సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలన్నీ రాజకీయ వ్యూహాల్లో దిట్టలైన సామాజిక ఇంజనీర్లు(పొలిటికల్ సోషల్ ఇంజనీర్స్), వారు సిద్ధం చేసే సోషల్ ఇంజనీరింగ్ మీదే ఆధారపడి ఉంటోంది. పార్టీకి విజయవంతమైన ఎన్నికల ప్రచారాన్ని సిద్ధం చేయడం, సామాజిక సమూహాలు, వారి అవసరాలను గుర్తించడం, ఆపై పథకాలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం, సామాజిక మాధ్యమాల్లో సందేశాల ద్వారా పార్టీకి అనుకూలంగా వారిని సానుకూలంగా ప్రభావితం చేసే వ్యూహాన్ని సిద్ధం చేయడంతో సోషల్ ఇంజనీర్లే కీలక భూమిక పోషిస్తున్నారు.
దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే ప్రతి పార్టీ సోషల్ ఇంజనీరింగ్ ప్రాధాన్యాన్ని బాగా గుర్తించాయి. సామాజిక సమీకరణ కోసం వివిధ కులాలు, వర్గాలు, మత సమూహాలతో తమ పార్టీలకు సంబంధాలను బలపరిచే, సామాజిక పొత్తులను నిర్మించగల శక్తిసామర్థ్యాలున్న నేతలను దీనికి వినియోగిస్తున్నాయి. వీరికి ప్రజాకర్షక శక్తి లేకున్నా.. తెరవెనుక వ్యవహారాలను చక్కబెట్టగల నేర్పు ముఖ్యం. హోంమంత్రి అమిత్ షా బీజేపీకి గొప్ప సోషల్ ఇంజనీర్ అనేది గత సార్వత్రిక, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది.
ప్రధాన్ నేతృత్వంలో బీజేపీ...
ప్రస్తుతం అమిత్ షా కేంద్ర వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో యూపీ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ బాధ్యతలను సమర్థ్ధుడైన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ కట్టబెట్టింది. ప్రధాన సామాజికవర్గాల్లో ఏదైనా అసంతృప్తి ఉంటే దానిని వెంటనే గుర్తించి, వాటితో చర్చలు జరిపి, వారి ద్వారా అందే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పరిష్కారాలు చూపించే పనిని ప్రధాన్ బృందం సూక్ష్మస్థాయిలో చేస్తోంది. ముఖ్యంగా పూర్వాంచల్. తూర్పు యూపీలో బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమవుతోంది. రాజ్‌పుత్‌లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్న కినుకతో వారు ఎస్పీలో చేరుతున్నారు. దీంతో యూపీలో 14 శాతం ఉన్న బ్రాహ్మణులు దూరం కాకుండా కమలదళం చర్యలు చేపట్టింది.
లఖీంపూర్ ఖేరీ ఘటనలో బ్రాహ్మణ వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని ఎంత గట్టిగా డిమాండ్లు వచ్చినా, ఆ వర్గానికి ఆగ్రహం కల్గించరాదన్న ఉద్దేశంతోనే ఆయనకు బీజేపీ కాపు కాస్తోంది. మరోవైపు రాజ్‌పుత్ ఓట్లు జారిపోకుండా కీలక నేతలందరితో ఎప్పటికప్పుడు మంతనాలు చేస్తోంది. ముఖ్యంగా రైతుల్లో ఎక్కువగా బీసీలు, ఎస్సీ వర్గాల వారే ఉండటంతో వారిని మచ్చిక చేసుకునేలా ఇప్పటికే రూ.35 వేల కోట్ల రుణాలను అందించగా, 2.21 కోట్ల మంది రైతులను ఫసల్ బీమా యోజనలో చేర్చింది. వీటన్నింటినీ బీజేపీ బృందాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి.
బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షిస్తున్న ఎస్పీ
ఇక యూపీ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఎదుర్కోవాలని గట్టి పట్టుదలతో ఉన్న విపక్షాలు సైతం తమతమ సోషల్ ఇంజనీరింగ్‌కు పదునుపెట్టాయి. సమాజ్‌వాదీ పార్టీ కోసం అఖిలేశ్ యాదవ్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని రచిస్తున్నారు. మహాన్ దళ్, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ వంటి యాదవేతర కుల ఆధారిత పార్టీలతో పొత్తులు ఏర్పరచుకోవడం ద్వారా వివిధ సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే యత్నాలకు దిగారు. ముఖ్యంగా బీజేపీ అనుబంధంగా ఉంటున్న బ్రాహ్మణులకు దగ్గరయ్యేలా ఆయన చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే బ్రాహ్మణ వర్గానికి చెందిన బీఎస్పీ మాజీ ఎంపీ రాకేశ్ పాండేని పార్టీలో చేర్చుకున్నారు. 2012 ఎన్నికల్లో ఎస్పీ 224 ఓట్లు సాధించడంలో ఓబీసీలు, ముస్లిం, వైశ్యులు కీలకంగా ఉన్నారు.
19 శాతంగా ఉన్న ముస్లింలకు 2017లో అధిక సీట్లు కేటాయించినా, కేవలం మూడో వంతు మాత్రమే ఎస్పీ నుంచి గెలిచారు. ఓట్ల చీలిక ఇక్కడ ప్రధాన భూమిక పోషించింది. ఈ దృష్ట్యా ముస్లింల ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ సలీమ్ షేర్వానీని ఇప్పటికే పార్టీలో చేర్చుకోగా, కొత్తగా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఇమ్రాన్ మసూద్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అఖిలేశ్ ఇటీవల నిర్వహించిన విజయ్ రథయాత్రకు ముస్లిం ఓటర్లు ఎక్కువగా హాజరయ్యేలా పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. ఇక పశ్చిమ యూపీలో జాట్‌ల మద్దతు కూడగట్టేందుకు ఆర్‌ఎల్‌డీతో ప్రాథమిక చర్చలు పూర్తి చేసింది. ఓబీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు ఆయన బీసీ కులగణన అంశానికి మద్దతిస్తున్నారు.
రిజర్వ్‌డ్ స్థానాలతో పాటు ముస్లిం ఓట్లపై కన్నేసిన బీఎస్పీ
ఇక మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కోసం సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా రూపొందిస్తున్నారు. బ్రాహ్మణులతో సహా దళితేతర కులాల నుండి వీలైనంత ఎక్కువ మంది మద్దతు పొందే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ’బహుజన్ టు సర్వజన్’ అనే నినాదం ఆధారంగా ఆయన వ్యూహాలున్నాయి. గతంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో 86 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో బీఎస్పీ 60కి పైగా స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ స్థానాల్లో పార్టీ నేత సతీశ్‌చంద్ర శర్ము రెండుసార్లు పర్యటించి వచ్చారు. ఇదే సమయంలో ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఎస్పీ వైపునకు వెళ్లకుండా 2012–17 మధ్య అఖిలేశ్ సీఎంగా ఉన్న సమయంలో 134 చోట్ల మతకల్లోల సంఘటనలు జరిగిన అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
‘ఆడపిల్లను... పోరాడగలను’
యూపీలో కాంగ్రెస్ ప్రాబల్యం నానాటికీ తగ్గుతూ వస్తోందనేది అక్షరసత్యం. 2019లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే అమేథిలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గౌరవప్రదమైన స్థానంలో నిలపడానికి ప్రియాంకా గాంధీ శ్రమిస్తున్నారు. స్వయం సహాయక బృందాలు, ఇతర మహిళా సంస్థలతో ఎక్కువగా టచ్‌లో ఉంటూ వారి మద్దతు కూడగట్టే యత్నాలు చేస్తున్నారు.‘లడ్‌కీ హూ..లడ్ సక్తీ హూ’ నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, మహిళలకు భద్రత కావాలి, మహిళలకు 40 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎస్పీ లేదా బీజేపీ హామీ ఇవ్వగలవా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి జాట్‌లు అధికంగా ఉండే పశ్చిమ యూపీలో తన ప్రాబల్యాన్ని నిలుపుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్‌తో సంబంధాలు నెరుపుతున్నారు. ముస్లిం–జాట్ కాంబినేషన్ సైతం మంచి ఫలితాలిస్తాయని ఆశిస్తున్న జయంత్ చౌదరి ఎస్పీతో పరస్పర అంగీకారం దిశగా చర్చలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment