పాకిస్థాన్లో రాజకీయ అలజడి
పాకిస్థాన్లో రాజకీయ అలజడి
Published Sat, Oct 29 2016 2:13 PM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM
ఇస్లామాబాద్: ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నవంబర్ 2న తలపెట్టిన 'ఇస్లామాబాద్ ముట్టడి' పాకిస్థాన్ లో తీవ్ర రాజకీయ అలజడిని సృష్టిస్తోంది. ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా చేస్తోన్న ఆందోళనలను మరింత ఉధృతం చేసే దిశగా పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన 'రాజధాని ముట్టడి' పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. వేలాది మంది పీటీఐ కార్యకర్తలతోపాటు సాధరణ జనం ఇప్పటికే ఇస్లామాబాద్ బాటపట్టినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. పలు పట్టణాల్లో పీటీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఇస్లామాబాద్ నగర తూర్పు ప్రాంతం బనీగాలలోని ఇమ్రాన్ ఖాన్ నివాసాన్ని కూడా శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అక్కడున్న వందలాది మంది కార్యకర్తలపై లాఠీచార్జి చేసి ఖాన్ ను హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి తర్వాత కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సూచన మేరకు ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ కార్యకర్తలు, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.
నవంబర్ 2న ప్రజాస్వామ్యం అంటే ఏమిటో నవాజ్ షరీఫ్ కు రుచిచూపిస్తామని, ఆయన నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పంజాబ్, ఖైబర్ ఫక్తున్ఖాల నుంచి ఇస్లామాబాద్ కు వెళ్లే రహదారులను పోలీసులు దిగ్బంధించారని, ప్రధాన రహదారులపై కాకుండా ఇతర మార్గాల్లో ఇస్లామాబాద్ కు పయనం కావాలని కార్యకర్తలకు సూచించారు. ఇమ్రాన్ ఖాన్ గృహనిర్బంధాన్ని గర్హిస్తూ పాకిస్థాన్ అంతటా నిరసనలు మిన్నంటాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అతని కుటుంబం భారీ అక్రమాలకు పాల్పడినట్లు పనామా పేపర్స్ బయటపెట్టిన నాటి నుంచి పీటీఐ ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement