హార్దిక్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు
సూరత్: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పటేల్పై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. రిజర్వేషన్ల ఉద్యమం కోసం పటేల్ యువకులు ఎవరూ ఆత్మహత్య చేసుకోరాదని, అవసరమైతే పోలీసులను చంపాలని హార్దిక్ ఈ నెల 3న సూరత్లో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు హర్దిక్పై విద్రోహం కింద కేసు నమోదు చేసినట్టు సూరత్ డీసీపీ మార్లండ్ చౌహాన్ చెప్పారు.
పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని హర్దిక్ పటేల్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్లో పటేల్ కులస్తుల మెగా ర్యాలీ సందర్భంగా భారీ హింస చెలరేగింది. ఆదివారం రాజ్కోట్లో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నిరసన తెలపాలని పిలుపునివ్వడంతో.. మ్యాచ్కు ముందు పోలీసులు హార్దిక్ను అదుపులోకి తీసుకున్నారు.