మూడ్రోజుల్లో 'కబాలి' కలెక్షన్ ఎంతో తెలుసా?
‘కబాలి’ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి రజనీకాంత్ రుజువు చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాను తలదన్నేరీతిలో ‘కబాలి’ తొలి మూడురోజుల్లో వసూళ్లు రాబట్టింది. ‘సుల్తాన్’ సినిమా తొలి మూడురోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేయగా.. ‘కబాలి’ కూడా తొలి మూడురోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ ను దాటింది. ఈ సినిమా తొలి మూడురోజుల వసూళ్లు ఎంత అనేది వివరాలు తెలియకపోయినా.. మొదటి మూడురోజుల్లో ‘కబాలి’ వందకోట్ల మార్క్ను క్రాస్ చేసిందని సినీ పండితులు చెప్తున్నారు.
భారీ అంచనాలతో, రజనీ మేనియాతో విడుదలైన ‘కబాలి’ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. మొదటిరోజే రూ. 48 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ‘సుల్తాన్’ రికార్డును దాటేసింది. ‘సుల్తాన్’ సినిమా తొలిరోజు రూ. 36.54 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు కలెక్షన్ల విషయంలో ‘సుల్తాన్’ రికార్డును అధిగమించినప్పటికీ ‘బాహుబలి’ (రూ.50 కోట్లు) రికార్డును ‘కబాలి’ దాటలేకపోయింది. ఇక, రెండో, మూడోరోజున కూడా ‘కబాలి’ సినిమా భారీగా రికార్డు కొల్లగొట్టిందని, నెగిటివ్ టాక్ ఈ సినిమా ప్రారంభ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదని సినీ పండితులు చెప్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఈ సినిమా వసూళ్లు భారీస్థాయిలో ఉన్నారని చెప్పారు.
సాధారణంగా దక్షిణ భారతంలోనే రజనీ ఫ్యాన్స్ కు ఎక్కువ. ఉత్తర భారతంలో పెద్దగా ఆయన చిత్రాలు ఆడవు. అయితే, ఈ అపప్రథను తాజాగా ‘కబాలి’ దూరం చేసింది. ఉత్తర భారతంలోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నదని బాలీవుడ్ ట్రేడ్ అనాలిసిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఉత్తర భారతంలో తొలి రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 11.4 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలిరోజున తమిళనాడులో రూ. 21.5 కోట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రూ. 13.5 కోట్లు వసూలు చేసింది.