పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి.ముందుగా ఉప ఎన్నికల్లో ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ సందర్భంలో తన ప్రమాణ స్వీకార పత్రం హిందీలో రాసి ఉందంటూ ఓ సభ్యుడు ప్రస్తావించడం సభలో నవ్వులు పూయించింది. ఇక ఆహారభద్రత లాంటి కీలక బిల్లులు ఆమోదం కోసం వేచి చూస్తుండగా.. తెలంగాణ చిచ్చు రేపిన కేంద్ర ప్రభుత్వానికి అసోం, నాగాలాండ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల నుంచి కూడా విభజన వాదాలు చెలరేగి షాక్ తినిపిస్తున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంటు సమావేశాలు వాడి వేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు సజావుగా నడిచేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం ఉదయం విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. గడిచిన రెండు మూడు సమావేశాల్లో చాలా సమయం వృథా అయ్యిందని, ఈసారి అలా జరగకుండా చూడాలని ఆయన కోరారు.
సీమాంధ్ర ఎంపీల ఆందోళన?
సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. ఈ ఆందోళనలు ఉభయసభలపైనా ప్రభావం చూపనుంది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా చేసినా, లోక్ సభ స్పీకర్ గానీ, రాజ్యసభ చైర్మన్ గానీ వీరి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదించాలని పట్టుపట్టటం ద్వారా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్ పట్టు..
తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తీరుపై సమగ్ర చర్చతో పాటు.. ఇకపై దేశంలో మరే రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమనే విస్పష్ట ప్రకటన కోసం పశ్చిమబెంగాల్‌లో గూర్ఖాలాండ్ ఉద్యమ సెగను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పట్టుపట్టే అవకాశాలున్నాయి. త్వరలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడివేడిగా సాగుతాయని భావిస్తున్నారు.
పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రతిపక్షానికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ విజ్ఞప్తిచేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపైనా చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయినా బొగ్గు కుంభకోణం, రైల్ గేట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అన్ని రంగాల్లో ద్వారాలు తెరవడం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రతిపక్షాల నుంచి సర్కారుపై ముప్పేట దాడి తప్పకపోవచ్చు. రూపాయి విలువ పడిపోవడం, డాలర్కు ఏకంగా 61 రూపాయల వరకు వెళ్లడంతో ఆ విషంయపైనా ఇటు ప్రధానిని, అటు ఆర్థిక మంత్రిని ప్రతిపక్షాలు దులిపేయడానికి సిద్ధపడ్డాయి.
బిల్లులకు సహకరించండి
బీమా, పెన్షన్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన కీలకమైన సంస్కరణల బిల్లులపై సహకరించాలని ప్రతిపక్ష బీజేపీకి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్న ఆర్థిక బిల్లులపై బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, యశ్వంత్‌సిన్హాలతో చిదంబరం చర్చలు జరిపారు. సాధారణ, ఆర్థిక కార్యక్రమాలపై తమ పార్టీ మద్దతు ఇస్తుందని.. అయితే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని బీజేపీ సంకేతాలిచ్చింది. పెన్షన్ రంగంలోనూ ఎఫ్‌డీఐని పెంచే ప్రతిపాదనను కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఆహార భద్రత బిల్లుకు సూత్రప్రాయంగా అనుకూలమే అయినా తాము ప్రతిపాదించిన అనేక సవరణలను ఆమోదిస్తేనే సహకరిస్తామని బీజేపీ వ్యూహకర్తల బృందం స్పష్టం చేసింది. మొత్తం మీద ఈసారి పార్లమెంట్ సమావేశాలు గతంతో పోల్చితే వాడివేడిగా సాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.