తండ్రిని చూసేందుకు అనుమతి కోరిన రాజీవ్ గాంధీ హంతకురాలు నళినికి ఒక నెల రోజుల పాటు సెలవు మంజూరు చేసేందుకు విముఖత తెలుపుతూ జైళ్ల శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజీవ్ హత్య కేసులో వేలూరు జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళిని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. తన తండ్రి రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్ 95 ఏళ్ల వయసులో చివరి దశలో ఉన్నారని, చివరి రోజుల్లో ఆయనతో గడిపేందుకు ఒక నెల రోజుల పాటు తనకు సెలవు ఇవ్వాలని కోరారు. ఈ కేసు న్యాయమూర్తులు ఎస్.రాజేశ్వరన్, పిఎన్ ప్రకాష్ సమక్షంలో మంగళవారం విచారణకు వచ్చింది.
వేలూరు జైలు సూపరింటెండెంట్ కరుప్పన్నన్ సంజాయిషీ పిటిషన్ దాఖలు చేశారు. తిరునెల్వేలి జిల్లా విక్రమ సింగ పురం జిల్లా సమీపాన గల అంబలవానపురంలో పిటిషనర్ నళిని తండ్రి శంకరనారాయణన్ నివసిస్తున్నారని ఆయన ఆరోగ్యకరంగా ఉన్నారని తెలిపారు. విక్రమసింగపురం కొండ ప్రాంతం కావడంతోను, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నందున నళిని అక్కడ గడపడం సరికాదని అన్నారు.
అంతేకాకుండా రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆమెను కలిసే అవకాశం ఉందని విక్రమసింగపురం పోలీసు ఇన్‌స్పెక్టర్ ఆక్షేపణ వ్యక్తం చేసినట్లు తెలిపారు. దీని గురించి జైళ్ల శాఖ అధికారి కూడా నివేదిక దాఖలు చేసినట్లు తెలిపారు. నళిని పిటిషన్‌ను నిరాకరించాలని కోరారు. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు.