సారీ.. ఆమెను తోసేసిన బస్సు మాదే!
పంజాబ్ రాష్ట్రంలో అమ్మాయిని లైంగికంగా వేధించి.. బస్సులోంచి తోసేసి.. ఆమె చనిపోయిన ఘటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఖండించారు. అయితే.. ఆ బస్సు తమ కుటుంబ కంపెనీకి చెందినదేనని ఆయన అంగీకరించారు. అయినా సరే, నిందితులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ వర్గాలు మోగాలో నిరసన ప్రదర్శన చేశాయి.
14 ఏళ్ల వయసున్న బాలికను కొంతమంది ఈవ్ టీజర్లు కదులుతున్న బస్సులోంచి కిందకు తోసేశారు. తీవ్రగాయాలతో ఆమె మరణించగా, ఆమె తల్లి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. మోగా జిల్లాలో తమ గ్రామం నుంచి గురుద్వారాకు వెళ్లేందుకు ఆ బాలిక, ఆమె తల్లి కలిసి ఓ ప్రైవేటు బస్సు ఎక్కారు. అక్కడ కొంతమంది వ్యక్తులు ఆమెను లైంగికంగా వేధించబోగా.. వాళ్లు అడ్డుకున్నారు. దాంతో వాళ్లామెను బస్సులోంచి కిందకు తోసేశారు. బస్సులో ఆ సమయానికి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆమెను వేధించినవాళ్లు బస్సు డ్రైవర్, కండక్టర్ల స్నేహితులని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికి ఇద్దరిని అరెస్టు చేశారు.