Published
Wed, Nov 9 2016 5:52 PM
| Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
బ్రేకింగ్: అమెరికాలో భగ్గుమన్న నిరసనలు
ట్రంప్ దిష్టిబొమ్మలు దగ్ధం!
అందరి అంచనాలను, సర్వేల జోస్యాలను తలకిందులు చేస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించడంతో బుధవారం తెల్లవారుజామున అమెరికా అంతటా నిరసనలు హోరెత్తుతున్నాయి. ట్రంప్ గెలుపు జీర్ణించుకోలేకపోతున్న ఆయన వ్యతిరేకులు నార్త్ కాలిఫోర్నియా నుంచి సీటెల్ వరకు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు తెలుపుతున్నారు. దీంతో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్తత నెలకొంటున్నట్టు సమాచారం.
వైట్‌హౌస్ ఎదుట ఘర్షణ, ఉద్రిక్తత
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం (వైట్‌హౌస్) ఎదురుగా హిల్లరీ, ట్రంప్ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. మొదట ట్రంప్‌కు వ్యతిరేకంగా పలువురు వైట్‌హౌస్ ఎదురుగా గుమిగూడి ఆందోళన తెలిపారు. వారు ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో ట్రంప్ విజయంతో ఆనందంలో ఉన్న ఆయన మద్దతుదారులు అక్కడికి రావడం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రంప్, హిల్లరీ మద్దతుదారులు పరస్పరం దాడులకు దిగారు.
మరోవైపు డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉన్న లిబరల్ యూనివర్సిటీ క్యాంపస్‌లన్నింటిలోనూ ట్రంప్ విజయానికి వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. కాలిఫోర్నియా కాలేజీ క్యాంపస్‌లోనూ, ఓరేగాన్‌లోనూ ట్రంప్ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. లాస్‌ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన 500 మంది నిరసనకారులు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. వారు ట్రంప్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
కాలిఫోర్నియా ఓక్లాండ్ డౌన్‌టౌన్‌లో దాదాపు 100 మంది గుమిగూడి ట్రంప్ గెలుపుపై నిరసన చేపట్టారు. ట్రంప్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తూ టెలిగ్రాఫ్ అవెన్యూ వరకు ర్యాలీగా బయలుదేరారు. దీంతో అక్కడ ఉన్న బే ఏరియా ర్యాపిడ్ ట్రాన్సిట్ స్టేషన్‌ను మూసివేశారు. ట్రంప్ ఆగ్రహంగా ఉన్న నిరసనకారులు ఆయన దిష్టిబొమ్మలను తగులబెట్టారని, అంతేకాకుండా స్థానికంగా ఉన్న ఇళ్ల అద్దాలను బద్దలుకొట్టి హింస్మాత్మక చర్యలకు పూనుకుంటున్నారని స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు సాన్ జోస్, బర్కెలీ ప్రాంతాల్లోనూ విద్యార్థులు వందలసంఖ్యలో రోడ్డెక్కి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పోర్ట్‌ల్యాండ్‌లోనూ ట్రంప్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక్కడ భారీసంఖ్యలో గుమిగూడిన నిరసనకారులు రోడ్లపై వాహనాలను నిలిపివేసి.. ఆందోళన చేపడుతున్నారు. సీటెల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు.