రాజీవ్ గాంధీ హత్య: ఇంకొన్ని విషయాలు..
చెన్నై: ‘నా కూతుర్ని చూసి పదేళ్లైంది. తను లండన్‌లో డాక్టర్ అయిందని బంధువులు చెప్పారు. ఈ మధ్యే తనకో ఉత్తరం రాశా. నా కూతురు, జైల్లోనే ఉన్న నాభర్తతో కలిసి ఒకే ఒక్కరోజు గడపాలి. కని, అనాథగా వదిలేసినందుకు క్షమాపణ అడగాలి. తనను గుండెలనిండా కౌగిలించుకోవాలి’
ఇది..ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా జైలు శిక్ష అనుభవిస్తోన్న మహిళ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషి నళిని శ్రీహరన్ చివరికోరిక. ఉరిశిక్ష పడిన దోషిగా గడిచిన 25 ఏళ్లుగా చెన్నైలోని వేలూరు సెంట్రల్ జైలులో ఉంటోన్న నళినిపై ఇప్పటివరకు ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ మొదటిసారి ఆమె తన ఆత్మకథను చెప్పుకుంటున్నారు. తమిళంలో 500 పేజీల్లో పొందుపర్చిన నళిని ఆత్మకథ నవంబర్ 24న విడుదల కానున్న సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి..
తన తల్లి పేరు పద్మావతి అని, చెన్నైలో నర్స్ గా పనిచేసేదని, మహాత్మా గాంధీ ఓ సారి చెన్నై వచ్చినప్పుడు ఆమెకు పేరు పెట్టారని నళిని చెప్పుకొచ్చింది. 1991లో.. శ్రీహరన్ అనే వ్యక్తి నళిని ఇంట్లో ఇంట్లోకి అద్దెకు దిగడం, క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం, తల్లిని ఒప్పించి శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ ని నళిని పెళ్లి చేసుకోవడం, కొంతకాలానికి ఇంట్లో చుట్టాల తాకిడి పెరిగగడం, శ్రీహరన్ కోసం శ్రీలంక నుంచి చాలా మంది వస్తూపోతుండటం తదితర విషయాలను నళిని తన ఆత్మకథలో పూసగుచ్చినట్లు వివరించారు. ఒక భయంకరమైన రోజు భర్తతో కలిసి ఇల్లు విడిచి పారిపోయానని, కొద్ది రోజులకే సీబీఐ వాళ్లు తమతోపాటు 14 మందిని అరెస్ట్ చేశారని, దాదాపు 50 రోజులపాటు ఇంటరాగేషన్ లో థార్డ్ డిగ్రీలో ఎన్నిరకాలుగా టార్చర్ పెడతారో అన్నీ అనుభవించానని నళిని పేర్కొన్నారు.
ఇటీవల కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంలో నళిని(ఇన్‌సెట్ నళిని-శ్రీహరన్ ల కూతురు అరిత్రా)
‘ఒక సారి జైల్లో నాతో మాట్లాడటానికి ఒకామెవచ్చింది. తనను తాను ప్రియాంకా గాంధీ అని పరిచయం చేసుకుంది. చాలా సేపు నాతో మాట్లాడింది. ‘మా నాన్న చాలా మంచివారు. ఆయనను ఎందుకు చంపారు?’అని పదేపదే ప్రశ్నించింది. నావరకు అది సమాధానం తెలియని ప్రశ్న! అసలు రాజీవ్ గాంధీ గురించి నాకేమీ తెలియదు. ప్రియాంకా గాంధీ నన్ను ఎందుకు కలిశారో అప్పుడే కాదు, ఇప్పటికీ నాకు అర్థంకాదు. నా భర్త పేరు శ్రీహరన్ అని కాకుండా మురుగన్ గా మారిపోవడమూ నాకు అంతుపట్టని విషయం. అరెస్ట్ అయ్యే నాటికి నేను రెండు నెలల గర్భవతిని. థార్డ్ డిగ్రీ టార్చర్ ను భరించానంటే కేవలం నా కడుపులో పెరుగుతున్న నలుసు కోసమే. కోర్టు విచారణకు తీసుకెళ్లినప్పుడా పోలీసులు మాకు వైద్యపరీక్షలు చేయిచేవాళ్లు. ఉరిశిక్ష పడబోతున్న నాకు అబార్షన్ చేయాలని పోలీసులు డాక్టర్లమీద ఒత్తిడి చేసేవారు. అందుకు డాక్టర్లు ఒప్పుకోలేదు. ఆ డాక్టర్లు ఎక్కడున్నారోగానీ వాళ్లకు నా నమస్కారాలు. జైలులోనే బిడ్డను కన్నా. పక్కనే మగవాళ్ల జైలులో నా భర్త శ్రీహరన్ ఉంటాడు. అప్పట్లో కలుసుకునే వీలండకపోయేది.
పాపకు అరిత్రా అని పేరుపెట్టుకున్నాం. తనకు రెండేళ్లు నిండాక మా ఆయన తరఫు బందువులు అరిత్రను తీసుకెళ్లారు. 2005లో చివరిసారిగా నా కూతుర్ని చూశా. ఇప్పుడు తను లండన్ లో డాక్టర్ గా పనిచేస్తోందని, నన్ను, నా భర్తను విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని బంధువుల ద్వారా తెలిసింది. 2000లో నాకు క్షమాభిక్ష పెట్టినప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి భర్తను కలిసి మాట్లాడే అవకాశం కల్పించారు. ఆ కొద్దిసేపే కాస్త ఊరట దొరుకుతుంది.
జైలు అధికారులు.. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఏఐడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తారు. జయలలిత సీఎంగా ఉన్నన్నాళ్లూ మాపై వేధింపులు ఉండవు. ఈ మధ్యే కొందరు బెదిరింపులు పంపుతున్నారు.. ‘నీ బిడ్డను లండన్ నుంచి శ్రీలంక వెళ్లిపొమ్మను.. లేకుంటే చంపేస్తాం’ అంటున్నారు. వాళ్ల చంపుళ్లు ఎలా ఉన్నా నాకు మాత్రం ఒక్కసారైనా బిడ్డను కలుసుకోవాలని ఉంది. నేను, నా భర్త, కూతురు.. ముగ్గురం కలిసి ఒక్కరోజు గడపాలి’ అని నళిని తన ఆత్మకథలో చివరి కోరికను వెల్లడిస్తారు. నవంబర్ 24న విడుదల కానున్న ఈ పుస్తకానికి మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి డి. హరిపరానథమన్, ఎండీఎంకే పార్టీ నేత వైకో, వీసీకే నేత తిరుమావలవన్, రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు సీమాన్ తదితరులు ముందు మాటలు రాశారు.
రాజీవ్ గాంధీ హత్య అనంతరం సీబీఐ అదుపులో మురుగన్ అలియాస్ శ్రీహరన్, నళిని(ఫైల్ ఫొటో)
రాజీవ్ హత్యకేసుకు సంబంధించి కీలక పరిణామాలు..