క్లింటన్కు రూ.40 కోట్ల విరాళం
మాస్కో: అమెరికా అధ్యక్ష పదవికోసం డెమొక్రటిక్ పార్టీ తరుపున బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్కు ఆ దేశ బిలియనీర్ జార్జ్ సోరోస్ ఆరు మిలియన్ డాలర్ల(రూ.40,74,00,013)ను విరాళం ఇచ్చారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన గత డిసెంబర్ లో క్లింటన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ప్యాక్)కు ఈ మొత్తం అందించినట్లు పాక్ కమిటీ తెలిపింది. కాగా, ఇప్పటికే 2015 ముగిసే సమయానికి క్లింటన్ కు మద్దతు ప్రకటిస్తూ వచ్చిన విరాళాల మొత్తం 41 మిలియన్ డాలర్లకు చేరినట్లు ది హిల్ వార్తా పత్రిక వెల్లడించింది.
ఈ విరాళాల్లో మీడియా మొఘల్, సంగీతకారుడు హెయిమ్ సాబన్, ఆయన భార్య చెరిల్ అత్యధిక మొత్తంలో విరాళం ఇచ్చినట్లు కూడా ఆ మీడియా వెల్లడించింది. దీంతోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన ఒబామాకు కూడా ప్రస్తుతం ఆరు మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చిన సోరోస్ ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది నవంబర్ 8న కొత్త అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుపున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరుపున ప్రముఖ వ్యాపార వేత్త డోనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు.