
పబ్లిక్ ఇష్యూలు సృజనాత్మకంగా ఉండొచ్చు..
ఇన్వెస్టర్లను ఆకట్టుకునే తాపత్రయంతో కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ప్రకటనలను సృజనాత్మకంగా రూపొందించుకోవడంలో తప్పు లేదని, అయితే ఇవి తప్పుదోవ పట్టించకుండా ఉండాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ యూకే సిన్హా అభిప్రాయపడ్డారు.
ముంబై: ఇన్వెస్టర్లను ఆకట్టుకునే తాపత్రయంతో కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ప్రకటనలను సృజనాత్మకంగా రూపొందించుకోవడంలో తప్పు లేదని, అయితే ఇవి తప్పుదోవ పట్టించకుండా ఉండాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ యూకే సిన్హా అభిప్రాయపడ్డారు. పబ్లిక్ ఆఫర్ ప్రకటనల్లో పూర్తి రిస్కులు, ఇతర ముఖ్యమైన అంశాల గురించి సంపూర్ణంగా వివరాలు ఉండాల్సిందేనన్నారు. సాధారణంగా ఐపీవోలు, ఎఫ్‌పీవోల ప్రకటనలు మూసపోసినట్లుగా ఒకే ధోరణిలో ఉంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నిర్దేశిత స్వరూపానికి లోబడి కంపెనీలు సృజనాత్మకంగా ప్రకటనలను రూపొం దించుకోవడానికి సెబీ వ్యతిరేకమేమీ కాదని సిన్హా పేర్కొన్నారు. స్తబ్దుగా ఉన్న ప్రైమరీ మార్కెట్‌కి ఊతమిచ్చేదిశగా సెబీ అనేక వెసులుబాటు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇష్యూల సంఖ్య పెద్దగా పెరగడం లేదు. నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చినప్పటికీ సుమారు రూ. 72,000 కోట్లు విలువ చేసే పబ్లిక్ ఆఫర్లు... ఇంకా మార్కెట్లోకి రాలేదు.