
అమెరికాలో తెలుగు విద్యార్థులపై ప్రశ్నల వర్షం
ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపిస్తున్న అధికారులు
రాయికల్: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నారు. వారం రోజుల నుంచి విద్యార్థులపై అమెరికా అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఇండియా నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులకు ఎయిర్‌పోర్టులో దిగగానే కస్టమ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (సీబీపీవో) వేస్తున్న ప్రశ్నలకు విద్యార్థులు తడబడుతూ సమాధానమిస్తుండడంతో ఎయిర్‌పోర్టు నుంచే తిరిగి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షుడు కాల్వల విశ్వేశ్వర్‌రెడ్డి, అమెరికాలోని అటార్నీగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన జనితారెడ్డిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఇండియా నుంచి చాలామంది వస్తున్నారని, ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఘటనతో అమెరికా అధికారులు ప్రత్యేకదృష్టి సారించారని చెప్పారు.
అమెరికాకు విద్యార్థులు ఎలా వచ్చారు? ఎందుకు వస్తున్నారనే కోణాల్లో ప్రశ్నిస్తున్నారని, అన్ని రకాలుగా ప్రశ్నించిన తర్వాతే యూనివర్సిటీలో ప్రవేశం కల్పించాలని వర్సిటీ అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఏ కోర్సు చదువుతున్నారు? ఎంతకాలం ఉంటారు? బ్యాంకులో ఆస్తుల వివరాలు, అమెరికాలో ఉండడానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలివ్వాలని జనితా రెడ్డి సూచించారు.
తడబడొద్దు
విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువుల కోసం వచ్చేటప్పుడు అన్ని రకాల ప త్రాలను తీసుకురావాలి. అంతేకాకుండా ఎయిర్‌పోర్టులో సీబీపీవో అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, ధైర్యంగా సమాధానాలు ఇవ్వాలి. ఏ కొంచం సందేహం కలిగినా వెనక్కి పంపిస్తున్నారు.
- జనితారెడ్డి, అమెరికాలో అటార్నీ
అవగాహన కల్పిస్తున్నాం
అమెరికాకు ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్థులకు అమెరికాలోని విధివిధానాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. అమెరికాకు వచ్చే వారికి పూర్తిగా అవగాహన కల్పించాలని ఇక్కడ ఉన్న విద్యార్థులకు సూచిస్తున్నాం.
- కాల్వల విశ్వేశ్వర్‌రెడ్డి,తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అధ్యక్షుడు, అమెరికా