హిల్లరీపై ట్రంప్ తీవ్ర విమర్శలు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి హిల్లరీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిల్లరీ క్లింటన్ అవినీతి రాణి(కరప్షన్ క్వీన్) అని ట్రంప్ ఆరోపించారు. ఇటీవలి పలు సర్వేలు హిల్లరీకి జనాదరణ పెంరిగిందని వెల్లడించిన నేపథ్యంలో ట్రంప్ ఈ విమర్శలు చేశారు. గతంలో ఆమెను 'దెయ్యం' అని కూడా ట్రంప్ విమర్శించిన విషయం తెలిసిందే.
హిల్లరీ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే దేశాన్ని నాశనం చేస్తుందని ఐయోవాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్ హెచ్చరించారు. 'హిల్లరీ ప్రెసిడెంట్ అయితే దేశంలో ఉగ్రవాదం ఉంటుంది, సమస్యలు ఉంటాయి.. ఒకరకంగా ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవడమంటే స్వయంగా దేశాన్ని నాశనం చేసుకోవడమే' అని ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిల్లరీని సమన్వయం లోపించిన వ్యక్తిగా ట్రంప్ పేర్కొన్నాడు. ఆమె అమెరికా అధ్యక్షురాలిగా ఉండేంత స్ట్రాంగ్ కాదని ట్రంప్ విమర్శించారు.