'ఉత్తర కొరియా' వెళ్లకుండా యూఎస్ బ్యాన్!
బీజింగ్: తమ దేశ పౌరులను ఇక ఉత్తర కొరియాకు వెళ్లనివ్వకూడదని అమెరికా నిర్ణయించుకుంది. ఉత్తర కొరియా విధించిన జైలు శిక్ష కారణంగా తమ దేశ పర్యాటకుడు ఒట్టో వాంబియర్ మృతి చెందిన నేపథ్యంలో మరికొద్ది వారాల్లోనే తమ దేశ పౌరులెవరనీ కూడా ఉత్తర కొరియాకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చైనాకు చెందిన ఓ ట్రావెల్ సంస్థ, కొరియాకు చెందిన ట్రావెల్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ నెల (జూలై) 27 నుంచి ఈ బ్యాన్‌ను అమెరికా అమలు చేస్తుందని పేర్కొన్నాయి.
దీని ప్రకారం ఉత్తర కొరియాకు వెళ్లిన, వెళుతున్న అమెరికా వారి పాస్‌పోర్టులను 30 రోజుల వరకే అనుమతి ఉంటుందట. ఆ తర్వాత వాటిని రద్దు చేస్తుందని ఆ సంస్థలు వెల్లడించాయి. 'అమెరికా ప్రభుత్వం నుంచి మాకు ఇప్పుడే సమచారం అందింది. అమెరికా పౌరులను ఇక ఎంతో కాలము ఉత్తర కొరియా వెళ్లేందుకు అనుమతించడం కుదరదు. అలా వెళ్లిన వారి పాస్‌పోర్ట్‌లు 30 రోజుల విలువలేనివిగా మారిపోతాయి' అని చైనాకు చెందిన ట్రావెలింగ్ సంస్థ యంగ్ పయనీర్ టూర్స్ తెలిపింది. అయితే, అమెరికాకు చెందిన ఏ విభాగం ఈ ప్రకటన చేసిందనే విషయాన్ని మాత్రం తెలపలేదు.