వాషింగ్టన్: కరోనా టీకా డోసుల మధ్య విరామ సమయాన్ని పెంచడం ద్వారా కరోనా వేరియంట్ల బారిన పడే ప్రమాదముందని అమెరికా మెడికల్ అడ్వైజర్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఇదే జరిగిందని చెప్పారు. కాగా షెడ్యూల్ ప్రకారం టీకా వేయాలని సూచించారు. గత నెలలో భారత ప్రభుత్వం టీకాల మధ్య విరామ సమయాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విలేకరులు దీనిపై అడిగిన ప్రశ్నకు డాక్టర్ ఫౌసీ ఈ విధంగా స్పందించారు.
ఇక అమెరికాలో కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్ బలంగా ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వీలైనంత త్వరగా టీకా వేయాలని ఫౌచీ సూచించారు. వ్యాక్సిన్ల మోతాదుల మధ్య అనువైన విరామం సమయం.. ఫైజర్‌కు మూడు వారాలు, మోడర్నాకు నాలుగు వారాలుగా తెలిపారు. విరామ సమయం పొడగించడంతో పలు రకాల వేరియంట్ల బారినపడే అవకాశాలు ఎక్కువని వెల్లడించారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో డెల్టా వేరియంట్ బలంగా ఉందని గుర్తు చేశారు.
టీకాలు వేసిన దేశాల్లో వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. కొవిడ్‌తో పోరాడేందుకు టీకాలు కీలకమని, ఎవరైనా ఇంతకు ముందు వైరస్ బారినపడినప్పటికీ టీకాలు వేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వచ్చే కరోనా థర్డ్, మరిన్ని వేవ్‌ల నుంచి ప్రజలను రక్షించడంలో వ్యాక్సిన్ కీలకమని వివరించారు.ఇటీవల భారత్‌లో కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రభుత్వం మొదట ఆరు నుంచి 8 వారాలకు పెంచిన ప్రభుత్వం ఆ తరువాత 12 నుంచి 16 వారాలకు పెంచింది. అంతకు ముందు మార్చి నెలలో అయితే 28 రోజులు ఉంటే సరిపోతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment