clinton
-
వ్యాక్సిన్: ఒబామా, బుష్, క్లింటన్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం లభించిన అనంతరం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకునే వాలంటీర్లుగా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. టీకా భద్రత, ప్రభావంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తమ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఇదొక శక్తివంతమైన సందేశంగా ఉంటుందని వీరు భావిస్తున్నారు. (వ్యాక్సిన్ : లండన్‌కు క్యూ కట్టనున్న ఇండియన్స్) అమెరికన్ పబ్లిక్ హెల్త్ అధికారులు వ్యాక్సిన్ తీసుకోవటానికి ప్రజలను ఒప్పించటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ వైట్ హౌస్ కరోనావైరస్ ప్రతిస్పందన సమన్వయకర్త డాక్టర్ డెబోరా బ్రిక్స్‌తో వీరు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కెమెరా సాక్షిగా వ్యాక్సిన్ డోస్‌లను తీసుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు వాలంటీర్‌గా 43వ అధ్యక్షుడు బుష్ సిద్ధంగా ఉన్నారని ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫ్రెడ్డీ ఫోర్డ్ మీడియాకు వెల్లడించారు. అటు టీకాను ప్రోత్సహించడానికి బహిరంగ ప్రదేశంలో తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని క్లింటన్ చెప్పారని క్లింటన్ ప్రెస్ సెక్రటరీ ఏంజెల్ యురేనా ప్రకటించారు. ప్రజారోగ్య అధికారులు నిర్ణయించిన ప్రాధాన్యతల ఆధారంగా అధ్యక్షుడు క్లింటన్ టీకాను తీసుకుంటారన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ సురక్షితమని ఫౌసీ చెప్పినట్లయితే, తాను కూడా పూర్తిగా విశ్వసిస్తానని, కచ్చితంగా టీకా తీసుకుంటానని మరో మాజీ అధ్యక్షుడు ఒబామా తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో మరో మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ టీకాను బహిరంగంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. కాగా సెప్టెంబర్ 11, 2001 ఉగ్రదాడి తరువాత ప్రజల విశ్వాసాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బుష్ తల్లిదండ్రులు దివంగత మాజీ అధ్యక్షులు జార్జ్ హెచ్.డబ్ల్యు.బుష్, బార్బరా బుష్ ఒక వాణిజ్య విమానంలో ప్రయాణించారు. అలాగే 2005 లో కత్రినా హరికేన్ ప్రభావానికి భారీగా దెబ్బతిన్న ప్రాంతాల ప్రజల సహాయార్థం జార్జ్ హెచ్.డబ్ల్యు బుష్ క్లింటన్ నిధుల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. -
కుటుంబంలో ఒక్కరు తప్ప అందరూ బూడిదయ్యారు
మిస్సిస్సిప్పి : కళ్ల ముందే తన భార్య, ఆరుగురు పిల్లలు కాలి బూడిదైపోతుంటే వారిని కాపాడలేకపోయిన ఓ తండ్రి ఆవేదన ప్రతీ ఒక్కరిని కలచివేస్తోంది. ఈ విషాద ఘటన శనివారం మిస్సిస్సిప్పిలోని క్లింటన్ నగరంలో చోటుచేసుకుంది. కాగా అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వివరాలను క్లింటన్ నగర ప్రతినిధి మార్క్ జోన్స్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో బాధితుని భార్య బ్రిట్నీప్రెస్లీ(33), పిల్లలు లండన్ బ్రూక్‌షైర్(15), లేన్ ప్రెస్లీ(13), లాసన్ ప్రెస్లీ(12), గ్రేసన్ ప్రెస్లీ(6), మాల్కమ్ ప్రెస్లీ(4), ఫెలిసిటీ ప్రెస్లీ(1) చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ప్రమాదానికి సరైన కారణం ఏంటనేది తెలియదని జోన్స్ స్పష్టం చేశారు. 'బహుశా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం చోటుచేసుకొని ఉంటుంది. కళ్ల ముందే తన కుటుంబం కాలిపోతుండడంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఇల్లంతా మంటలు వ్యాపించి పొగ కమ్ముకోవడంతో లోపలికి వెళ్లడానికి అతనికి సాధ్యపడలేదు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన అతన్ని ఆసుపత్రికి తరలించాం' అని జోన్స్ పేర్కొన్నాడు. తాము మరునాడు ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇళ్లు మొత్తం పూర్తిగా దగ్దమయిందని జోన్స్ తెలిపారు. ఇళ్లు మొత్తం వుడ్‌ప్రేమ్‌తో కట్టడంతోనే ప్రమాద తీవ్రత పెరిగి కుటుంబం మొత్తం మంటల్లో చిక్కుకుందని జోన్స్ పేర్కొన్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు, వారు వేసుకునే బట్టలు సహా ఇంటి సామాగ్రి పూర్తిగా కాలిపోయిందని మార్క్ జోన్స్ వెల్లడించారు. -
అందరికీ షాక్.. ఆయనకు పండుగ!
