
మరో వివాదంలో రాధే మా
చండీగఢ్: ఆధ్యాత్మిక గురువు రాధే మా మరో వివాదంలో ఇరుకున్నారు. విచారణకు హాజరు కావాలంటూ పంజాబ్ పోలీసులు రాధే మాకు నోటీసు జారీ చేశారు. ఆమె మత విశ్వాసాలను కించపరిచారని పంజాబ్లోని పగ్వారా నివాసి సురీందర్ మిట్టల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధే మా డబ్బులు ఇవ్వాల్సిందిగా తనను డిమాండ్ చేసి, ఇవ్వనందుకు బెదిరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఓ పోలీస్ అధికారి ముంబైకి వెళ్లి రాధే మాకు నోటీసు జారీ చేశారు.
రాధే మాతో పాటు ఆమె సోదరి రజ్జో, కోడలు మేఘ, సహాయకురాలు రీతూ సరీన్, అనుచరుడు సంజీవ్ గుప్తాలపై కూడా కేసు నమోదు చేయాలని సురీందర్ ఫిర్యాదు చేశారు. రాధే మాతో మాట్లాడినప్పడు రికార్డు చేసిన ఫోన్ సంభాషణలను పోలీసులకు అందజేశారు. ఆమె అసభ్యత, అశ్లీలతను ప్రచారం చేస్తూ మత విశ్వాసాలను దెబ్బ తీస్తున్నారని సురీందర్ ఆరోపించారు. వరకట్నం కేసులో ఇటీవల రాధే మాను ముంబై పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.