మిడ్‌నైట్ ఓటింగ్‌లో ట్రంప్ దూకుడు!
మిడ్‌నైట్ ఓటింగ్‌లో ట్రంప్ దూకుడు!
Published Tue, Nov 8 2016 3:59 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. సంప్రదాయబద్ధంగా జరిగే మిడ్‌నైట్ ఓటింగ్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. న్యూహాంప్‌షైర్‌లోని మూడు చిన్న పట్టణాల్లో మిడ్‌నైట్ ఓటింగ్ నిర్వహించగా.. తన ప్రత్యర్థి అయిన డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్ పైచేయి సాధించినట్టు 'యూఎస్‌ఏ టుడే' మీడియా సంస్థ తెలిపింది.
న్యూహాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాట్చ్, హర్ట్జ్ లోకేషన్, మిల్స్‌ఫీల్డ్ తదితర మూడు పట్టణాల్లో సంప్రదాయ మిడ్‌నైట్ ఓటింగ్‌ను నిర్వహించారు. ఈ మూడు పట్టణాల్లోనూ జనాభా వందకులోపే ఉంటుంది. ఇక్కడ జరిగిన ఓటింగ్‌లో ట్రంప్‌కు 32 ఓట్లు రాగా, హిల్లరీకి 25 ఓట్లు వచ్చాయి.
న్యూ హాంప్‌షైర్ చట్టం ప్రకారం 100లోపు ఓట్లు ఉన్న కమ్యూనిటీలు అర్ధరాత్రే ఓటింగ్‌లో పాల్గొని.. తమ ఫలితాన్ని వెల్లడించే వీలుంటుంది. మిగతా రిజిష్టర్డ్ ఓటర్లు తెల్లారి జరిగే ప్రధాన పోలింగ్‌లో పాల్గొంటారు. ఈ మిడ్‌నైట్ ఓటింగ్ జరిగే డిక్స్‌విల్లేలోనూ, హర్ట్స్ లోకేషన్‌లోనూ ట్రంప్‌పై క్లింటన్ వరుసగా 4-2, 17-14 ఓట్ల తేడాతో పైచేయి సాధించారు. అయితే, ఈ రెండింటికన్న అత్యధికంగా ఓట్లు ఉండే మిల్స్‌ఫీల్డ్‌లో మాత్రం క్లింటన్‌పై ట్రంప్ 16-4 ఓట్ల తేడాతో స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో మొత్తంగా ఈ మూడు పట్టణాల్లో ట్రంప్‌దే విజయంగా కనిపిస్తోంది.
Advertisement
Advertisement