్యులు ఉభయసభలను స్తంభింపచేశారు. లోక్‌సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన బీజేపీ సభ్యులు.... ప్రధాని మౌనం వీడాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో కూడా బీజేపీ సభ్యులు తమ పట్టు కొనసాగించారు. ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నా ప్రధానమంత్రి మాత్రం మౌనంగా చూస్తూ కూర్చుండిపోయారు.
అయితే కీలకమైన ఆహారభద్రత బిల్లుకు ఆమోదం పొందాలనే పట్టుదలతో ఉన్న యూపీఏ.... విపక్షసభ్యులను శాంతపరిచేందుకు సిద్దమైంది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంపై ప్రధాని జోక్యం చేసుకుని వివరణ ఇస్తారని కేంద్రమంత్రి రాజీవ్‌శుక్లా రాజ్యసభలో తెలిపారు. అంతేకాకుండా ఆహారభద్రత బిల్లు, భూసేకరణ బిల్లులకు ఆమోదం సాధించాలని భావిస్తున్న యూపీఏ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మరో అయిదు రోజులు పొడిగించింది. దీంతో సెప్టెంబర్ 5 వరకు సమావేశాలు జరుగనున్నాయి