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయం సాధించడంపై మన బాలీవుడ్ ప్రముఖులు పలువురు షాక్, విస్మయం వ్యక్తం చేయగా.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ట్రంప్ విజయంపై పలువురు నటులు, సెలబ్రిటీలు ఒకింత నిరాశపూరితమైన ట్వీట్లు చేయగా.. వర్మ మాత్రం తాను పండుగ చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ‘నాలుగు నెలల కిందటే ట్రంప్ గెలుస్తాడని ఊహించినందుకు నన్ను నేను అభినందించుకుంటున్నా. ఈ రోజు రాత్రి నేను ట్రంపింగ్ పార్టీ చేసుకుంటున్నా’ అని రాము ట్వీట్ చేశాడు. ‘ట్రంప్ మూర్ఖుడని భావించిన ప్రజలంతా మూర్ఖులని తేలిపోయింది హాహాహా’ అంటూ పేర్కొన్నాడు. ‘ట్రంప్‌కు వ్యతిరేకంగా ఒబామా ప్రచారం చేసినా.. గతంలో ఒబామా గెలిచిన ప్రాంతాలన్నింటిలోనూ ట్రంప్ గెలిచాడు. కాబట్టి ట్రంప్ ఒక్క హిల్లరీనే కాదు ఒబామాను కూడా ఓడించినట్టే’ అని తనదైన స్టైల్లో విశ్లేషించాడు. ట్రంప్ గెలుపుపై ఒక్క రితేశ్ దేశ్‌ముఖ్ మాత్రమే అభినందనలు తెలియజేయగా.. ట్రంప్ గెలుపుపై మహేశ్ భట్, కరణ్‌జోహార్, తదితరులు సాదాసీదాగా ట్వీట్ చేశారు. కాగా, ‘ఐన్‌స్టీన్ పేర్కొన్న ప్రకారం.. కేవలం రెండు విషయాలు మాత్రమే అనంతమైనవి. ఒకటి విశ్వం, రెండోది మూర్ఖత్వం. అయితే, మొదటి విషయం గురించి నాకు తెలియదు’ అంటూ ‘బజరంగీ భాయ్‌జాన్’ దర్శకుడు కబీర్ ఖాన్ స్పందించారు. -
బ్రేకింగ్: అమెరికాలో భగ్గుమన్న నిరసనలు
ట్రంప్ దిష్టిబొమ్మలు దగ్ధం! అందరి అంచనాలను, సర్వేల జోస్యాలను తలకిందులు చేస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించడంతో బుధవారం తెల్లవారుజామున అమెరికా అంతటా నిరసనలు హోరెత్తుతున్నాయి. ట్రంప్ గెలుపు జీర్ణించుకోలేకపోతున్న ఆయన వ్యతిరేకులు నార్త్ కాలిఫోర్నియా నుంచి సీటెల్ వరకు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు తెలుపుతున్నారు. దీంతో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్తత నెలకొంటున్నట్టు సమాచారం. వైట్‌హౌస్ ఎదుట ఘర్షణ, ఉద్రిక్తత అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం (వైట్‌హౌస్) ఎదురుగా హిల్లరీ, ట్రంప్ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. మొదట ట్రంప్‌కు వ్యతిరేకంగా పలువురు వైట్‌హౌస్ ఎదురుగా గుమిగూడి ఆందోళన తెలిపారు. వారు ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో ట్రంప్ విజయంతో ఆనందంలో ఉన్న ఆయన మద్దతుదారులు అక్కడికి రావడం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రంప్, హిల్లరీ మద్దతుదారులు పరస్పరం దాడులకు దిగారు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉన్న లిబరల్ యూనివర్సిటీ క్యాంపస్‌లన్నింటిలోనూ ట్రంప్ విజయానికి వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. కాలిఫోర్నియా కాలేజీ క్యాంపస్‌లోనూ, ఓరేగాన్లోనూ ట్రంప్ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. లాస్ఏంజిల్స్లోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన 500 మంది నిరసనకారులు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. వారు ట్రంప్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కాలిఫోర్నియా ఓక్లాండ్ డౌన్టౌన్లో దాదాపు 100 మంది గుమిగూడి ట్రంప్ గెలుపుపై నిరసన చేపట్టారు. ట్రంప్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తూ టెలిగ్రాఫ్ అవెన్యూ వరకు ర్యాలీగా బయలుదేరారు. దీంతో అక్కడ ఉన్న బే ఏరియా ర్యాపిడ్ ట్రాన్సిట్ స్టేషన్‌ను మూసివేశారు. ట్రంప్ ఆగ్రహంగా ఉన్న నిరసనకారులు ఆయన దిష్టిబొమ్మలను తగులబెట్టారని, అంతేకాకుండా స్థానికంగా ఉన్న ఇళ్ల అద్దాలను బద్దలుకొట్టి హింస్మాత్మక చర్యలకు పూనుకుంటున్నారని స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు సాన్ జోస్, బర్కెలీ ప్రాంతాల్లోనూ విద్యార్థులు వందలసంఖ్యలో రోడ్డెక్కి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పోర్ట్ల్యాండ్లోనూ ట్రంప్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక్కడ భారీసంఖ్యలో గుమిగూడిన నిరసనకారులు రోడ్లపై వాహనాలను నిలిపివేసి.. ఆందోళన చేపడుతున్నారు. సీటెల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. -
ఒబామాకు ముందే తెలుసా?
‘ఏది ఏమైనా సూర్యుడు ఉదయించకమానడు’ .. అమెరికా ఎన్నికల నాటి రాత్రి బరాక్ ఒబామా ప్రజలకు ఇచ్చిన సందేశం. అమెరికా చరిత్రలోనే అత్యంత విభజనపూరితంగా, విద్వేషపూరితంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏ అనూహ్య ఫలితం వచ్చినా ప్రజలు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిస్తూ ఆయన సందేశం ఇచ్చారు. ఆయన పేర్కొన్నట్టూ యావత్ ప్రపంచం ఊహించనిరీతిలో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను చిత్తచేస్తూ అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. నిజానికి ఎన్నికలనాటి రాత్రి ఒబామా ఇచ్చిన సందేశానికి.. అంతకుముందురోజు ఫిలడెల్ఫియాలో హిల్లరీ చివరి ప్రచారసభలో ఇచ్చిన ఉత్సాహపూరితమైన ఉపన్యాసానికి మధ్య ఎంతో తేడా ఉండటం గమనార్హం. ఫిలడెల్ఫియా ప్రచార సభలో హిల్లరీ, చెల్సియాతో కలిసి ఒబామా, ఆయన సతీమణి మిషెల్లీ పాల్గొన్నారు. హిల్లరీ విజయం ఖాయమంటూ ఈ సభలో ఉత్సాహపూరితమైన ప్రసంగాలు ఒబామా, మిషెల్లీ చేశారు. కానీ, ఎన్నికల రోజు నాటికి వచ్చేసరికి దిగిపోతున్న అధ్యక్షుడైన ఒబామా స్వరంలో మార్పు కనిపించింది. ‘మనం ఈసారి కొన్ని కొత్త విషయాలు చూశాం. కానీ ఎంతో కరుడుగట్టిన కరుకు ప్రజాస్వామ్యమైన మన దేశానికి ఇది కొత్త కాదు. గతంలోనూ మనం కఠినమైన, విభజనపూరితమైన ఎన్నికలను చూవిచూశాం. వాటి నుంచి మరింత బలోపేతం అయ్యాం’ అని ఒబామా పేర్కొన్నారు. ‘ఏదిఏమైనా సూర్యుడు ఉదయించకమానడన్న విషయాన్నీ, భూమిపై అమెరికా ఎప్పటికీ గొప్ప దేశంగా ఉంటుందన్న విషయాన్నీ మరిచిపోకండి’ అంటూ ఒబామా సందేశం ఇచ్చారు. ఎంతో ఆచితూచి ఇచ్చిన ఈ సందేశాన్ని చూస్తే.. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న డెమొక్రటిక్ కథ కంచికి చేరిన విషయాన్నీ, ట్రంప్ విజయాన్ని ఒబామా ముందే పసిగట్టినట్టు కనిపిస్తోంది. -
వందశాతం వారు చెప్పినట్టే జరిగింది!
న్యూఢిల్లీ: అగ్రరాజ్య ఎన్నికల ఫలితాలను ఆయన ముందుగానే జోస్యం చెప్పారు. అయితే అప్పట్లో ఆయన మాటలను ఎవరూ నమ్మలేదు సరికదా... అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. అయితే సర్వేలు తారుమారయ్యాయి. అంచనాలు తలకిందులయ్యాయి. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఓటింగ్ ముందు రోజు వరకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయం ఖాయమని పలు సర్వేలు చెప్పాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. దీంతో అమెరికన్ ప్రొఫెసర్ అలాన్ లిచట్మన్ జోస్యం నిజమైంది. గత 30 ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆయన వేసిన అంచనా ఎన్నడూ తప్పుకాలేదు. 1984 ఎన్నికల నుంచి ఎవరు అమెరికా అధ్యక్షుడిగా గెలుస్తారో ఆయన కచ్చితంగా అంచనా వేస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మొగ్గు ఉందని సర్వేలు చెప్పినప్పటికీ.. అలాన్ మాత్రం ట్రంప్ గెలుస్తారని ఘంటాపథంగా తేల్చి చెప్పారు. లిచట్మన్ ఏదో ఆషామాషీగా అంచనా వేసి ఈ ఫలితాలను ప్రకటించలేదు. రాజకీయ అభిప్రాయాలు, ప్రాంతీయ ప్రజల మనోభావాలను అంచనా వేసి ఆయన ఈ నిర్ధారణకు వచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే విజయం సాధిస్తారని అలాన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ట్రంప్ ఎందుకు గెలుస్తారో వివరిస్తూ 'ప్రిడిక్టింగ్ ద నెక్ట్స్ ప్రెసిడెంట్: ద కీస్ టు వైట్‌హౌస్ 2016' పుస్తకాన్ని ప్రచురించారు. అప్పట్లో నమ్మకపోయినా ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఈ అమెరికా ఆక్టోపస్ జోస్యం నిజమైందనుకుంటున్నారు. హెల్మట్ నార్పోత్ మోడల్ ప్రకారం... అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారంటూ.. యూఎస్ ప్రఖ్యాత ఎన్నికల నిపుణుడు హెల్మట్ నార్పోత్ కూడా తెలిపారు. ఆయన మోడల్ ప్రకారం ప్రైమరీలు, కాకసెస్ (ఆ పార్టీలోని ఎన్నికైన సభ్యులు)లో మెజారిటీ సంపాదించిన బలమైన నేత