Banking stocks
-
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లలో అమ్మకాలు
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు చెందిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు వెల్లుత్తాయి. ఫలితంగా సూచీలు సోమవారం ఉదయం ఆర్జించిన భారీ లాభాల్ని మిడ్‌సెషన్ కల్లా కోల్పోయి స్వల్పనష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకింగ్ రంగ షేర్లతో పాటు ఫైనాన్స్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మిడ్‌సెషన్ కల్లా 1.50శాతం నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయానికి ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఫైనాన్స్ సర్వీస్, నిఫ్టీ ప్రభుత్వరంగ, ప్రైవేట్ రంగ ఇండెక్స్‌లు 1.50శాతానికి పైగా క్షీణించాయి. బ్యాంకింగ్ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు 1శాతం నష్టపోయాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు 1శాతం నుంచి 1.75శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇక ఫైనాన్స్ రంగంలో హెవీ వెయిటేజీ షేర్లైన హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2శాతం నష్టాన్ని చవిచూశాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు సెన్సెక్స్ 36567 వద్ద, నిఫ్టీ 10769 స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయానికి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లతో పాటు రియల్టీ రంగ షేర్లు సైతం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోంటున్నాయి. -
లాక్డౌన్ టైంలోనే బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయ్..!
లాక్డౌన్ కాలంలో నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇండెక్స్‌లు నష్టాలను చవిచూడలేదని ఏస్‌ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి. విచిత్రంగా ఈ సమయంలోనే ఈ ఇండెక్స్‌లు చెప్పుకొదగిన ర్యాలీని చేశాయి. కేంద్రం మార్చి 24న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. నాటి నుంచి నిన్నటి(మే 27) వరకు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 9శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ 19శాతం పెరిగింది. ఐసీసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎడెల్వీజ్ ఫైనాన్స్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాంటి ఫైనాన్స్ స్టాక్ లాక్డౌన్ సమయంలో రాణించిన షేర్లలో ఉన్నాయి. ఇక నష్టపోయిన షేర్లను పరిశీలిస్తే... బజాజ్ ఫైనాన్స్ అత్యధిక నష్టాన్ని చవిచూసింది. వాటితో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ సర్వీసెస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్ కంపెనీ షేర్లున్నాయి. మున్ముందు మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది: ఉమేష్ మెహతా ఫైనాన్షియల్ స్టాక్స్ ర్యాలీ మున్ముందు మరింత సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా అభిప్రాయపడ్డారు. సుధీర్ఘ లాక్డౌన్, మారిటోరియటం పొడగింపు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల ఉనికి ప్రశ్నార్థకం చేస్తుందని ఆయనన్నారు. మారిటోరియం పొడిగింపు ఎన్పీఏ సైకిల్‌ను మరింత ఇబ్బంది పెట్టే అంశం. దాని ప్రభావం ఈ త్రైమాసికంలో కాకపోయినా వచ్చే క్వార్టర్ నుంచైనా స్పష్టంగా చూడవచ్చు. పొడగింపు అంశం బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను ప్రభావితం చేయడమే కాకుండా వాటి లాభదాయకతను దెబ్బతీస్తుంది. ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ప్రతికూల ప్రభావానికి దారితీసింది. ఇది బ్యాంకులకు అనుకూలంగా లేదు. ఇప్పుడిప్పుడే ప్రతికూల వృద్ధి రేటు ప్రభావాన్ని చవిచూస్తున్నాం. అని ఉమేష్ మెహతా తెలిపారు. -
మెటల్ జోరుతో మెరిసిన మార్కెట్లు
ముంబై : పవర్ స్టాక్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ స్టాక్స్ లో చూపిన కొనుగోలు మద్దతుతో శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసేనాటికి లాభాలను నమోదుచేశాయి. సెన్సెక్స్ 92.72 పాయింట్ల లాభంతో, 27,803వద్ద, నిఫ్టీ 31.10 పాయింట్ల లాభంతో 8,541 దగ్గర ముగిసింది. ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ నేటి ట్రేడింగ్ లో కొనుగోలు జోరు సాగించాయి. టాటా మోటార్స్, గెయిల్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఎల్&టీలు లాభాలను పండించగా.. బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ నష్టాలను గడించాయి. సెన్సెక్స్ 27,832.45 గరిష్ట స్థాయి నుంచి 27,646.21 కనిష్ట స్థాయిలో నడిచింది. చివరికి 27,803వద్ద ముగిసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల అసెంట్ క్వాలిటీపై ఆందోళన చెందిన పెట్టుబడిదారులు అమ్మకాలపై ఎక్కువగా ఆసక్తి చూపారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ, కొటక్ మహింద్రా బ్యాంకులు ప్రకటించిన మొండి బకాయిల తీవ్రతతో ఈ షేర్లపై భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగిందన్నారు. మరోవైపు మెరుగైన ఆర్థిక ఫలితాల ప్రకటనతో 2.2 శాతం ఎక్కువగా ట్రేడ్ అయిన ఐటీసీ, చివరకు 0.3శాతం కిందకు దిగజారి రూ.249.85గా ముగిసింది. కాగా కరెన్సీ మార్కెట్లో రూపాయి కొద్దిగా కోలుకుని, 0.05 లాభంతో 67.13గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి రూ.132లు నష్టపోయి రూ.30,873గా ముగిసింది. -
నష్టాలకు బ్రేక్..లాభాల్లో మార్కెట్లు
ముంబై : నిన్నటి ట్రేడింగ్ లో మూడు వారాల కనిష్టానికి పతనమైన స్టాక్ మార్కెట్లు నేటి(మంగళవారం) ట్రేడింగ్ లో కోలుకున్నాయి. సెన్సెక్స్138 పాయింట్ల లాభంలో 25,575.89 వద్ద నమోదవుతుండగా.. నిఫ్టీ 7,800 ట్రేడ్ మార్కును దాటింది. 46.10 పాయింట్ల లాభంతో 7,852 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో నిన్నటి వరకూ నష్టాల్లో నడిచిన బ్యాంకింగ్ షేర్లు రికవరీ అయ్యాయి. మార్కెట్ల ప్రారంభంలో హెచ్ డీఎఫ్ సీ, ఎస్ బ్యాంకు, ఐసీఐసీఐ, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ లాభాల బాట పటడంతో సెన్సెక్స్ 200 పాయింట్లను దాటి ట్రేడ్ అయింది. ఆటో, బ్యాంకు, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్ఎమ్ సీజీ, రియాల్టి స్టాక్స్, నిఫ్టీని 7,800 ట్రేడ్ మార్కును దాటడానికి దోహదం చేశాయి. మరోవైపు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 11 పైసలు బలపడి రూ.66.33గా ఉంది. ఆసియన్ కరెన్సీ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో రూపాయి బలపడిందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. బంగారం, పసిడి కొంతమేర కిందకు జారాయి. పసిడి రూ. 30,267 వద్ద, వెండి రూ. 41,170 వద్ద నమోదవుతున్నాయి. -
సెన్సెక్స్@25,000
తొలిసారి 25,000 పాయింట్లపైన ముగింపు * 214 పాయింట్లు జంప్... * నిఫ్టీ కూడా కొత్త క్లోజింగ్ రికార్డు... * 72 పాయింట్లు ఎగసి 7,474 వద్ద క్లోజ్... * మెటల్స్, విద్యుత్, చమురు-గ్యాస్ షేర్ల దూకుడు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్న సెన్సెక్స్... గురువారం సిల్వర్‌జూబ్లీ చేసుకుంది. చరిత్రలో తొలిసారిగా 25 వేల పాయింట్లకుపైన ముగియడం ద్వారా ఆల్‌టైమ్ రికార్డును నమోదుచేసింది. దేశీ ఆర్థిక వ్యవస్థ అంచనాలకంటే ముందే చాలావేగంగా పుంజుకోవచ్చన్న సంకేతాలు బలపడుతుండటం... యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించొచ్చన్న అంచనాలు దేశీ మార్కెట్లలో కొత్త జోష్ నింపాయి. ప్రధానంగా విద్యుత్, మెటల్స్. చమురు-గ్యాస్ రంగాల షేర్లు పరుగులు తీయడంతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ కూడా కొత్త శిఖరాలను చేరుకున్నాయి. ముంబై: సెన్సెక్స్ గురువారం ట్రేడింగ్ ఆరంభంలో సానుకూలంగానే స్వల్పలాభాలతో ప్రారంభమైంది. క్రితం ముగింపు 24,806 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 24,828 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఆతర్వాత ఒకానొక దశలో 24,645 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అయితే, ఇక అక్కడినుంచీ క్రమంగా పుంజుకుంటూ పైపైకి ఎగబాకింది. 25,044 పాయింట్ల గరిష్టాన్ని తాకి... చివరకు దాదాపు అదేస్థాయిలో 25,020 వద్ద స్థిరపడింది. అంటే 214 పాయింట్లు బలపడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలరోజున మోడీ నేతృత్వంలోని ఎన్డీఏకు బంపర్ మెజారిటీ లభించడంతో సెన్సెక్స్ తొలిసారి 25 వేల మార్కును దాటి ఇంట్రాడేలో 25,376 పాయింట్లను తాకడం తెలిసిందే. అయితే, ఆరోజు చివర్లో లాభాల స్వీకరణతో 25 పాయింట్లపైన సెన్సెక్స్ ముగియకుండా మళ్లీ కిందికి వచ్చేసింది. ఇప్పుడు రెండోసారి 25 పాయింట్లను అధిగమించి... ఆస్థాయిపైనే ముగియడంతో కొత్త ఆల్‌టైమ్ ముగింపు రికార్డుతోపాటు సిల్వర్‌జూబ్లీని పూర్తిచేసుకున్నట్లయింది. ఇదిలాఉండగా... నిఫ్టీ కూడా ఎన్నికల ఫలితాల రోజున 7,500 పాయింట్లను తొలిసారి అధిగమించి 7,563ను తాకి మళ్లీ దిగువకు వచ్చేయడం విదితమే. అయితే, ఇప్పుడు నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 7,474 పాయింట్ల కొత్త ముగింపు రికార్డును నమోదు చేసింది. ఈ నెల 3న సాధించిన క్లోజింగ్ రికార్డులను సెన్సెక్స్, నిఫ్టీ రెండు గురువారం నాడు బద్దలుకొట్టాయి. రిటైల్ ఇన్వెస్టర్ల జోరుతో... విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహానికి తోడు రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోళ్లకు ఉత్సాహంగా ముందుకొస్తుండటంతో మార్కెట్ సెంటిమెంట్ బలోపేతంమవుతోందని బ్రోకరేజి, ట్రేడింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈసీబీ సహాయ ప్యాకేజీ గనుక ప్రకటించినపక్షంలో ఆ నిధులు కూడా మన మార్కెట్లోకి కొంత రావచ్చని దీనివల్ల బుల్స్ మరింత దూకుడు పెంచే అవకాశాలున్నాయనేది పరిశీలకుల అభిప్రాయం. ఇది కూడా మార్కెట్‌కు బూస్ట్‌గా పనిచేసింది. గురువారం పొద్దుపోయాక ఈసీబీ పరపతి విధాన సమీక్ష నిర్ణయం వెలువడనుంది. మరోపక్క, కొత్త వ్యాపార ఆర్డర్లతో దేశ సేవల రంగం ఏడాది తర్వాత మళ్లీ మే నెలలో పుంజుకోవడం కూడా ఇన్వెస్టర్లకు టానిక్‌లా పనిచేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా.. ప్రీ-బడ్జెట్ సంప్రతింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం వ్యవసాయ రంగ ప్రతినిధులతో భేటీ అయ్యారు. శుక్రవారం కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశం కానున్నారు. ఇతర ముఖ్యాంశాలివీ... బీఎస్ఈలోని మొత్తం 12 రంగాల సూచీల్లో 11 రంగాలు లాభాలతో ముగియడం... కొనుగోళ్ల జోరుకు అద్దంపడుతోంది. మెటల్స్ సూచీ అత్యధికంగా 3.33 శాతం దూసుకెళ్లింది. ఆతర్వాత చమురు-గ్యాస్, విద్యుత్ 1.96 శాతం చొప్పున... ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.49%, ఐటీ సూచీ 1.29% చొప్పున బలపడ్డాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు కొత్త 52 వారాల గరిష్టాన్ని తాయాకి. 1.42%, 1.01% చొప్పున పుంజుకున్నాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్ జాబితాలో 23 షేర్లు లాభాలతో ముగిశాయి. ఇక భారీగా పుంజుకున్న షేర్లలో సెసాస్టెరిలైట్ 6.5%, హిందాల్కో 5.54%, హెచ్‌యూఎల్ 4.27%, టాటా పవర్ 3.64%, టాటా స్టీల్ 3.45%, టాటా మోటార్స్ 3.11% ఉన్నాయి. గెయిల్ 2.77%, ఓఎన్జీసీ 2.01%, విప్రో 1.88%, ఇన్ఫోసిస్ 1.48 శాతం చొప్పున బలపడ్డాయి. సెన్సెక్స్‌లో ట్రేడయిన షేర్లలో 2,153 స్టాక్స్ లాభాల్లో ముగియగా... 869 మాత్రమే నష్టాపోయాయి. ఇక బీఎస్ఈ నగదు విభాగంలో టర్నోవర్ క్రితం రోజుతో పోలిస్తే మెరుగుపడి రూ.4,906.75 కోట్లకు చేరింది. ఎన్ఎస్ఈ క్యాష్ సెగ్మెంట్లో రూ. 