
రెయిన్‌బోలో పెట్టుబడులు
రెయిన్‌బో హాస్పిటల్స్ భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళలు, చిన్న పిల్లలకు చికిత్సను అందించే రెయిన్‌బో హాస్పిటల్స్ భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే నాలుగేళ్ళలో రూ. 215 కోట్ల పెట్టుబడితో కొత్తగా నాలుగు హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రెయిన్‌బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో 450 పడకలు అందుబాటులో ఉన్నాయని, ఈ విస్తరణ తర్వాత 2017 నాటికి కొత్తగా 775 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. కర్నూలు, చెన్నై, పుణే, బెంగళూరు, విశాఖల్లో ఈ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మంగళవారం ఇక్కడ రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ విస్తరణ కావల్సిన నిధులను వ్యూహాత్మక భాగస్వాములు, రుణాలు, అంతర్గత నిధుల ద్వారా సేకరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటన్‌కు చెందిన సీడీసీ, అబ్రాజ్‌లు సంయుక్తంగా పెట్టుబడి పెట్టిన రూ.100 కోట్లకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నాయి. ఈ పెట్టుబడికి సంబంధించి ఎంత వాటాను విక్రయించిందీ చెప్పడానికి కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు. ఏటా 25 శాతం వృద్ధితో రూ.100 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నట్లు రమేష్ వెల్లడించారు.
ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి
ఉపాధికి అధిక అవకాశం ఉండే వైద్యం, వ్యవసాయం, రెన్యువబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సీడీసీ రీజనల్ డెరైక్టర్ (దక్షిణాసియా) ఎన్.శ్రీనివాసన్ తెలిపారు. ఇప్పటికే ఇండియాలో ఫండ్ ఆఫ్ ఫండ్ రూపంలో బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టామని, నేరుగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రధమం అన్నారు. వచ్చే ఐదేళ్ళలో మరో బిలియన్ డాలర్లు పెట్టుబడికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా అబ్రాజ్ ప్రతినిధి రిషి మహేశ్వరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో 200 కంపెనీల్లో 7.5 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.