శ్వేతసౌధానికి ఎంపికవుతారు. ఈ మోడల్‌కు మారుతున్న రాజకీయ, అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం ఉండదు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రైమరీలు, కాకసెస్‌లో పార్టీపరంగా బలమైన నేతగా ఎదిగారు. ఆ తర్వాత పార్టీలో వ్యతిరేకత ఎదురైనా ఇది ట్రంప్ విజయంపై ప్రభావం చూపదని హెల్మట్ తెలిపారు. ఈ మోడల్ ప్రకారం 1912 నుంచి ఒబామా వరకు (2000లో తప్ప) అన్ని అంచనాలు నిజమయ్యాయి. చెన్నై చాణక్య జోస్యం... మరోవైపు ట్రంప్ గెలుపుపై చెన్నై 'చాణక్య' చెప్పిన జోస్యం కూడా నిజమైంది. ఈ చాణక్య.. మనిషి అనుకుంటే పొరపాటు. చాణక్య అంటే బుల్లి చేప. హిల్లరీ, ట్రంప్ ఫొటోలను చాణక్య ఉన్న నీటి తొట్టెలో ఉంచగా, అది ట్రంప్ ఫొటోను నోటితో కరిచిపట్టుకుని జోస్యం చెప్పింది. రెండు రోజుల క్రితం చాణక్య చెప్పిన జోస్యంపై గురి కుదరకపోయినా తాజా ఫలితాలతో అది వాస్తవమని తేలింది. గతంలోనూ ఫుట్ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా చాణక్య చెప్పిన జోస్యాలు నిజమయ్యాయి. అలాగే 2015 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా చాణక్య జోస్యానికి యమ క్రేజ్ ఏర్పడింది. ట్రంప్ ఘన విజయంతో చాణక్య మరోసారి వార్తల్లో నిలిచింది. -
హిల్లరీ మద్దతుదారులారా.. ఇక ఇంటికెళ్లి పడుకోండి!
అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ హిల్లరీ క్లింటన్‌కు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో కోలుకోలేని దెబ్బ తగిలింది. అగ్రరాజ్య ఎన్నికల్లో అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్‌ను డొనాల్డ్ ట్రంప్ దాటేశారు. ఇక అమెరికా 45వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో హిల్లరీకి మాటలు రాని పరిస్థితి ఏర్పడింది. హిల్లరీ క్లింటన్ ఈ రాత్రికి ఏమీ మాట్లాడరని, ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని మద్దతుదారులకు ఆమె క్యాంపెయిన్ చైర్ జాన్ పొడెస్టా సూచించారు. మాన్హాటన్లోని జవిట్స్ సెంటర్లో తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బుధవారం తర్వాత వరకు దీనిపై ఎలాంటి కామెంట్‌ను హిల్లరీ చేయరని స్పష్టంచేశారు. హిల్లరీకి మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పొడెస్టా చెప్పారు. -
ఆధిక్యంలో ట్రంప్: భగ్గుమంటున్న బంగారం
వైట్ హౌస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతుండటంతో పసిడి పరుగులు తీస్తోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను అధిగమించి దూసుకుపోతుండటంతో, బంగారం 3 శాతం జంప్ చేసి ఐదు వారాల గరిష్టానికి నమోదవుతోంది. బంగారాన్ని సురక్షితమైన సాధనంగా భావిస్తున్న ఇన్వెస్టర్లు, పెట్టుబడులను దానిలోకి తరలిస్తున్నారు.. దీంతో బులియన్‌కు ఫుల్ జోష్‌గా ఉంది. స్పాట్ గోల్డ్ ఒక్క ఔన్స్‌కు 2.9 శాతం పెరిగి 1,311 డాలర్లుగా నమోదవుతోంది. బులియన్ కూడా 1,312.80 డాలర్లకు ఎగిసింది. అక్టోబర్ 4 తర్వాత ఇదే బలమైన నమోదు. ట్రంప్ గెలిస్తే, కమొడిటీలకు లబ్ది చేకూరుతుందని ముందు నుంచి భావిస్తూ రావడంతో, బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మూడోవంతు ఓటింగ్ ప్రకియ ముగిసింది. కీలకరాష్ట్రాల్లో ఓటింగ్ నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. ఎన్నికల ఫలితాలు కూడా అంచనాలు తారుమారు చేస్తూ వస్తున్నాయి. హిల్లరీ గెలుస్తుందని ముందస్తు అంచనాలు ప్రకటించినప్పటికీ, ఆమెను అధిగమించి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తారుమారు చేస్తున్న ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్‌తో, అమెరికా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆసియన్ మార్కెట్లోనూ డాలర్ భారీగా పతనమవుతోంది. దీంతో దేశీయ సూచీలు నష్టాల్లో ప్రారంభమవచ్చని విశ్లేషకులంటున్నారు. -
అలా అయితే.. ట్రంప్ సంచలన విజయమే!
కనీసం నాలుగు తరాల తాతలు అమెరికన్లు అయిన వారి పిల్లలకు మాత్రమే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే నిర్ణయాధికారం ఉండివుంటే.. అగ్రరాజ్యంలోని 50 రాష్ట్రాల్లోనూ డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయం సాధించేవారు.. ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, కన్జర్వేటివ్ విశ్లేషకురాలు ఆన్ కౌల్టర్ చేసిన ట్వీట్ ఇది. కాబోయే అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తేల్చేందుకు ఒకవైపు పోలింగ్ కొనసాగుతుండగానే.. ఆమె చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్ని రేపింది. అమెరికన్ మూలవాసులు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు మాత్రమే మద్దతిస్తారన్న అంతరార్థంతో ఆమె చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలో జాతివివక్ష, విదేశీ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని పలువురు మండిపడ్డారు. నాజీ జర్మన్ల విధానాన్ని తలపించేలా కౌల్టర్ ట్వీట్ చేశారని మరికొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. హిట్లర్ హయాంలో 1930లో యూదులకు పౌరసత్వం నిరాకరించే చట్టాన్ని నాజీ జర్మనీ తీసుకొచ్చింది. మూడు, నాలుగు తరాల కిందట తాతలు యూదులుగా ఉన్నా.. వారి పౌరసత్వాన్ని రద్దుచేసింది. నిజమైన జర్మన్లను యూదులు పెళ్లిచేసుకోవడాన్ని, వారితో శృంగార సంబంధాలు పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ ఈ చట్టాన్ని తెచ్చింది. ఇప్పుడు కౌల్టర్ ట్వీట్ ఆనాటి నాజీ చట్టాన్ని గుర్తుకుతెస్తున్నదని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. నిజానికి కౌల్టర్ వాదన ప్రకారమే చూసుకుంటే ట్రంప్ సైతం అమెరికాలో ఓటు వేయడానికి అనర్హుడు అవుతారు. ఆయన తల్లి స్కాట్లాండ్ దేశస్తురాలు. ట్రంప్ పిల్లలకు కూడా ఓటు వేసే హక్కు ఉండదు. ఎందుకంటే ట్రంప్ మాజీ భార్య ఇవానా, ప్రస్తుత భార్య మెలినీయా అమెరికాకు వలస వచ్చినవారే. అలాంటప్పుడు అవకాశాల స్వర్గధామమైన అమెరికాకు వలసవచ్చిన వారిపట్ల పట్ల వివక్ష చూపుతూ ఇలా ట్వీట్ చేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. If only people with at least 4 grandparents born in America were voting, Trump would win in a 50-state landslide. — Ann Coulter (@AnnCoulter) November 8, 2016 -
మిడ్నైట్ ఓటింగ్‌లో ట్రంప్ దూకుడు!
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. సంప్రదాయబద్ధంగా జరిగే మిడ్నైట్ ఓటింగ్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. న్యూహాంప్‌షైర్‌లోని మూడు చిన్న పట్టణాల్లో మిడ్నైట్ ఓటింగ్ నిర్వహించగా.. తన ప్రత్యర్థి అయిన డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్ పైచేయి సాధించినట్టు 'యూఎస్ఏ టుడే' మీడియా సంస్థ తెలిపింది. న్యూహాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాట్చ్, హర్ట్జ్ లోకేషన్, మిల్స్‌ఫీల్డ్ తదితర మూడు పట్టణాల్లో సంప్రదాయ మిడ్నైట్ ఓటింగ్‌ను నిర్వహించారు. ఈ మూడు పట్టణాల్లోనూ జనాభా వందకులోపే ఉంటుంది. ఇక్కడ జరిగిన ఓటింగ్‌లో ట్రంప్‌కు 32 ఓట్లు రాగా, హిల్లరీకి 25 ఓట్లు వచ్చాయి. న్యూ హాంప్‌షైర్ చట్టం ప్రకారం 100లోపు ఓట్లు ఉన్న కమ్యూనిటీలు అర్ధరాత్రే ఓటింగ్‌లో పాల్గొని.. తమ ఫలితాన్ని వెల్లడించే వీలుంటుంది. మిగతా రిజిష్టర్డ్ ఓటర్లు తెల్లారి జరిగే ప్రధాన పోలింగ్‌లో పాల్గొంటారు. ఈ మిడ్నైట్ ఓటింగ్ జరిగే డిక్స్విల్లేలోనూ, హర్ట్స్ లోకేషన్లోనూ ట్రంప్‌పై క్లింటన్ వరుసగా 4-2, 17-14 ఓట్ల తేడాతో పైచేయి సాధించారు. అయితే, ఈ రెండింటికన్న అత్యధికంగా ఓట్లు ఉండే మిల్స్‌ఫీల్డ్‌లో మాత్రం క్లింటన్‌పై ట్రంప్ 16-4 ఓట్ల తేడాతో స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో మొత్తంగా ఈ మూడు పట్టణాల్లో ట్రంప్‌దే విజయంగా కనిపిస్తోంది. -
మిచెల్లీ ఒబామాకు హిల్లరీ బంపర్ ఆఫర్
-
మిచెల్లీ ఒబామాకు హిల్లరీ బంపర్ ఆఫర్
అమెరికా మొదటి మహిళ మిచెల్లీ ఒబామాకు హిల్లరీ క్లింటన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నవంబర్ 8న జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే, మిచెల్లీని తన కేబినెట్లోకి తీసుకుంటానని డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల విద్యా వంటి పలు సమస్యలపై మిచెల్లీ ఎంతో అవగాహనతో ఉన్నారని, వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయాలని మిచెల్లీ కోరుకుంటున్నట్టు హిల్లరీ పేర్కొన్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని విన్స్టన్-సాలెంలో తామిద్దరూ భేటీ అయిన సందర్భంలో ఈ విషయాలపై చర్చించినట్టు తెలిపారు. తనకు ఉత్తమమైన భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాని, మిచెల్లీని మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకోవాలని ఆశిస్తున్నట్టు క్లింటన్ ఓ టీవీ చానెల్‌కు చెప్పారు. ఒకవేళ నవంబర్ 8న జరిగే సాధారణ ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే, అమెరికాకు ఎన్నికైన మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఆమె పేరొందనున్నారు. క్యాంపెయిన్ తుదిదశలో క్లింటన్ ప్రత్యామ్నాయంగా మిచెల్లీ కొన్ని ర్యాలీలో పాల్గొన్నారు. మొదటిమహిళగా ఆమె ఎంతో ఆదర్శప్రాయురాలని, ఆ బాధ్యత ఎలా ఉంటుందో తనకు తెలుసని క్లింటన్ అన్నారు. మిచెల్లీ తనకందించిన ధైర్య, సహాకారాలను తాను అభినందిస్తున్నానని క్లింటన్ చెప్పారు. -
క్లింటన్ వెనుకబడిపోతున్నారట!
అగ్రరాజ్య అధినేత ఎన్నికలకు ఇంకా 50 రోజులు కూడా మిగిలి లేవు. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు మధ్య పోటీ మరింత తీవ్రతరమవుతుందని వెల్లడవుతోంది. ఇన్నిరోజులు ఆధిక్యంలో కొనసాగుతున్న హిల్లరీ క్లింటన్, అగ్రరాజ్య అధినేతగా గెలిచే అవకాశాల్లో వెనుకబడుతున్నారని తాజా సర్వేలు పేర్కొంటున్నాయి. ఇదేసమయంలో ట్రంప్ విక్టరీపై అవకాశాలు మెరుగుపడుతున్నాయని ఈ తాజా అంచనాలు పేర్కొంటున్నాయి. సీఎన్‌బీసీ గ్లోబల్ సీఎఫ్ఓ కౌన్సిల్ జూలైలో నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది అమెరికన్లు క్లింటన్ గెలుస్తారంటూ అభిప్రాయాలు వెల్లువెత్తగా.. ప్రస్తుత సర్వేలో క్లింటన్ వైపు మొగ్గుచూపేవారు వారి శాతం 10 శాతం తగ్గిందట. ఇదేసమయంలో ట్రంప్ గెలిచే అవకాశ శాతం రెండింతలు పెరిగి, 20 శాతానికి చేరినట్టు వెల్లడైంది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 16 వరకు సీఎఫ్ఓ కౌన్సిల్ ఈ పోల్ నిర్వహించింది. ముందస్తు సర్వే కంటే ఈ సర్వేలో కౌన్సిల్‌లోని ఐదుగురు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్లు ట్రంప్ గెలుస్తారంటూ జోస్యం చెప్పారని సీఎన్‌బీసీ పేర్కొంది. ట్రంప్‌కు గెలిచే అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, మెజార్టీ సీఎఫ్ఓలు క్లింటన్కే మొగ్గుచూపుతున్నారని తెలిపింది. సీఎన్‌బీసీ గ్లోబల్ సీఎఫ్ఓ కౌన్సిల్లో ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలుంటాయి. వివిధ రంగాల్లో 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉన్న కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ట్రంప్ పై అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, మెజార్టీ సభ్యులు క్లింటన్ వైపే మొగ్గుచూపడం విశేషం. -
క్లింటన్‌కు ట్రంప్ సవాల్
వాషింగ్టన్ తన మానసిక పరిస్థితి సరిగా లేదంటూ పలుమార్లు ఆరోపిస్తున్న హిల్లరీ క్లింటన్‌పై సవాలుకు దిగారు డొనాల్డ్ ట్రంప్. హిల్లరీ క్లింటన్ పూర్తి మెడికల్ రికార్డులు రిలీజ్ చేయాలని ట్రంప్ చాలెంజ్ చేశారు. తన మెడికల్ రికార్డులు విడుదల చేయడానికి తనకు ఏమాత్రం అభిప్రాయం లేదని, మరీ హిల్లరీ ? అంటూ ఆదివారం రాత్రి ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తనకు తగిన శక్తి లేదని క్లింటన్ చిత్రీకిరించడానికి ప్రయత్నిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా డిసెంబర్లోనే ట్రంప్ మెడికల్ రికార్డులను తన వ్యక్తిగత ఫిజిషియన్ పబ్లిక్‌గా తీసుకొచ్చారు.. ఎన్బీసీ న్యూస్ రిపోర్టు చేయకముందు ఆ రికార్డులను పరిశీలనలో ఉంచారు. అధ్యక్ష పదవికి ట్రంప్ ఎన్నికైతే అతడే అత్యంత ఆరోగ్యవంతమైన ప్రెసిడెంట్ అంటూ తన వ్యక్తిగత డాక్టర్, ఫిజిషియన్ హెరాల్డ్ బార్న్స్టీన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ మానసిక ఆరోగ్యం అమోఘమంటూ ఆయన వెల్లడించారు. స్మోక్, డ్రింక్ చేయకపోవడంతో ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. కుటుంబనేపథ్యం కూడా చాలా బాగుందని కితాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో క్లింటన్ ఆరోగ్యానికి సంబంధించి ట్రంప్‌తో పాటు ఆయన మద్దతుదారులు విమర్శలకు దిగారు. ట్రంప్ లాగానే క్లింటన్ వ్యక్తిగత ఫిజిషియన్ కూడా ఆమె ఆరోగ్యం, ఫిటినెస్‌పై పదేపదే పబ్లిక్ గా పునరుద్ఘాటిస్తున్నారు. -
ట్రంప్ పట్ల అసంతృప్తిగా ఉన్న సొంతపార్టీ ఓటర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వంపై సొంతపార్టీ ఓటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన గాలప్ పోల్ సర్వేలో 52 శాతం రిపబ్లికన్ పార్టీ ఓటర్లు ట్రంప్ అభ్యర్థిత్వంపై అసంతృప్తిగా ఉన్నట్లు వెల్లడైంది. రిపబ్లికన్ ఓటర్లలో 42 శాతం మంది మాత్రం ట్రంప్ అభ్యర్థిత్వంపై సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలిందని మీడియా సంస్థ జిన్హువా వెల్లడించింది. అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వంపై ఆ పార్టీ ఓటర్లు 56 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. 46 శాతం మంది డెమోక్రాట్లు మాత్రం హిల్లరీ బదులుగా వేరే వాళ్లు ప్రెసిడెంట్ అభ్యర్థి అయితే బాగుండు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే యువ ఓటర్లలో హిల్లరీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సర్వేలో తేలింది. 18 నుంచి 38 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ డెమోక్రటిక్ ఓటర్లలో 38 శాతం మాత్రమే హిల్లరీ అభ్యర్థిత్వంపై సంతృప్తిగా ఉన్నారు. 40 ఏళ్లకు పైబడిన వారిలో మాత్రం 67 శాతం మంది హిల్లరీ పట్ల సంతృప్తిగా ఉన్నారు. యువ డెమోక్రాటిక్ ఓటర్లు బెర్నీ సాండర్స్ తమ డెమోక్రటిక్ అభ్యర్థి అయితే బాగుండేదనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. -
హిల్లరీపై ట్రంప్ తీవ్ర విమర్శలు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి హిల్లరీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిల్లరీ క్లింటన్ అవినీతి రాణి(కరప్షన్ క్వీన్) అని ట్రంప్ ఆరోపించారు. ఇటీవలి పలు సర్వేలు హిల్లరీకి జనాదరణ పెంరిగిందని వెల్లడించిన నేపథ్యంలో ట్రంప్ ఈ విమర్శలు చేశారు. గతంలో ఆమెను 'దెయ్యం' అని కూడా ట్రంప్ విమర్శించిన విషయం తెలిసిందే. హిల్లరీ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే దేశాన్ని నాశనం చేస్తుందని ఐయోవాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్ హెచ్చరించారు. 'హిల్లరీ ప్రెసిడెంట్ అయితే దేశంలో ఉగ్రవాదం ఉంటుంది, సమస్యలు ఉంటాయి.. ఒకరకంగా ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవడమంటే స్వయంగా దేశాన్ని నాశనం చేసుకోవడమే' అని ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిల్లరీని సమన్వయం లోపించిన వ్యక్తిగా ట్రంప్ పేర్కొన్నాడు. ఆమె అమెరికా అధ్యక్షురాలిగా ఉండేంత స్ట్రాంగ్ కాదని ట్రంప్ విమర్శించారు. -
ప్రచార వేగాన్ని పెంచిన హిల్లరీ..
వాషింగ్టన్: డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ నామినీ హిల్లరీ క్లింటన్ ప్రచార వేగాన్ని పెంచారు. తన వైస్ ప్రెసిడెంట్ క్యాండెట్, వర్జీనియా సెనెటర్ టిమ్ కెయినీతో కలిసి ఆమె మూడు రోజుల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఒహియో, పెన్సుల్వేనియాలోని పలు ప్రాంతాల్లో.. సుమారు 600 మైళ్ళు వారి బస్సు యాత్ర కొనసాగనుంది. రాయల్ బ్లూ పెయింటింగ్‌తో ఉన్న బస్సుపై 'స్ట్రాంగర్ టుగెదర్' అనే స్లోగన్ ఆకట్టుకుంటోంది. వస్తుతయారీ పరిశ్రమకు సంబంధించిన ప్రజలను కలుసుకోబోతున్నామని హిల్లరీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రణాళికలతో పాటు.. మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడం లక్ష్యంగా చేసుకొని ఈ పర్యటన జరుగుతోందని సీబీఎస్ మీడియా వెల్లడించింది. బస్సు యాత్రలో భాగంగా పిట్స్బర్గ్, ఓహియో, యంగ్స్టౌన్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీలో హిల్లరీ పాల్గొంటారు. -
‘ట్రంప్, హిల్లరీకి ఓటు వేయలేక ప్రాణాలువిడిచింది’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఓటేయడం ఇష్టం లేక ఓ మహిళ ప్రాణాలు విడిచిందట. 68 ఏళ్ల మహిళ ఎన్నికల బరిలో ఉన్న నేతలెవరు ఇష్టం లేక వారికి ఎక్కడ ఓటెయ్యాల్సి వస్తుందో అని ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఆమెకు నిజంగా ట్రంప్ అన్నా హిల్లరీ అన్నా అంత అసహ్యమా.. ఒక వేళ అసహ్యం ఉంటే ఇద్దరికీ ఓటు వేయకుండా ఉంటే సరిపోతుందిగా.. ఇలా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడే గమ్మత్తు జరిగింది. తల్లి చనిపోయిందనే బాధ కూడా లేకుండా ఆమె కుమారుడు చేసిన పని ఇది. మేరీ అన్నె నోలాండ్ అనే తమ 68 ఏళ్ల తల్లి గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఈ మధ్య కాలం చేసింది. అయితే, సంతాప సందేశంగా ఆమె కుమారుడు ట్రంప్.. హిల్లరీలకు ఓటు వేయడం ఇష్టం లేక తమ తల్లి ప్రాణాలు విడిచిందని వారు హాస్య భరితంగా చెప్పారు. ఈ విషయంపై వారి తండ్రి స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ట్రంప్, హిల్లరీపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. తన భార్యకు హాస్యం అంటే చాలా ఇష్టమని అందుకే తమ కుమారుడు అలా పేర్కొన్నాడని వివరించారు. -
నేడు అలీ సంస్మరణ సభ
లూయిస్విల్లే: బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ సంస్మరణ సభలో పాల్గొనేందుకు అభిమానులు పోటీపడ్డారు. శుక్రవారం జరిగే మెమోరియల్ టిక్కెట్ల కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు 15 వేల టిక్కెట్లను పంపిణీ చేశారు. తన మరణానంతరం జరిగే సంస్మరణ సభకు అభిమానులను ఉచితంగానే ఆహ్వానించాలని అలీ చెప్పినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్, కమెడియన్ క్రిస్టల్ ఉపన్యసిస్తారు. -
బిన్ లాడెన్ బతికే ఉన్నాడు!
ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఇంకా పాకిస్తాన్ లోనే ఉన్నట్లు తాము విశ్వసిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ తెలిపారు. తాలిబన్ అధినేత ముల్లా ఒమర్ కూడ అక్కడే ఉన్నట్లు ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని హిల్లరీ తెలిపారు. అధ్యక్షుడు బరాక్ ఒబామాకు టాప్ అడ్వైజర్ గా ఉన్న 68 ఏళ్ళ హిల్లరీ క్లింటన్... 2011, మే 2న ఆపరేషన్ లో భాగంగా ఆల్ ఖైదా నాయకుడు, తీవ్రవాది అయిన బిన్ లాడెన్ కనిపిస్తే చంపేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం బిన్ లాడెన్ సహా ఆల్ ఖైదా నాయకులు పాకిస్తాన్ లోనే ఉన్నట్లు ఆమె సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆల్ ఖైదా సూత్రధారులపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని క్లింటన్ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ బృందం 2001 సెప్టెంబర్ 11న ఆమెరికాలో జరిగిన దాడులకు బాధ్య వహించాల్సిందేనని క్లింటన్ అంటున్నారు. కాగా హిల్లరీ అనుమానాలను పాకిస్తాన్ నాయకులు ఖండిస్తున్నారు. -
న్యూయార్క్‌లో ట్రంప్, హిల్లరీ గెలుపు
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీలో ట్రంప్, డెమోక్ర టిక్ పార్టీలో హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారు. మంగళవారం జరిగిన న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో ఇద్దరూ విజయం సాధించి.. ఆయా పార్టీల నామినేషన్‌కు చేరువగా నిలిచారు. స్వస్థలమైన న్యూయార్క్‌లో గెలుపుతో సుమారు 95 మంది డెలిగేట్లను గెల్చుకున్న ట్రంప్.. ఇప్పటికి 847 మంది డెలిగేట్ల మద్దతు సాధించారు. నామినేషన్‌కు అవసరమైన 1,237 మంది డెలిగేట్లను పొందే దిశగా సాగిపోతున్నారు. జూలైలో జరిగే పార్టీ సమావేశంలో పోటీ చేసే అవసరం లేకుండానే రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందే స్థితి సాధించారు. హిల్లరీ క్లింటన్ డెలిగేట్ల సంఖ్య 1,990కి చేరింది. -
క్లింటన్‌కు రూ.40 కోట్ల విరాళం
మాస్కో: అమెరికా అధ్యక్ష పదవికోసం డెమొక్రటిక్ పార్టీ తరుపున బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్‌కు ఆ దేశ బిలియనీర్ జార్జ్ సోరోస్ ఆరు మిలియన్ డాలర్ల(రూ.40,74,00,013)ను విరాళం ఇచ్చారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన గత డిసెంబర్ లో క్లింటన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ప్యాక్)కు ఈ మొత్తం అందించినట్లు పాక్ కమిటీ తెలిపింది. కాగా, ఇప్పటికే 2015 ముగిసే సమయానికి క్లింటన్ కు మద్దతు ప్రకటిస్తూ వచ్చిన విరాళాల మొత్తం 41 మిలియన్ డాలర్లకు చేరినట్లు ది హిల్ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ విరాళాల్లో మీడియా మొఘల్, సంగీతకారుడు హెయిమ్ సాబన్, ఆయన భార్య చెరిల్ అత్యధిక మొత్తంలో విరాళం ఇచ్చినట్లు కూడా ఆ మీడియా వెల్లడించింది. దీంతోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన ఒబామాకు కూడా ప్రస్తుతం ఆరు మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చిన సోరోస్ ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది నవంబర్ 8న కొత్త అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుపున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరుపున ప్రముఖ వ్యాపార వేత్త డోనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు.