న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ పూర్తి సత్తాను సమకూర్చుకుంటున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ, ఏఐఎంఐఎం లాంటి చిన్న రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లతో పూర్తిస్థాయిలో పోటీపడేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను చూస్తుంటే బడా పార్టీలకు ఛోటా దళాలు షాకివ్వనున్నాయనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో బీఎస్పీ మొత్తం 70 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించగా, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 10కిపైగా ముస్లిం ప్రాబల్య స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతోంది.
మరిన్ని ర్యాలీలకు మాయావతి సిద్ధం
మీడియాకు అందిన వివరాల ప్రకారం బీఎస్పీ, ఏఐఎంఐఎంలు ఎన్నికల ప్రచారంలో బడా నేతలను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాయి. ఒకవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి ర్యాలీలు నిర్వహిస్తుండగా, మరోవైపు ఎఐఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ ర్యాలీలు మొదలుపెట్టారు. ఢిల్లీలోని చిన్న రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో బడా పార్టీలకు గట్టి సవాలు విసరడానికి సిద్ధమవుతున్నాయి. ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లో వివిధ సమస్యలను పరిష్కరించడం, అవినీతిని అరికట్టడం, సుపరిపాలన అందించడం లాంటి పలు వాగ్దానాలను ఆ పార్టీలు చేస్తున్నాయి.
‘ఆప్’కు పోటీ ఇస్తామంటున్న బీఎల్‌పీ
బడా పార్టీలతో పోటీపడుతున్న చిన్న పార్టీలలో భారతీయ లిబరల్ పార్టీ (బీఎల్‌పీ) కూడా ఉంది. దీనిని ఇటీవల అమెరికాకు చెందిన డాక్టర్ మునీష్ కుమార్ రైజాదాతో పాటు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న పలువురు కలిసి స్థాపించారు. ఈ సందర్భంగా డాక్టర్ మునీష్ కుమార్ రైజాదా మీడియాతో మాట్లాడుతూ తాను ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగమయ్యామని, కానీ ఇప్పుడు ‘ఆప్’కు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అన్నారు. దాదాపు 15 నెలల క్రితం భారతదేశానికి తిరిగి వచ్చిన రైజాదా, న్యూఢిల్లీ స్థానం నుండి ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై పోటీ చేయనున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ మాజీ ఎంపీ ప్రవేశ్ వర్మ కూడా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ సందీప్ దీక్షిత్ కు టికెట్ ఇచ్చింది.
ఢిల్లీలో బీఎల్‌పీ అధికారంలోకి వస్తే, తాము చేసే మొదటి పని అవినీతి నిరోధక కమిషన్ (ఏసీసీ) ఏర్పాటు చేయడమేనని రైజాదా అన్నారు. కాగా దళితులు, వెనుకబడిన వర్గాల్లో తన స్థానాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన బీఎస్పీ ఢిల్లీలోని మొత్తం 70 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. రాబోయే రోజుల్లో మాయావతి మరిన్ని ర్యాలీలు నిర్వహించే ప్రణాళికపై కూడా పార్టీ కసరత్తు చేస్తోంది.
బీజేపీతో ప్రత్యక్ష పోరాటంపై ఏఐఎంఐఎం దృష్టి
హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఢిల్లీలోని 10 నుంచి 12 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇప్పటివరకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ముస్తఫాబాద్ నుండి తాహిర్ హుస్సేన్, ఓఖ్లా నుండి షఫా ఉర్ రెహ్మాన్ పోటీ చేస్తారని తెలిపింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసుల్లో వీరిద్దరూ నిందితులు. ఢిల్లీ ఏఐఎంఐఎం అధ్యక్షుడు షోయబ్ జమాయ్ మీడియాతో మాట్లాడుతూ, సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఇద్దరు బలమైన అభ్యర్థులను పార్టీ ఇప్పటికే నిలబెట్టిందని తెలిపారు. ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీతో ప్రత్యక్ష పోరాటంపై పార్టీ దృష్టి సారించిందన్నారు. కాగా ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: విదేశీ మహిళ ఒడిలో గణేశుడు.. ‘బ్యూటీ ఆఫ్ సనాతన్’
Comments
Please login to add a commentAdd a comment