మీ సేవలకు దండం.. ఇక పార్టీ నుంచి వెళ్లిపోండి!
- పనిచేయని కాంగ్రెస్ నేతలకు పార్టీ చీఫ్ హుకుం
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ప్రజల్లోకి చొచ్చుకెళ్లి ప్రచారం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, నేతలను సన్నద్ధం చేస్తోంది. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని, ప్రజల సమస్యలు తెలుసుకొని వారితో మమేకం కావాలని పార్టీ శ్రేణులకు హస్తం అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది.
యూపీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా నిద్రలేవాలని, తమ విశ్రాంత ధోరణిని విడనాడి.. రాష్ట్రమంతటా విస్తారమైన ప్రచారం చేసేందుకు సన్నద్ధం కావాలని యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసిందని, పార్టీ శ్రేణులు మొద్దునిద్ర వదలకపోతే బయటకు పంపిస్తామని బబ్బర్ హెచ్చరించారు. నిష్క్రియగా వ్యవహరించే నేతలంతా తమ దారి తాము చూసుకోవచ్చునని, పనిచేయని నేతలను పార్టీ నుంచి పంపించేస్తామని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం పార్టీ నిర్వహిస్తున్న ప్రచారంలో చురుగ్గా పాల్గొనే నేతలనే క్రియాశీలంగా ఉన్న నేతలుగా భావిస్తామని ఆయన 'ఇండియా టుడే'తో మాట్లాడుతూ స్పష్టం చేశారు.