‘ట్రంప్, హిల్లరీకి ఓటు వేయలేక ప్రాణాలువిడిచింది’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు ఓటేయడం ఇష్టం లేక ఓ మహిళ ప్రాణాలు విడిచిందట. 68 ఏళ్ల మహిళ ఎన్నికల బరిలో ఉన్న నేతలెవరు ఇష్టం లేక వారికి ఎక్కడ ఓటెయ్యాల్సి వస్తుందో అని ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఆమెకు నిజంగా ట్రంప్ అన్నా హిల్లరీ అన్నా అంత అసహ్యమా.. ఒక వేళ అసహ్యం ఉంటే ఇద్దరికీ ఓటు వేయకుండా ఉంటే సరిపోతుందిగా.. ఇలా అని అనుకోవచ్చు.
కానీ ఇక్కడే గమ్మత్తు జరిగింది. తల్లి చనిపోయిందనే బాధ కూడా లేకుండా ఆమె కుమారుడు చేసిన పని ఇది. మేరీ అన్నె నోలాండ్ అనే తమ 68 ఏళ్ల తల్లి గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతూ ఈ మధ్య కాలం చేసింది. అయితే, సంతాప సందేశంగా ఆమె కుమారుడు ట్రంప్.. హిల్లరీలకు ఓటు వేయడం ఇష్టం లేక తమ తల్లి ప్రాణాలు విడిచిందని వారు హాస్య భరితంగా చెప్పారు. ఈ విషయంపై వారి తండ్రి స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ట్రంప్, హిల్లరీపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. తన భార్యకు హాస్యం అంటే చాలా ఇష్టమని అందుకే తమ కుమారుడు అలా పేర్కొన్నాడని వివరించారు.