అందరికీ షాక్.. ఆయనకు పండుగ!
అందరికీ షాక్.. ఆయనకు పండుగ!
Published Wed, Nov 9 2016 6:41 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయం సాధించడంపై మన బాలీవుడ్ ప్రముఖులు పలువురు షాక్, విస్మయం వ్యక్తం చేయగా.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ట్రంప్ విజయంపై పలువురు నటులు, సెలబ్రిటీలు ఒకింత నిరాశపూరితమైన ట్వీట్లు చేయగా.. వర్మ మాత్రం తాను పండుగ చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
‘నాలుగు నెలల కిందటే ట్రంప్ గెలుస్తాడని ఊహించినందుకు నన్ను నేను అభినందించుకుంటున్నా. ఈ రోజు రాత్రి నేను ట్రంపింగ్ పార్టీ చేసుకుంటున్నా’ అని రాము ట్వీట్ చేశాడు. ‘ట్రంప్ మూర్ఖుడని భావించిన ప్రజలంతా మూర్ఖులని తేలిపోయింది హాహాహా’ అంటూ పేర్కొన్నాడు. ‘ట్రంప్‌కు వ్యతిరేకంగా ఒబామా ప్రచారం చేసినా.. గతంలో ఒబామా గెలిచిన ప్రాంతాలన్నింటిలోనూ ట్రంప్ గెలిచాడు. కాబట్టి ట్రంప్ ఒక్క హిల్లరీనే కాదు ఒబామాను కూడా ఓడించినట్టే’ అని తనదైన స్టైల్‌లో విశ్లేషించాడు.
ట్రంప్ గెలుపుపై ఒక్క రితేశ్ దేశ్‌ముఖ్ మాత్రమే అభినందనలు తెలియజేయగా.. ట్రంప్ గెలుపుపై మహేశ్ భట్, కరణ్‌జోహార్, తదితరులు సాదాసీదాగా ట్వీట్ చేశారు. కాగా, ‘ఐన్‌స్టీన్ పేర్కొన్న ప్రకారం.. కేవలం రెండు విషయాలు మాత్రమే అనంతమైనవి. ఒకటి విశ్వం, రెండోది మూర్ఖత్వం. అయితే, మొదటి విషయం గురించి నాకు తెలియదు’ అంటూ ‘బజరంగీ భాయ్‌జాన్’ దర్శకుడు కబీర్ ఖాన్ స్పందించారు.
Advertisement
Advertisement