రాంగ్‌రూట్లో వెళ్లద్దన్నాడని.. టెకీని పొడిచేశారు!
అతడో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నది అతడి ఉద్దేశం. కానీ అదే అతడికి ముప్పు తెచ్చిపెట్టింది. పుణె నగరంలో ఎప్పుడూ బిజీగా ఉండే ఫెర్గూసన్ కాలేజి రోడ్డులో రాంగ్‌రూట్లో వెళ్లనని చెప్పినందుకు అతడిని ఓ మోటారు సైక్లిస్టు కత్తితో పొడిచేశాడు. ఊపిరితిత్తుల దిగువ భాగంలో కత్తిపోట్లు దిగిన అతడిని స్నేహితులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కత్తి పోటు ఏమాత్రం కాస్త పక్కకు దిగినా అతడి ప్రాణాలు పోయేవని, అదృష్టవశాత్తు బతికాడని పోలీసులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆసక్తి చూపించకపోయినా, పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే కత్తితో పొడిచిన మోటారు సైక్లిస్టు అక్కడినుంచి పరారయ్యాడు.
దాడికి గురైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంటుకు డిన్నర్‌కు వచ్చాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో వాళ్లు బయటకు వచ్చి, రోడ్డు మీద మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో రాంగ్‌రూట్లో వస్తున్న ఓ మోటారు సైక్లిస్టు వీళ్లతో గొడవ పడ్డాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతడి మీద ఆగ్రహం వ్యక్తం చేసి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పాడని, దాంతో అతడ కొంతదూరంలో ఆగి మళ్లీ వెనక్కి వచ్చి, ఇతడిని పొట్టలో కత్తితో పొడిచేశాడని ఎస్ఐ రాహుల్ కలంబికర్ చెప్పారు. అప్పటికి పక్కనున్న స్నేహితులు అతడు ఊరికే కొట్టాడని అనుకున్నారు. బాధితుడు కొంతదూరం వరకు గాయాల మీద చేత్తో పట్టుకుని వెళ్లాడు. వీధిలైట్ల కిందకు వెళ్లిన తర్వాత అప్పుడు మిగిలిన స్నేహితులు రక్తం చూసి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.