కట్టప్ప ఎందుకు చంపాడో అప్పుడే చెప్పేశాడు!
ఒక్క ప్రశ్న సినీ ప్రేమికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అభిమానులకు నిద్రలేని రాత్రులను ఇచ్చింది. ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆ ప్రశ్నకు జవాబు లేదు. ఆ మిస్టరీ అంతుబట్టలేదు. అదే.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఇంకా కొన్నినెలలు ఆగాల్సిందే.
అభిమానులను వెంటాడుతున్న 'బాహుబలి-1'లోని ఈ ట్వీస్టు గురించి తాజాగా 'భల్లాల దేవ' అలియాస్ రాణా దగ్గుబాటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. బాలీవుడ్ టైఫ్.కామ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాణాను టాప్ సీక్రెట్ అయిన 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారు' అని అడిగారు. దీనికి రాణా ఆసక్తిరమైన సమాధానం చెప్పాడు. అక్షరాల ఐదు సంవత్సరాల కిందటే ఈ విషయం 'బాహుబలి' చిత్రంతో అనుబంధమున్న ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పాడు.
'మా సినిమా (బాహుబలి) సెట్‌లోని ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. ఈ సినిమాలో పనిచేస్తున్న చిన్న నటుడు మొదలు పెద్ద నటుడి వరకు ప్రతి ఒక్కరికీ సినిమా కథ స్పష్టంగా తెలిసేవిధంగా రాజమౌళి ముందే చెప్పేశారు. ఐదేళ్ల కిందటే రెండు పార్టుల గురించి మాకు చెప్పాడు. ఇదేమీ అప్పటికప్పుడు అనుకున్న సంగతి కాదు. మంచి ప్రణాళికతో, ఆలోచనతో తెరకెక్కిస్తున్నాం' అని రాణా వివరించారు.
అయితే, మిస్టరీ గుట్టు రాణా నేరుగా విప్పకపోయినా కొన్ని మంచి విషయాలు చెప్పాడు. 'దీనిని వివరించడం వీలుకాదు. ఇది గ్రాండ్ విజువల్ ట్రీట్. 2017, ఏప్రిల్ 28న ఈ సినిమా వస్తున్నది. మీరు చూసి తెలుసుకోండి' అంటూ రాణా తెలిపాడు. సో, రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి-2' వచ్చేవరకు వేచి చూడాలన్నమాట.