మెటల్ జోరుతో మెరిసిన మార్కెట్లు
ముంబై : పవర్ స్టాక్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ స్టాక్స్ లో చూపిన కొనుగోలు మద్దతుతో శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసేనాటికి లాభాలను నమోదుచేశాయి. సెన్సెక్స్ 92.72 పాయింట్ల లాభంతో, 27,803వద్ద, నిఫ్టీ 31.10 పాయింట్ల లాభంతో 8,541 దగ్గర ముగిసింది. ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ నేటి ట్రేడింగ్ లో కొనుగోలు జోరు సాగించాయి. టాటా మోటార్స్, గెయిల్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఎల్&టీలు లాభాలను పండించగా.. బజాజ్ ఆటో, హెచ్యూఎల్, సన్ ఫార్మా, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ నష్టాలను గడించాయి. సెన్సెక్స్ 27,832.45 గరిష్ట స్థాయి నుంచి 27,646.21 కనిష్ట స్థాయిలో నడిచింది. చివరికి 27,803వద్ద ముగిసింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల అసెంట్ క్వాలిటీపై ఆందోళన చెందిన పెట్టుబడిదారులు అమ్మకాలపై ఎక్కువగా ఆసక్తి చూపారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ, కొటక్ మహింద్రా బ్యాంకులు ప్రకటించిన మొండి బకాయిల తీవ్రతతో ఈ షేర్లపై భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగిందన్నారు. మరోవైపు మెరుగైన ఆర్థిక ఫలితాల ప్రకటనతో 2.2 శాతం ఎక్కువగా ట్రేడ్ అయిన ఐటీసీ, చివరకు 0.3శాతం కిందకు దిగజారి రూ.249.85గా ముగిసింది.
కాగా కరెన్సీ మార్కెట్లో రూపాయి కొద్దిగా కోలుకుని, 0.05 లాభంతో 67.13గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి రూ.132లు నష్టపోయి రూ.30,873గా ముగిసింది.