బుల్.. ధనాధన్ | Sensex hits all-time high, Nifty closes above 6300 | Sakshi
Sakshi News home page

బుల్.. ధనాధన్

Published Sat, Nov 2 2013 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

బుల్.. ధనాధన్

బుల్.. ధనాధన్

భారత్ స్టాక్ మార్కెట్ ఈసారి దీపావళికి ‘కొత్త’ కాంతులతో వెలిగిపోతోంది. బుల్ దూకుడుతో సెన్సెక్స్ గత ఆల్‌టైమ్ గరిష్టాన్ని అధిగమించి.. సరికొత్త చరిత్రను సృష్టించింది. శుక్రవారం సెన్సెక్స్ గత రికార్డు 21,207 పాయింట్లను వెనక్కినెట్టి... ఒకానొక దశలో 21,294 పాయింట్లను తాకింది. దీంతో మార్కెట్ వర్గాలు దీపావళికి ఒకరోజు ముందే పండుగ చేసుకున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల కొనసాగింపు ఇం‘ధనం’ కూడా మన మార్కెట్లలో జోష్ నింపింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరుకు ఢోకా లేదన్న అంచనాలు బలపడ్డాయి. వీటితోపాటు ఇతరత్రా అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు, దేశీయంగా కూడా వృద్ధి గాడిలో పడొచ్చన్న విశ్వాసం... వంటి కారకాలన్నీ మార్కెట్లను కొత్త మైలురాళ్ల దిశగా పరుగులు తీయిస్తున్నాయి.
 
 ఐదున్నర సంవత్సరాల నుంచి అందనిద్రాక్షగా ఇన్వెస్టర్లను ఊరిస్తున్న రికార్డును బీఎస్‌ఈ సెన్సిటివ్ ఇండెక్స్ ఎట్టకేలకు  అందుకోగలిగింది.  2,008 జనవరి 10న సాధించిన 21,206.77 పాయింట్ల గరిష్టస్థాయిని ఛేదించడానికి గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమైనా, ఈ శుక్రవారం మాత్రం గురితప్పకుండా ఆ లక్ష్యాన్ని సెన్సెక్స్ అధిగమించింది. 21,294 పాయింట్ల వరకూ పెరిగి చరిత్రాత్మక గరిష్టస్థాయిని నమోదుచేసింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 32 పాయింట్ల లాభంతో 21,197 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
 
 కొత్త రికార్డును నెలకొల్పేందుకు గత మూడేళ్లలో సెన్సెక్స్ దాదాపు 10మార్లు ప్రయత్నించింది. 2,010 నవంబర్ 5,8 తేదీల్లో రెండు రోజులపాటు 21,100 పాయింట్లపైన ముగియగలిగినా, నూతన గరిష్టస్థాయిని చేరలేక వెనుతిరిగింది. తాజా ర్యాలీలో సెన్సెక్స్‌కంటే వెనుకబడి వున్న ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కొత్త గరిష్టస్థాయికి మరో 50 పాయింట్ల దూరంలో వుంది. శుక్రవారం ఈ సూచీ 6,332 పాయింట్ల స్థాయివరకూ పెరిగి చివరకు 8 పాయింట్ల లాభంతో 6,307 పాయింట్ల వద్ద ముగిసింది. 2,008 జనవరి 8న నిఫ్టీ 5,357 పాయింట్ల రికార్డును నెలకొల్పింది.
 
 రెండోరోజూ బ్యాంకింగ్ జోరు...
 వరుసగా రెండోరోజు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. ఎస్‌బీఐ 4 శాతం పెరిగి రూ. 1,900 స్థాయిని సమీపించగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు సైతం 4.5 శాతం ఎగిసాయి. మిడ్‌సైజ్ బ్యాంకింగ్ షేర్లు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, దేనా బ్యాంక్‌లు రికార్డు ట్రేడింగ్ పరిమాణంతో 6-8 శాతం మధ్య పెరిగాయి. క్రితం రోజు 21 శాతం పెరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో 5 శాతం ర్యాలీ జరిపింది. ప్రైవే టు రంగ ఐసీఐసీఐ బ్యాంక్ వరుసగా నాలుగోరోజు పెరిగి రూ. 1,130 స్థాయిని చేరింది. ఇతర ఫైనాన్షియల్ షేర్లు ఐడీఎఫ్‌సీ, పీఎఫ్‌సీ, ఐఎఫ్‌సీఐలు 5-7 శాతం మధ్య పెరిగాయి. ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు కనిష్టస్థాయిల్లో ట్రేడవుతున్నందున, ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి మరల్చారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
 
 బ్యాంకింగ్ షేర్లకు తాజాగా రియల్టీ షేర్లు జతకలిసాయి. డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఐఎల్, యూనీటెక్, జేపీ అసోసియేట్స్‌లు 3-10 శాతం మధ్య ర్యాలీచేసాయి. అక్టోబర్ ఆటోమొబైల్ అమ్మకాలు బావుండటంతో మహీంద్రా 4 శాతం పెరిగింది. బ్యాంకింగ్ షేర్లకు భిన్నంగా ఆయిల్, పవర్ రంగాలకు చెందిన ప్రభుత్వ కంపెనీల షేర్లు క్షీణించాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, పవర్‌గ్రిడ్‌లు 2-3 శాతం మధ్య తగ్గాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా 21వ ట్రేడింగ్ సెషన్లో నికర పెట్టుబడులు చేసారు. వీరు రూ. 187 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ సంస్థలు రూ. 422 కోట్ల నికర అమ్మకాలు నిర్వహించాయి.
 
 సంవత్ 2,069లో 13.5 శాతం ర్యాలీ
 ఈ శుక్రవారంతో ముగిసిన హిందూ క్యాలండర్ సంవత్ 2,069లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 13.5 శాతం ర్యాలీ జరపడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 8,19,804 కోట్ల మేర పెరిగింది. సంవత్ 2,068లో చివరి ట్రేడింగ్ రోజైన 2,012 నవంబర్ 12న సెన్సెక్స్ 18,670 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ ఏడాది కాలంగా సూచీ 2,526.47 పాయింట్లు ర్యాలీ జరిపి తాజాగా 21,196 పాయింట్ల వద్ద ముగిసింది.
 
 రేపు ముహూరత్ ట్రేడింగ్
 దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ 3న ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తెలిపాయి. సాయంత్రం 6-15 గం. నుంచి రాత్రి 7-30 గం. దాకా 75 నిమిషాల సేపు లావాదేవీలు జరుగుతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement