బ్యాంకింగ్‌లో అమ్మకాలు... ఫార్మాలో కొనుగోళ్లు
బుధవారంనాటి రిజర్వుబ్యాంక్ పరపతి సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు తప్పకపోవొచ్చన్న అంచనాలతో బ్యాంకింగ్ షేర్లు క్షీణించడంతో స్టాక్ సూచీలు వరుసగా ఆరో రోజు తగ్గాయి. ఆసియా మార్కెట్ల నుంచి అందిన పాజిటివ్ సంకేతాలతో మంగళవారం సెన్సెక్స్ గ్యాప్‌అప్‌తో 20,784 పాయింట్ల గరిష్టస్థాయి వద్ద ప్రారంభమైనా, తదుపరి అమ్మకాల ఒత్తిడికి తలొగ్గి 20,612 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 47 పాయింట్లు నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్ల క్షీణతతో 6,139 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అధిక వడ్డీ రేట్ల ప్రభావానికి లోనయ్యే బ్యాంకింగ్ షేర్లు తగ్గడంతో బ్యాంక్ నిఫ్టీ 1 శాతం నష్టపోయింది.
నిఫ్టీ ఆప్షన్లలో యాక్టివిటీ...
ఆర్‌బీఐ, ఫెడ్ రానున్న నిర్ణయాల నేపథ్యంలో నిఫ్టీ ఆప్షన్ కాం ట్రాక్టుల్లో యాక్టివిటీ జోరుగా సాగింది. ప్రధాన సంఘటనలపై ఇన్వెస్టర్లకు స్పష్టత లేనందున, ఫ్యూచర్ కాంట్రాక్టుల బదులు ఆప్షన్లలో పొజిషన్లకే మొగ్గుచూపినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 5.96 లక్షల షేర్లు (2.66 శాతం) కట్‌కావడంతో మొత్తం ఓఐ 2.18 కోట్ల షేర్లకు తగ్గింది. మరోవైపు నిఫ్టీ 6,200, 6,300 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్, 6,100, 6,000 స్ట్రయిక్స్ వద్ద పుట్ రైటింగ్ జరి గింది. దాంతో పైన ప్రస్తావించిన కాల్ ఆప్షన్లలో 5.59 లక్షలు, 5,50 లక్షల షేర్ల చొప్పున యాడ్ కాగా, పుట్ ఆప్షన్లలో 4,44 లక్షలు, 3.72 లక్షల షేర్ల చొప్పున యాడ్ అయ్యాయి.
కాల్ ఆప్షన్లలో అధికంగా 6,300 స్ట్రయిక్ వద్ద అధికంగా 73 లక్షల షేర్లు, పుట్ ఆప్షన్లలో ఎక్కువగా 6,000 స్ట్రయిక్ వద్ద 59.87 లక్షల షేర్ల ఓఐ వుంది. ఆయా సంఘటనల తర్వాత వెలువడే అనుకూల, ప్రతికూల వార్తలకు అనుగుణంగా నిఫ్టీ పెరిగితే 6,300 స్థాయి అవరోధాన్ని కల్పించవచ్చని, తగ్గితే 6,000 స్థాయి మద్దతునివ్వవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. స్పాట్ ధరతో సంబంధం లేకుండా కొంత ప్రీమియం ధరకు ఆప్షన్ కాంట్రాక్టును విక్రయిం చడాన్ని రైటింగ్ అంటారు. అలా రైట్ చేసిన స్ట్రయిక్ దిశగా సూచీ పెరగడం గానీ, తగ్గడంగానీ జరిగితే ఆప్షన్ ప్రీమియం పెరిగిపోవడంతో విక్రయించినవారు నష్టపోతారు. సూచీ వ్యతిరేక దిశలో కదలితే ప్రీమియం తగ్గడం ద్వారా లాభపడతారు. ఆప్షన్లను కొన్నవారు స్ట్రయిక్ దిశగా కదిలితే లాభపడతారు.