25,335 కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.1,71,850 కోట్ల టర్నోవర్ నమోదైంది. ప్రాథమిక గణాంకాల ప్రకారం బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో రూ.193 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరపగా... గురువారం మరో రూ.1,369 కోట్ల నికర పెట్టుబడులు కుమ్మరించినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌కు ముందే 30,000కు..! మార్కెట్ జోరు చూస్తుంటే... బడ్జెట్‌కు ముందే సెన్సెక్స్ 30,000 పాయింట్ల స్థాయికి దూసుకెళ్లే అవకాశం ఉందని మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఎండీ మోతీలాల్ ఓశ్వాల్ అభిప్రాయప్డారు. మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం చేపడుతన్న ప్రతి ఒక్క చర్యనూ ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని.. ఈజీఓఎంలను రద్దు చేయడం, 100 రోజుల ఎజెండాను నిర్ధేశించడం, నల్లధనంపై పోరుకు సిట్ ఏర్పాటు వంటి కొన్ని కీలక చర్యలతో ఇన్వెస్టర్లలో విశ్వాసం ఇనుమడించిందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి పేర్కొన్నారు. వ్యాపారానుకూల ఆర్థిక విధానాలను మోడీ సర్కారు అవలంభిస్తున్న అంచనాల నేపథ్యంలో ఆటంకాలు తొలగి మళ్లీ ఆర్థిక వృద్ధిరేటు గాడిలోపడుతుందన్న నమ్మకం పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. -
బ్యాంకింగ్‌లో అమ్మకాలు... ఫార్మాలో కొనుగోళ్లు
బుధవారంనాటి రిజర్వుబ్యాంక్ పరపతి సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు తప్పకపోవొచ్చన్న అంచనాలతో బ్యాంకింగ్ షేర్లు క్షీణించడంతో స్టాక్ సూచీలు వరుసగా ఆరో రోజు తగ్గాయి. ఆసియా మార్కెట్ల నుంచి అందిన పాజిటివ్ సంకేతాలతో మంగళవారం సెన్సెక్స్ గ్యాప్‌అప్‌తో 20,784 పాయింట్ల గరిష్టస్థాయి వద్ద ప్రారంభమైనా, తదుపరి అమ్మకాల ఒత్తిడికి తలొగ్గి 20,612 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 47 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 15 పాయింట్ల క్షీణతతో 6,139 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అధిక వడ్డీ రేట్ల ప్రభావానికి లోనయ్యే బ్యాంకింగ్ షేర్లు తగ్గడంతో బ్యాంక్ నిఫ్టీ 1 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆప్షన్లలో యాక్టివిటీ... ఆర్బీఐ, ఫెడ్ రానున్న నిర్ణయాల నేపథ్యంలో నిఫ్టీ ఆప్షన్ కాం ట్రాక్టుల్లో యాక్టివిటీ జోరుగా సాగింది. ప్రధాన సంఘటనలపై ఇన్వెస్టర్లకు స్పష్టత లేనందున, ఫ్యూచర్ కాంట్రాక్టుల బదులు ఆప్షన్లలో పొజిషన్లకే మొగ్గుచూపినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 5.96 లక్షల షేర్లు (2.66 శాతం) కట్‌కావడంతో మొత్తం ఓఐ 2.18 కోట్ల షేర్లకు తగ్గింది. మరోవైపు నిఫ్టీ 6,200, 6,300 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్, 6,100, 6,000 స్ట్రయిక్స్ వద్ద పుట్ రైటింగ్ జరి గింది. దాంతో పైన ప్రస్తావించిన కాల్ ఆప్షన్లలో 5.59 లక్షలు, 5,50 లక్షల షేర్ల చొప్పున యాడ్ కాగా, పుట్ ఆప్షన్లలో 4,44 లక్షలు, 3.72 లక్షల షేర్ల చొప్పున యాడ్ అయ్యాయి. కాల్ ఆప్షన్లలో అధికంగా 6,300 స్ట్రయిక్ వద్ద అధికంగా 73 లక్షల షేర్లు, పుట్ ఆప్షన్లలో ఎక్కువగా 6,000 స్ట్రయిక్ వద్ద 59.87 లక్షల షేర్ల ఓఐ వుంది. ఆయా సంఘటనల తర్వాత వెలువడే అనుకూల, ప్రతికూల వార్తలకు అనుగుణంగా నిఫ్టీ పెరిగితే 6,300 స్థాయి అవరోధాన్ని కల్పించవచ్చని, తగ్గితే 6,000 స్థాయి మద్దతునివ్వవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. స్పాట్ ధరతో సంబంధం లేకుండా కొంత ప్రీమియం ధరకు ఆప్షన్ కాంట్రాక్టును విక్రయిం చడాన్ని రైటింగ్ అంటారు. అలా రైట్ చేసిన స్ట్రయిక్ దిశగా సూచీ పెరగడం గానీ, తగ్గడంగానీ జరిగితే ఆప్షన్ ప్రీమియం పెరిగిపోవడంతో విక్రయించినవారు నష్టపోతారు. సూచీ వ్యతిరేక దిశలో కదలితే ప్రీమియం తగ్గడం ద్వారా లాభపడతారు. ఆప్షన్లను కొన్నవారు స్ట్రయిక్ దిశగా కదిలితే లాభపడతారు. -
ఆ షేర్లే హాట్ కేకులు...!
పలు అనుకూల, ప్రతికూల వార్తలతో స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నా, మార్కెట్ ట్రెండ్ మాత్రం మారుతున్నది. ఇన్వెస్టర్ల అమ్మకాలు, కొనుగోళ్ల దృక్పధంలో మార్పును సూచిస్తూ గతంలో పతనమైన రంగాల షేర్లు క్రమేపీ కోలుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో ర్యాలీ జరిపిన కొద్ది షేర్లు ఇటీవల అమ్మకాల ఒత్తిడిని చవిచూస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతాలోటు, ద్రవ్యలోటు తదితర కారణాలతో ఆర్థిక వ్యవస్థ ఇంకా పతనావస్థలో వున్నా, దేశ ఆర్థిక ఆరోగ్యస్థితిని ప్రతిబింబించే రంగాలకు చెందిన షేర్లు ఇటీవల పెరగడం విశేషం. ఇంకా వడ్డీ రేట్ల తగ్గుదల మొదలు కావొచ్చన్న సంకేతాలేవీ లేకపోయినా, అధిక వడ్డీ రేట్లతో ప్రభావితమయ్యే బ్యాంకింగ్, ఆటో, రియల్టీ రంగాల షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు మద్దతు లభించడం విశేషం. బ్యాంకింగ్, ఆటో, మెటల్స్ మెరుపులు... ఏడాదికాలంగా పలు దఫాలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు 20,500, 6,000 పాయింట్లపైకి పెరగడం, 18,500, 5,400 పాయింట్ల దిగువకు తగ్గడం జరిగింది. అయితే పెరిగిన ప్రతీ సందర్భంలోనూ ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు ర్యాలీ జరపడం, తగ్గినపుడు అధిక వడ్డీ రేట్లతో ప్రభావితమయ్యే రంగాలు క్షీణించడం జరిగిపోయేది. అయితే గత రెండు నెలలు, లేదా నెలరోజుల ట్రెండ్‌లో మార్పు జరిగినట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీలో భాగంగా వున్న 50 షేర్ల హెచ్చుతగ్గుల డేటా వెల్లడిస్తున్నది. గత 365 రోజుల్లో 10 నుంచి 35 శాతం మేర క్షీణించిన ప్రధాన బ్యాంకింగ్ షేర్లు నెలరోజుల నుంచి 1-12 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. ఈ నెలరోజుల నుంచి నిఫ్టీ సూచీ కూడా స్వల్పంగా తగ్గినప్పటికీ, మెటల్ షేరు టాటా స్టీల్ 20 శాతం పెరిగింది. ఏడాదిలో 50 శాతం పడిపోయిన రియల్టీ షేరు జేపీ అసోసియేట్స్ అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో 8 శాతం ఎగిసింది. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్నా, ఆటోమొబైల్ షేర్లు మారుతి, మహీంద్రా, టాటామోటార్స్కు మాత్రం ఏడాది నుంచి ప్రతీ క్షీణతలోనూ కొనుగోలు మద్దతు లభిస్తున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ... ఆయా కంపెనీలు మంచి ఫలితాలు వెల్లడించినా, రూపాయి మారకపు విలువ ఇంకా 63 స్థాయివద్దే వున్నా, ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి ఎగిసినా నెలరోజుల నుంచి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు క్షీణిస్తున్నాయి. ఏడాది నుంచి ఈ షేర్లు అతిపెద్ద ర్యాలీ జరపడం వల్ల సంవత్సరాంతపు లాభాల స్వీకరణ ఈ క్షీణతకు ఒక కారణమైతే, పెట్టుబడుల ట్రెండ్ మారడం మరో కారణమని బ్రోకింగ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. 2012 నవంబర్ నుంచి 56 శాతం పెరిగిన టీసీఎస్ ఈ ఏడాది సెప్టెంబర్ ఫలితాలు వెల్లడించినప్పటి నుంచి 8 శాతం పడిపోయింది. విప్రో, హెచ్‌సీఎల్ టెక్లది కూడా ఇదే తీరు. 2013 జూలై వరకూ స్టాక్ సూచీలు గరిష్టస్థాయిలో ట్రేడ్‌కావడానికి సహకరించిన ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ, హిందుస్థాన్ లీవర్లు నెల రోజుల నుంచి 3-7 శాతం మధ్య తగ్గాయి. సహజంగానే రాబోయే మార్పులను స్టాక్ మార్కెట్ ముందుగా డిస్కౌంట్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న సమస్యలు ఒక్కటొక్కటిగా తొలగిపోవచ్చన్న అంచనాలు మార్కెట్లో మొదలువుతున్నాయని, దాంతో కొనుగోళ్ల ట్రెండ్ మారిందని ట్రేడింగ్ వర్గాలు అంటున్నాయి. ఆగస్టు నుంచి బంగారం దిగుమతులు తగ్గడం, దేశంలోకి ఎన్నారైల రెమిటెన్సులు పెరగడం వంటి అంశాలతో వాణిజ్యలోటు, కరెంటు ఖాతాలోటు నాటకీయంగా తగ్గిందని, ఈ తగ్గుదల ఇలానే కొనసాగితే రూపాయి మారకపు విలువ బలపడి, ద్రవ్యోల్బణం దిగివస్తుందని, తర్వాత ఆటోమేటిక్‌గా రిజర్వుబ్యాంక్ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తుందనేది దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల అంచనా. ఏడు నెలల్లో కేంద్రంలో అధికారంలోకి రాబోయే కొత్త ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలను తీసుకొస్తుందన్న అంచనాల్ని గోల్డ్‌మాన్ శాక్స్, సీఎల్ఎస్ఏ తదితర అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు వెలువరించాయి. -
బ్యాంకింగ్ డౌన్.. ఐటీ అప్...
వరుసగా కొద్ది రోజుల నుంచి ర్యాలీ జరుపుతున్న బ్యాంకింగ్ షేర్లలో బుధవారం పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వల్పంగా వడ్డీ రేట్లు పెంచడం, రూపాయి మారకపు విలువ హఠాత్తుగా క్షీణించడంతో బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు జరిగాయి. రెండు వారాల నుంచి స్తబ్దుగా వున్న ఐటీ షేర్లలో కొనుగోళ్లు జరిగినప్పటికీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్, ఇన్ఫ్రా రంగాలకు చెందిన బ్లూచిప్‌లు బలహీనంగా ట్రేడ్‌కావడంతో స్టాక్ సూచీలు వారం రోజుల కనిష్టస్థాయి వద్ద ముగిసాయి. ట్రేడింగ్ తొలిదశలో 21,000 పాయింట్లస్థాయిని బీఎస్ఈ సెన్సెక్స్ అధిగమించగలిగినా, తదుపరి అమ్మకాల ఒత్తిడి కారణంగా 20,861 పాయింట్ల వద్దకు పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 80 పాయింట్ల (0.38 శాతం) నష్టంతో 20,895 పాయింట్ల వద్ద ముగిసింది. దీపావళి రోజున మూరత్ ట్రేడింగ్ సమయంలో నమోదుచేసిన 21,321 పాయింట్ల రికార్డుస్థాయి నుంచి ఇప్పటికే సెన్సెక్స్ 425 పాయింట్ల మేర నష్టపోయింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్ల వెయిటేజీ ఎక్కువగా వున్న ఎన్ఎస్ఈ నిఫ్టీ తాజా అమ్మకాలతో సెన్సెక్స్‌కంటే అధిక శాతం నష్టపోయింది. 38 పాయింట్ల (0.61 శాతం) క్షీణతతో 6,215 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ బుల్ ఆఫ్‌లోడింగ్.... వరుసగా రెండోరోజు నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో బుల్స్ వారి లాంగ్ పొజిషన్ల ఆఫ్‌లోడింగ్ కొనసాగించారు. సమీప భవిష్యత్తులో నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని చేరే సూచనలు కన్పించ కపోవడంతో మార్కెట్లో ఆఫ్‌లోడింగ్ జరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియను సూచిస్తూ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి మరో 8.87 లక్షల షేర్లు (4 శాతం) కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 2.15 కోట్ల షేర్లకు తగ్గింది. 6,300 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ కొనసాగడంతో తాజాగా 4.09 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. 6,200 స్ట్రయిక్ వద్ద పుట్ కవరింగ్ ఫలితంగా ఈ పుట్ ఆప్షన్ నుంచి 40,000 షేర్లు కట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లలోనూ సమానంగా 38 లక్షల షేర్ల బిల్డప్ చొప్పున వుంది. సమీప భవిష్యత్తులో 6,200 దిగువన నిఫ్టీ మరింత బలహీనపడొచ్చని, 6,300 దాటితే తిరిగి ఆప్ట్రెండ్ మొదలుకావొచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది. బుధవారం బ్యాంకింగ్ షేర్లు బాగా క్షీణించినా, బ్యాంక్ నిఫ్టీలో తాజా షార్ట్ బిల్డప్ జరిగిన సూచనలేవీ డేటాలో వెల్లడికాలేదు. -
బ్యాంకింగ్ స్టాక్స్.. టాప్‌గన్స్!
మూడేళ్ల నుంచి భారత్ స్టాక్ మార్కెట్ ర్యాలీ జరిపినపుడల్లా ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు సహకరిస్తుండగా, ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు మాత్రం బ్యాంకింగ్ షేర్లు నేతృత్వం వహిస్తున్నాయి. ఇతర రంగాల తోడ్పాటుతో స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని సాధించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా విఫలమయ్యాయి. కానీ సూచీల్లో 30 శాతం వెయిటేజీ వున్న బ్యాంకింగ్ షేర్లు పరుగులు తీయడంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఈ దఫా చరిత్రాత్మక గరిష్టస్థాయిని నమోదుచేయగలిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఆ రికార్డుకు కేవలం అరశాతం దూరంలో వుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఆగస్టు 28న 5,118 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైన తర్వాత రెండు నెలల్లో అత్యంతవేగవంతంగా ఆ సూచీ 23 శాతం ర్యాలీ జరిపితే, ఆ ప్రధాన సూచీని తలదన్నుతూ బ్యాంక్ నిఫ్టీ 38.82 శాతం పెరిగింది. ఇన్వెస్టర్లు భయపడుతున్నట్లు బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల శాతం ఆందోళనకరంగా పెరగలేదన్న అంశం ఇటీవలి ఆర్థిక ఫలితాల్లో వెల్లడికావడంతో ఈ షేర్ల