వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం లభించిన అనంతరం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకునే వాలంటీర్లుగా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. టీకా భద్రత, ప్రభావంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తమ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఇదొక శక్తివంతమైన సందేశంగా ఉంటుందని వీరు భావిస్తున్నారు. (వ్యాక్సిన్ : లండన్‌కు క్యూ కట్టనున్న ఇండియన్స్)
అమెరికన్ పబ్లిక్ హెల్త్ అధికారులు వ్యాక్సిన్ తీసుకోవటానికి ప్రజలను ఒప్పించటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ వైట్ హౌస్ కరోనావైరస్ ప్రతిస్పందన సమన్వయకర్త డాక్టర్ డెబోరా బ్రిక్స్‌తో వీరు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కెమెరా సాక్షిగా వ్యాక్సిన్ డోస్‌లను తీసుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు వాలంటీర్‌గా 43వ అధ్యక్షుడు బుష్ సిద్ధంగా ఉన్నారని ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫ్రెడ్డీ ఫోర్డ్ మీడియాకు వెల్లడించారు. అటు టీకాను ప్రోత్సహించడానికి బహిరంగ ప్రదేశంలో తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని క్లింటన్ చెప్పారని క్లింటన్ ప్రెస్ సెక్రటరీ ఏంజెల్ యురేనా ప్రకటించారు. ప్రజారోగ్య అధికారులు నిర్ణయించిన ప్రాధాన్యతల ఆధారంగా అధ్యక్షుడు క్లింటన్ టీకాను తీసుకుంటారన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ సురక్షితమని ఫౌసీ చెప్పినట్లయితే, తాను కూడా పూర్తిగా విశ్వసిస్తానని, కచ్చితంగా టీకా తీసుకుంటానని మరో మాజీ అధ్యక్షుడు ఒబామా తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో మరో మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ టీకాను బహిరంగంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది.
కాగా సెప్టెంబర్ 11, 2001 ఉగ్రదాడి తరువాత ప్రజల విశ్వాసాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బుష్ తల్లిదండ్రులు దివంగత మాజీ అధ్యక్షులు జార్జ్ హెచ్.డబ్ల్యు.బుష్, బార్బరా బుష్ ఒక వాణిజ్య విమానంలో ప్రయాణించారు. అలాగే 2005 లో కత్రినా హరికేన్ ప్రభావానికి భారీగా దెబ్బతిన్న ప్రాంతాల ప్రజల సహాయార్థం జార్జ్ హెచ్.డబ్ల్యు బుష్ క్లింటన్ నిధుల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment