ఒబామాకు ముందే తెలుసా?
ఒబామాకు ముందే తెలుసా?
Published Wed, Nov 9 2016 5:08 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
‘ఏది ఏమైనా సూర్యుడు ఉదయించకమానడు’ .. అమెరికా ఎన్నికల నాటి రాత్రి బరాక్ ఒబామా ప్రజలకు ఇచ్చిన సందేశం. అమెరికా చరిత్రలోనే అత్యంత విభజనపూరితంగా, విద్వేషపూరితంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏ అనూహ్య ఫలితం వచ్చినా ప్రజలు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిస్తూ ఆయన సందేశం ఇచ్చారు. ఆయన పేర్కొన్నట్టూ యావత్ ప్రపంచం ఊహించనిరీతిలో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను చిత్తచేస్తూ అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు.
నిజానికి ఎన్నికలనాటి రాత్రి ఒబామా ఇచ్చిన సందేశానికి.. అంతకుముందురోజు ఫిలడెల్ఫియాలో హిల్లరీ చివరి ప్రచారసభలో ఇచ్చిన ఉత్సాహపూరితమైన ఉపన్యాసానికి మధ్య ఎంతో తేడా ఉండటం గమనార్హం. ఫిలడెల్ఫియా ప్రచార సభలో హిల్లరీ, చెల్సియాతో కలిసి ఒబామా, ఆయన సతీమణి మిషెల్లీ పాల్గొన్నారు. హిల్లరీ విజయం ఖాయమంటూ ఈ సభలో ఉత్సాహపూరితమైన ప్రసంగాలు ఒబామా, మిషెల్లీ చేశారు. కానీ, ఎన్నికల రోజు నాటికి వచ్చేసరికి దిగిపోతున్న అధ్యక్షుడైన ఒబామా స్వరంలో మార్పు కనిపించింది.
‘మనం ఈసారి కొన్ని కొత్త విషయాలు చూశాం. కానీ ఎంతో కరుడుగట్టిన కరుకు ప్రజాస్వామ్యమైన మన దేశానికి ఇది కొత్త కాదు. గతంలోనూ మనం కఠినమైన, విభజనపూరితమైన ఎన్నికలను చూవిచూశాం. వాటి నుంచి మరింత బలోపేతం అయ్యాం’ అని ఒబామా పేర్కొన్నారు. ‘ఏదిఏమైనా సూర్యుడు ఉదయించకమానడన్న విషయాన్నీ, భూమిపై అమెరికా ఎప్పటికీ గొప్ప దేశంగా ఉంటుందన్న విషయాన్నీ మరిచిపోకండి’ అంటూ ఒబామా సందేశం ఇచ్చారు. ఎంతో ఆచితూచి ఇచ్చిన ఈ సందేశాన్ని చూస్తే.. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న డెమొక్రటిక్ కథ కంచికి చేరిన విషయాన్నీ, ట్రంప్ విజయాన్ని ఒబామా ముందే పసిగట్టినట్టు కనిపిస్తోంది.
Advertisement
Advertisement