
ఆయనవన్నీ అబద్దాలు...
*న్యూస్‌టుడే ఆఫీసు ఎక్కడుందో తెలియదన్న రామోజీరావు
*ఈనాడు ఆవరణలోనే ఉందన్న సంగతి కూడా తెలియదని వెల్లడి
*న్యూస్‌టుడే డెరైక్టర్ గోపాలరావు ఎవరో కూడా తెలియదన్న ఈనాడు చీఫ్ ఎడిటర్ రామోజీ
* అదిచ్చే వార్తలను ఈనాడు ప్రచురిస్తుందని వివరణ
* గాలి జనార్దనరెడ్డి వేసిన పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు
* చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తు లేదంటూ సమాధానం.. తప్పించుకోవటానికే రామోజీ అబద్ధాలు చెబుతున్నారన్న ప్రతివాదులు
విచారణ 22కు వాయిదా
సిరుగుప్ప (బళ్లారి), న్యూస్‌లైన్: ‘ఈనాడు’ పత్రిక వార్తా సేకరణ విభాగమైన ‘న్యూస్‌టుడే ’ ఎక్కడుందో తనకు తెలియదన్నారు ఆ పత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు. దాని రిజిస్టర్డ్ ఆఫీసు హైదరాబాద్‌లోని తన ఈనాడు ఆవరణలోనే ఉందన్న సంగతి కూడా తెలియదనే చెప్పారాయన. కోర్టు సాక్షిగా ఆయన ఇలా ప్రతిదానికీ తనకు తెలియదని, గుర్తులేదని సమాధానాలు ఇవ్వటంతో.. ‘‘మీరు అవసరానికి అబద్ధాలాడుతున్నారు! ఔనా?’’ అని ప్రశ్నించారు ప్రతివాది తరఫు న్యాయవాది. ఇదంతా శనివారం కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగుప్ప జూనియర్ మున్సిఫ్ కోర్టులో జరిగింది.
తనకు వ్యతిరేకంగా ‘ఈనాడు’ పత్రిక ప్రచురించిన కథనాలపై గనుల యజమాని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి 2005లో పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి ఆయన బెయిలు కోసం గతంలో స్వయంగా కోర్టుకు హాజరయ్యారు కూడా. రెండోసారి నిందితుడిగా తన వివరణ ఇచ్చారు. మూడోసారి శనివారం క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు పాటిల్ సిద్ధారెడ్డి, రవిచంద్ర ఆయన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పరువునష్టం వార్తను ప్రస్తావించిన న్యాయవాదులు రామోజీని వేసిన ప్రశ్నలు, ఆయనిచ్చిన సమాధానాలు ఇలాఉన్నాయి..
లాయర్: ఈనాడు 23 ఎడిషన్లకీ మీరేనా చీఫ్ ఎడిటర్?
రామోజీ: అవును నేనే. కానీ ఏ పేపర్లో ఏది పబ్లిష్ చేయాలన్నది వాళ్ల ఇష్టం. నేను చెప్పను.
లా: ఈ పరువు నష్టం వార్త రాసిందెవరు?
రా: నాకు తెలీదు. అయినా ఇది పరువు నష్టం వార్త కాదు.
లా: ఇది పరువు నష్టం వార్త కాదన్నది మీ అభిప్రాయమా? నిర్ణయమా?
రా: నా అభిప్రాయం మాత్రమే.
లా: ఈ వార్తలు మీకు తెలియకుండానే పబ్లిష్ చేశారా?
రా: మాకు న్యూస్‌టుడే అనే ఏజెన్సీ వార్తలు సప్లయ్ చేస్తుంది. వాటినే ప్రచురిస్తాం. అది ఇండిపెండెంట్ ఏజెన్సీ. (వాస్తవానికి ఇది ఈనాడుకు చెందిన వార్తా సంస్థ)
లా: అంటే న్యూస్‌టుడేతో మీకు ఎలాంటి సంబంధం లేదంటారా?
రా: అవును. దాంతో మాకెలాంటి సంబంధం లేదు.
లా: న్యూస్‌టుడే డెరైక్టర్ గోపాలరావు మీకు తెలుసా?
రా: తెలీదు.
లా: ఆయన మీ ఉషోదయా హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ కదా! ఈనాడు బిల్డింగ్‌లోనే ఉంటారు కదా?
రా: ఏమో! నాకు తెలీదు.
లా: ఏడాది కిందట న్యూస్‌టుడే ఉద్యోగులందరినీ ఉషోదయ సంస్థలో విలీనం చేశారు. ఆ సంగతైనా తెలుసా?
రా: ఏమో నాకు తెలీదు. ఒకసారి చూడాలి.
లా: న్యూస్‌టుడే అడ్రస్ ఎక్కడ?
రా: ఏమో! నాకు తెలీదు.
లా: అది మీ ఈనాడు కాంపౌండ్‌లోనే ఉంది కదా! దాని రిజిస్టర్డ్ చిరునామా అదే కదా!! (ఆర్‌ఓసీ పేపర్లు చూపిస్తూ)
రా: ఏమో.. నాకు తెలీదు. చూడాలి.
లా: న్యూస్‌టుడే మరో డెరైక్టర్ బాపినీడు చౌదరి తెలుసా?
రా: తెలుసు. ఎందుకంటే ఆయన ఈటీవీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
లా: న్యూస్‌టుడే కాకుండా వేరే తెలుగు ఏజెన్సీల నుంచి మీరు వార్తలు తీసుకుంటారా?
రా: తీసుకోం.
లా: మీపై హైకోర్టులో 200కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి కదా?
రా: ఏమో నాకు తెలీదు.
లా: మీరు ఇదివరకు ఒక పరువు నష్టం కేసులో రూ.10 వేలు జరిమానా కూడా కట్టారు కదా?
రా: ఏమో! నాకు గుర్తు లేదు.
మరో ప్రశ్నకు సమాధానమిచ్చిన రామోజీ... తాను 15 ఏళ్లుగా ఫిలిం సిటీలోనే ఉంటున్నానని, ఈనాడులో ఏం జరుగుతోందో తనకు తెలియదని చెప్పారు. తాను అన్ని వార్తలూ చూడనని, ఎడిటోరియల్, పాలసీ వ్యవహారాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటానని అన్నారు.ష
ఇలా రామోజీరావు అన్ని ప్రశ్నలకూ తెలీదనో, గుర్తులేదనో సమాధానాలు ఇస్తుండటంతో.. అవి దాటవేత జవాబులంటూ న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. ‘‘మీరు అవసరానికి అబద్ధాలాడుతున్నారు. ఔనా?’’ అంటూ ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని రామోజీ జవాబిచ్చారు. దీంతో ఈ కేసును సిరుగుప్ప జూనియర్ మున్సిఫ్ (జేఎంఎఫ్‌సీ) న్యాయమూర్తి లక్ష్మీకాంత్ జానకీరావు మిస్కీ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు.