ఉచిత వైద్యానికి ప్రై ‘వేటు’ ! | Private hospitals neglect on free medical services | Sakshi
Sakshi News home page

ఉచిత వైద్యానికి ప్రై ‘వేటు’ !

Published Tue, Oct 29 2013 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

ఉచిత వైద్యానికి ప్రై ‘వేటు’ !

ఉచిత వైద్యానికి ప్రై ‘వేటు’ !

ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి ప్రైవేటు ఆస్పత్రుల తూట్లు
 సాక్షి, హైదరాబాద్: ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు ఉచిత సేవలకు తిలోదకాలిస్తున్నాయి. డబ్బు కట్టినవారికే వైద్యం చేస్తూ, పేదలకు చేయాల్సిన ఉచిత వైద్య సేవలు నిరాకరిస్తూ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయి. సర్కారు నుంచి రాయితీలు పొందుతున్నందుకు ప్రతిఫలంగా కనీసం ఐదు శాతం మంది తెల్లకార్డు ఉన్న రోగులకు ఉచితంగా వైద్యం చేయాల్సి ఉండగా.. ఒక్క ఆస్పత్రి కూడా దీన్ని పట్టించుకోలేదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో తేలింది.
 
  ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరకు స్థలాలు తీసుకోవడం, పన్నుల చెల్లింపులో మినహాయింపు వంటి లబ్ధి పొందినందుకు బీపీఎల్ కుటుంబాలకు ఉచిత వైద్య సేవలందించాలి. కార్పొరేట్ ఆస్పత్రులకు వచ్చే ఔట్ పేషెంట్లలో 10 శాతం మంది బీపీఎల్ కుటుంబాలకు, 5 శాతం మంది ఇన్‌పేషెంట్లకు ఉచితంగా వైద్యం చేయాలి. రాయితీలు అందుకునేటప్పుడు ఈ అంశాలపై సర్కారుతో ఎంఓయూ కూడా చేసుకున్నాయి. కానీ ఉచిత సేవలు మాత్రం అందించడంలేదు. మరోవైపు దీనిపై సర్కారు కూడా పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ విభాగం జరిపిన విచారణలో ఈ విషయా లు వెలుగులోకి వచ్చాయి. అపోలో, కేర్, యశోదా, గ్లోబల్ అవేర్, మెడిసిటీ, గ్లోబల్, రెయిన్‌బో, కామినేని తదితర ఎన్నో కార్పొరేట్ ఆస్పత్రులు ఉచిత వైద్యమందించిన వివరాలు చెప్పలేకపోయాయి.
 
 వెయ్యి ఆస్పత్రులున్నా వైద్యమేదీ?
 రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు వెయ్యి వరకూ ఉన్నాయి. వీటిలో 50 వరకూ కార్పొరేట్ ఆస్పత్రులున్నాయి. వీటిలో 98 శాతం ఆస్పత్రులు ఎంఓయూను పాటించలేదు. విజిలెన్స్ విభాగం ఎనిమిది కార్పొరేట్ ఆస్పత్రులను ఉచిత వైద్యంపై లెక్కలడిగితే ఒక్కటి మాత్రమే నలుగురు పేషెంట్ల వివరాలిచ్చింది. మిగతా ఆస్పత్రులు అది కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం గుర్తింపు పొందిన ప్రధాన ఆస్పత్రుల్లోనైనా ఏడాదికి 5 శాతం ఇన్‌పేషెంట్ల లెక్క ప్రకారం కనీసం 20 వేల మంది పేదలకు వైద్యం జరగాలని, కానీ వంద మందికి కూడా జరగట్లేదని అధికారులు నిర్ధారించారు. అలాగే 50 వేల నుంచి 60 వేల మందికి ఉచితంగా ఓపీ సేవలు అందాల్సి ఉండగా, 500 మందికి కూడా జరగడం లేదని తేల్చారు. ప్రతి మూడు మాసాలకు ప్రభుత్వ అధికారులు ప్రైవేటు ఆస్పత్రులపై తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా వారు పట్టించుకోలేదు.
 
 ఉచిత వైద్యం లెక్క చెప్పాల్సిందే: డీఎంఈ
 ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ ప్రకారం ఎంతమంది పేదలకు ఉచితంగా వైద్యం చేశారో వివరాలు ఇవ్వాల్సిందేనని వైద్య విద్యా సంచాలకులు డా.జి.శాంతారావు ప్రైవేటు ఆస్పత్రులకు తాఖీదులిచ్చారు. ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్‌ల వివరాలే కాకుండా వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు ఎన్ని చేశారో చెప్పాలని స్పష్టం చేశారు. వివరాల్లో పేషెంటు పేరు, చిరునామా, ఫోన్‌నంబర్లు కూడా ఇవ్వాలని సూచించారు. వివరాలు ఇవ్వని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నామని, ఇందుకోసం వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, పెద్దాసుపత్రుల సూపరింటెండెంట్లతో కమిటీ వేశామని శాంతారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement