అలా అయితే.. ట్రంప్ సంచలన విజయమే!
కనీసం నాలుగు తరాల తాతలు అమెరికన్లు అయిన వారి పిల్లలకు మాత్రమే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే నిర్ణయాధికారం ఉండివుంటే.. అగ్రరాజ్యంలోని 50 రాష్ట్రాల్లోనూ డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయం సాధించేవారు.. ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, కన్జర్వేటివ్ విశ్లేషకురాలు ఆన్ కౌల్టర్ చేసిన ట్వీట్ ఇది. కాబోయే అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తేల్చేందుకు ఒకవైపు పోలింగ్ కొనసాగుతుండగానే.. ఆమె చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్ని రేపింది.
అమెరికన్ మూలవాసులు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు మాత్రమే మద్దతిస్తారన్న అంతరార్థంతో ఆమె చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలో జాతివివక్ష, విదేశీ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని పలువురు మండిపడ్డారు. నాజీ జర్మన్ల విధానాన్ని తలపించేలా కౌల్టర్ ట్వీట్ చేశారని మరికొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. హిట్లర్ హయాంలో 1930లో యూదులకు పౌరసత్వం నిరాకరించే చట్టాన్ని నాజీ జర్మనీ తీసుకొచ్చింది. మూడు, నాలుగు తరాల కిందట తాతలు యూదులుగా ఉన్నా.. వారి పౌరసత్వాన్ని రద్దుచేసింది. నిజమైన జర్మన్లను యూదులు పెళ్లిచేసుకోవడాన్ని, వారితో శృంగార సంబంధాలు పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ ఈ చట్టాన్ని తెచ్చింది. ఇప్పుడు కౌల్టర్ ట్వీట్ ఆనాటి నాజీ చట్టాన్ని గుర్తుకుతెస్తున్నదని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.
నిజానికి కౌల్టర్ వాదన ప్రకారమే చూసుకుంటే ట్రంప్ సైతం అమెరికాలో ఓటు వేయడానికి అనర్హుడు అవుతారు. ఆయన తల్లి స్కాట్లాండ్ దేశస్తురాలు. ట్రంప్ పిల్లలకు కూడా ఓటు వేసే హక్కు ఉండదు. ఎందుకంటే ట్రంప్ మాజీ భార్య ఇవానా, ప్రస్తుత భార్య మెలినీయా అమెరికాకు వలస వచ్చినవారే. అలాంటప్పుడు అవకాశాల స్వర్గధామమైన అమెరికాకు వలసవచ్చిన వారిపట్ల పట్ల వివక్ష చూపుతూ ఇలా ట్వీట్ చేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.