మరో దిక్కుకు అమెరికా యుద్ధ నౌకలు
వాషింగ్టన్: తమ యుద్ధ నౌకలు ప్రస్తుతం ఉత్తర కొరియా వైపు వెళ్లడం లేదని అమెరికా స్పష్టం చేసింది. సరిగ్గా దానికి వ్యతిరేక దిశకు వెళ్లినట్లు తెలిపింది. అమెరికాకు చెందిన విన్సన్ యుద్ధ వాహక నౌక పెద్ద మొత్తంలో అణ్వాయుధాలతో, యుద్ధ విమానాలతో ఉత్తర కొరియా వైపు దూసుకెళుతున్నట్లు ఈ నెల 8న అమెరికా తెలిపిన విషయం తెలిసిందే. సిరియాలోని ప్రభుత్వ వైమానిక స్థావరాలపై క్షిపణి దాడుల అనంతరం ఈ నౌకలు ఉత్తర కొరియాను హెచ్చరించేందుకు ట్రంప్ ఆదేశాల మేరకు బయలుదేరినట్లు వార్తలొచ్చాయి.
దీంతోపాటు ఒక జలాంతర్గామిని కూడా పంపించినట్లు స్వయంగా ట్రంపే చెప్పారు. దీంతో ఉత్తర కొరియా కూడా కంగారుపడిపోయి అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకింత అడుగు ముందుకేసి తాము యుద్ధానికి సై అంటూ కూడా ప్రకటించింది. దీంతో దాదాపు అంతర్గతంగా చర్చలు ప్రారంభమై ప్రస్తుతం మనసు మార్చుకున్న అమెరికా నేవీ దళం ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ ప్రాంతంవైపు వెళ్లినట్లు తెలిసింది.