క్లింటన్ వెనుకబడిపోతున్నారట!
క్లింటన్ వెనుకబడిపోతున్నారట!
Published Tue, Sep 20 2016 7:12 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
అగ్రరాజ్య అధినేత ఎన్నికలకు ఇంకా 50 రోజులు కూడా మిగిలి లేవు. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కు మధ్య పోటీ మరింత తీవ్రతరమవుతుందని వెల్లడవుతోంది. ఇన్నిరోజులు ఆధిక్యంలో కొనసాగుతున్న హిల్లరీ క్లింటన్, అగ్రరాజ్య అధినేతగా గెలిచే అవకాశాల్లో వెనుకబడుతున్నారని తాజా సర్వేలు పేర్కొంటున్నాయి. ఇదేసమయంలో ట్రంప్ విక్టరీపై అవకాశాలు మెరుగుపడుతున్నాయని ఈ తాజా అంచనాలు పేర్కొంటున్నాయి. సీఎన్బీసీ గ్లోబల్ సీఎఫ్ఓ కౌన్సిల్ జూలైలో నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది అమెరికన్లు క్లింటన్ గెలుస్తారంటూ అభిప్రాయాలు వెల్లువెత్తగా.. ప్రస్తుత సర్వేలో క్లింటన్ వైపు మొగ్గుచూపేవారు వారి శాతం 10 శాతం తగ్గిందట. ఇదేసమయంలో ట్రంప్ గెలిచే అవకాశ శాతం రెండింతలు పెరిగి, 20 శాతానికి చేరినట్టు వెల్లడైంది.
సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 16 వరకు సీఎఫ్ఓ కౌన్సిల్ ఈ పోల్ నిర్వహించింది. ముందస్తు సర్వే కంటే ఈ సర్వేలో కౌన్సిల్లోని ఐదుగురు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్లు ట్రంప్ గెలుస్తారంటూ జోస్యం చెప్పారని సీఎన్బీసీ పేర్కొంది. ట్రంప్కు గెలిచే అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, మెజార్టీ సీఎఫ్ఓలు క్లింటన్కే మొగ్గుచూపుతున్నారని తెలిపింది. సీఎన్బీసీ గ్లోబల్ సీఎఫ్ఓ కౌన్సిల్లో ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలుంటాయి. వివిధ రంగాల్లో 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉన్న కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ట్రంప్ పై అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, మెజార్టీ సభ్యులు క్లింటన్ వైపే మొగ్గుచూపడం విశేషం.
Advertisement
Advertisement