ర్యాలీ సాధ్యపడిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇవే భయాలతో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకూ బ్యాంకింగ్ షేర్లు నిలువునా పతనమయ్యాయి. కానీ ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ప్రైవేటు బ్యాంకులు యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐల నిరర్థక ఆస్తులు నామమాత్రంగానే వుండటంతో పాటు వాటి వడ్డీ ఆదాయంలో 6-10 శాతం మధ్య వృద్ధి సాధించగలిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇంకా ఎస్బీఐ ఫలితాలు వెల్లడికావాల్సివుంది. అయితే ఇతర పీఎస్‌యూ బ్యాంకులు వెలువరించిన ఫలితాల్లో ఎన్పీఏల శాతం ప్రైవేటు బ్యాంకులంత తక్కువగా లేకపోయినా, ఇన్వెస్టర్ల అంచనాలకు కాస్త తక్కువగానే వుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పీఏలైతే తగ్గాయి కూడా. ఈ బ్యాంకు లాభం అనూహ్యంగా రెట్టింపయ్యింది. దాంతో ఈ షేరు అక్టోబర్ 30న ఒకేరోజున 21 శాతం ర్యాలీ జరపగలిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ గెయినర్.... బ్యాంక్ నిఫ్టీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 12 బ్యాంకులుండగా, గత రెండు నెలల ర్యాలీలో అన్నింటికంటే ఎక్కువగా బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరే 77.7 శాతం ఎగిసి రూ. 126 నుంచి రూ. 224 స్థాయికి చేరింది. తర్వాతి స్థానం యస్ బ్యాంక్ది. అయితే ప్రమోటర్ల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఇతర ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లకంటే ఎక్కువగా నష్టపోవడంతో ఈ షేరు రికవరీ (75%) అధికంగా వుంది. లార్జ్‌క్యాప్ బ్యాంకింగ్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్ 55% పెరగ్గా, ఐసీఐసీఐ బ్యాంక్ 49% ర్యాలీ జరిపింది. ఈ షేర్ల ర్యాలీకి ఆర్థిక ఫలితాలు ఆశావహంగా వుండటం ఒకటే కారణం కాదని, అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ సంస్థల పోర్ట్‌ఫోలియోల్లో బ్యాంకింగ్ షేర్లు క్రమేపీ తక్కువైనందున, హఠాత్తుగా ఈ షేర్లలో కొనుగోళ్లు మొదలయ్యాయని మార్కెట్ విశ్లేషకులు వివరిస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్లో మొండి బకాయిల శాతం బాగా పెరగవచ్చన్న అంచనాలున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ షేరు మాత్రం బ్యాంక్ నిఫ్టీకంటే వెనుకబడి వుంది. ఈ షేరు 29.88% పెరి గింది. దాదాపుగా ఆల్‌టైమ్ గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెరుగుదల శాతం సహజంగానే పరిమితంగా వుంది. కొద్ది సంవత్సరాలుగా ముఖ్య సూచీల ప్రధాన ర్యాలీలో పాలుపంచుకున్న ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు ఈ 8 వారాలుగా నిఫ్టీకంటే వెనుకబడ్డాయి. వీటి లాభాల వృద్ధిని ముందుగానే మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నందున, ఇవి ఫలితాల వెల్లడి తర్వాత ఇన్వెస్టర్లను ఆకర్షించలేకపోయాయి. ఈ రెండు నెలల్లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 7.4%, టీసీఎస్ 14.8 % చొప్పున పెరగ్గా, ఐటీసీ 15.7% ఎగిసింది. ఇక స్టాక్ సూచీల్లో 10% వెయిటేజీ వున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు పెరుగుదల 18.7 శాతమే. ఈ 4 షేర్లకు కలిపి నిఫ్టీలో 37% వరకూ వెయిటేజీ వుంది. బ్యాంకింగ్ షేర్లతో పోటీపడి పెరిగిన షేరు ఇన్ఫ్రా రంగానికి చెందిన ఎల్అండ్టీ ఆసరాతో నిఫ్టీలో ఈ ర్యాలీ సాధ్యపడింది. -
బుల్.. ధనాధన్
భారత్ స్టాక్ మార్కెట్ ఈసారి దీపావళికి ‘కొత్త’ కాంతులతో వెలిగిపోతోంది. బుల్ దూకుడుతో సెన్సెక్స్ గత ఆల్‌టైమ్ గరిష్టాన్ని అధిగమించి.. సరికొత్త చరిత్రను సృష్టించింది. శుక్రవారం సెన్సెక్స్ గత రికార్డు 21,207 పాయింట్లను వెనక్కినెట్టి... ఒకానొక దశలో 21,294 పాయింట్లను తాకింది. దీంతో మార్కెట్ వర్గాలు దీపావళికి ఒకరోజు ముందే పండుగ చేసుకున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల కొనసాగింపు ఇం‘ధనం’ కూడా మన మార్కెట్లలో జోష్ నింపింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరుకు ఢోకా లేదన్న అంచనాలు బలపడ్డాయి. వీటితోపాటు ఇతరత్రా అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు, దేశీయంగా కూడా వృద్ధి గాడిలో పడొచ్చన్న విశ్వాసం... వంటి కారకాలన్నీ మార్కెట్లను కొత్త మైలురాళ్ల దిశగా పరుగులు తీయిస్తున్నాయి. ఐదున్నర సంవత్సరాల నుంచి అందనిద్రాక్షగా ఇన్వెస్టర్లను ఊరిస్తున్న రికార్డును బీఎస్ఈ సెన్సిటివ్ ఇండెక్స్ ఎట్టకేలకు అందుకోగలిగింది. 2,008 జనవరి 10న సాధించిన 21,206.77 పాయింట్ల గరిష్టస్థాయిని ఛేదించడానికి గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమైనా, ఈ శుక్రవారం మాత్రం గురితప్పకుండా ఆ లక్ష్యాన్ని సెన్సెక్స్ అధిగమించింది. 21,294 పాయింట్ల వరకూ పెరిగి చరిత్రాత్మక గరిష్టస్థాయిని నమోదుచేసింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 32 పాయింట్ల లాభంతో 21,197 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కొత్త రికార్డును నెలకొల్పేందుకు గత మూడేళ్లలో సెన్సెక్స్ దాదాపు 10మార్లు ప్రయత్నించింది. 2,010 నవంబర్ 5,8 తేదీల్లో రెండు రోజులపాటు 21,100 పాయింట్లపైన ముగియగలిగినా, నూతన గరిష్టస్థాయిని చేరలేక వెనుతిరిగింది. తాజా ర్యాలీలో సెన్సెక్స్‌కంటే వెనుకబడి వున్న ఎన్ఎస్ఈ నిఫ్టీ కొత్త గరిష్టస్థాయికి మరో 50 పాయింట్ల దూరంలో వుంది. శుక్రవారం ఈ సూచీ 6,332 పాయింట్ల స్థాయివరకూ పెరిగి చివరకు 8 పాయింట్ల లాభంతో 6,307 పాయింట్ల వద్ద ముగిసింది. 2,008 జనవరి 8న నిఫ్టీ 5,357 పాయింట్ల రికార్డును నెలకొల్పింది. రెండోరోజూ బ్యాంకింగ్ జోరు... వరుసగా రెండోరోజు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. ఎస్బీఐ 4 శాతం పెరిగి రూ. 1,900 స్థాయిని సమీపించగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు సైతం 4.5 శాతం ఎగిసాయి. మిడ్‌సైజ్ బ్యాంకింగ్ షేర్లు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, దేనా బ్యాంక్‌లు రికార్డు ట్రేడింగ్ పరిమాణంతో 6-8 శాతం మధ్య పెరిగాయి. క్రితం రోజు 21 శాతం పెరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో 5 శాతం ర్యాలీ జరిపింది. ప్రైవే టు రంగ ఐసీఐసీఐ బ్యాంక్ వరుసగా నాలుగోరోజు పెరిగి రూ. 1,130 స్థాయిని చేరింది. ఇతర ఫైనాన్షియల్ షేర్లు ఐడీఎఫ్సీ, పీఎఫ్సీ, ఐఎఫ్సీఐలు 5-7 శాతం మధ్య పెరిగాయి. ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు కనిష్టస్థాయిల్లో ట్రేడవుతున్నందున, ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి మరల్చారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్ షేర్లకు తాజాగా రియల్టీ షేర్లు జతకలిసాయి. డీఎల్ఎఫ్, హెచ్‌డీఐఎల్, యూనీటెక్, జేపీ అసోసియేట్స్‌లు 3-10 శాతం మధ్య ర్యాలీచేసాయి. అక్టోబర్ ఆటోమొబైల్ అమ్మకాలు బావుండటంతో మహీంద్రా 4 శాతం పెరిగింది. బ్యాంకింగ్ షేర్లకు భిన్నంగా ఆయిల్, పవర్ రంగాలకు చెందిన ప్రభుత్వ కంపెనీల షేర్లు క్షీణించాయి. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్గ్రిడ్లు 2-3 శాతం మధ్య తగ్గాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా 21వ ట్రేడింగ్ సెషన్లో నికర పెట్టుబడులు చేసారు. వీరు రూ. 187 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ సంస్థలు రూ. 422 కోట్ల నికర అమ్మకాలు నిర్వహించాయి. సంవత్ 2,069లో 13.5 శాతం ర్యాలీ ఈ శుక్రవారంతో ముగిసిన హిందూ క్యాలండర్ సంవత్ 2,069లో బీఎస్ఈ సెన్సెక్స్ 13.5 శాతం ర్యాలీ జరపడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 8,19,804 కోట్ల మేర పెరిగింది. సంవత్ 2,068లో చివరి ట్రేడింగ్ రోజైన 2,012 నవంబర్ 12న సెన్సెక్స్ 18,670 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ ఏడాది కాలంగా సూచీ 2,526.47 పాయింట్లు ర్యాలీ జరిపి తాజాగా 21,196 పాయింట్ల వద్ద ముగిసింది. రేపు ముహూరత్ ట్రేడింగ్ దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ 3న ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తెలిపాయి. సాయంత్రం 6-15 గం. నుంచి రాత్రి 7-30 గం. దాకా 75 నిమిషాల సేపు లావాదేవీలు జరుగుతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.